breaking news
UNESCO report
-
2026 నాటికి పూర్తి చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయం చుట్టూ అభివృద్ధి పనులు, పురాతన అనుబంధ దేవాలయాల పునరుద్ధరణ 2026 మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్.. సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)కు స్పష్టం చేసింది. ఈ మేరకు సమగ్ర నివేదికను ఆ సంస్థ అనుబంధ విభాగం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకొమాస్)కు సమర్పించింది. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్పను గతేడాది యునెస్కో గుర్తించిన విషయం తెలిసిందే. యునెస్కో నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. అందు కు 8 అంశాలను సూచిస్తూ, వాటి ప్రకారం పనులు ఎలా చేస్తా రో, ఎప్పటిలోగా చేస్తారో డిసెంబర్ వరకు నివేదిక అందజేయా లని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కాకతీయ హెరిటేజ్ ట్రస్టుతో సంప్రదించి రూపొందించిన నివేదికను తాజా గా ఐకొమాస్‌కు ఏఎస్ఐ సమర్పించింది. ఏం చేస్తారు..?: రామప్ప ఆలయం పక్కనే అదే సమయంలో నిర్మించిన కామేశ్వరాలయాన్ని పునరుద్ధరించడం కీలకం. 33 మీటర్ల వెడల్పు, 33 మీటర్ల పొడవుతో ఉండే ఈ మహా మండపాన్ని వేయి స్తంభాల మండపం తరహాలో పునరుద్ధరిస్తారు. 2023, జూన్ నాటికి ప్రదక్షిణ పథం వరకు, 2026, మార్చి నాటికి కక్షాసనతో పూర్తి పునరుద్ధరణ జరుగుతుందని యునెస్కోకు ఏఎస్ఐ తెలిపింది. 3 మీటర్ల లోతు నుంచి సాండ్ బాక్స్ పరిజ్ఞానంతో పునాదులు నిర్మిస్తారు. 8 శతాబ్దాల కిందట ఈ ఆలయం కట్టినప్పుడు వాడిన ఇసుకనే మళ్లీ వాడనున్నారు. దానిమీద అర మీటరు మందంతో డంగు సున్నం, ఇటుకలతో వేదిక నిర్మించి దానిమీద రాళ్లతో ప్రధాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించనుండటం విశేషం. రామప్ప చెరువు వద్దకు వెళ్లే దారిలో శిథిలమైన చిన్న ఆలయాలను, రామప్పకు చేరువలో నర్సాపూర్‌లోని చెన్నకేశవస్వామి, కొత్తూరులోని దేవునిగుట్ట, బుస్సాపూర్‌లోని నరసింహస్వామి ఆలయాలతోపాటు జాకారంలోని శివాలయం, రామానుజాపూర్లోని పంచకూటాలయాలను పునరుద్ధరించారు. రామప్పకు 25 కి.మీ. పరిధిలో టూరిజానికి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తారు. పర్యాటకులకు సమస్త వసతులుండాలని యునెస్కో సూచించిన నేపథ్యంలో ఆ వివరాలను ఇందులో పొందుపర్చారు. దీని పరిధిలో ఉండే గ్రామాల అభివృద్ధి ఎలా ఉండాలో నిర్ధారిస్తూ ఓ పట్టణ ప్రణాళికను రూపొందించారు. వ్యవసాయానికి రామప్ప చెరువు నుంచి నీటిని మళ్లించే చానళ్లు, చెరువు కట్ట అభివృద్ధి చేయనున్నట్లు నివేదికలో పేర్కొ న్నారు. పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పనులు జరుగనున్నాయి. రామప్ప ఆలయ వైభవాన్ని పెంచడం, అక్కడి పవిత్రతను కాపాడటం, పురాతన కట్టడానికి ఏ రకంగానూ నష్టం వాటిల్లకుండా వ్యవహరించడం.. స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు, అర్చకులకు అవగాహన సదస్సులు నిర్వహించడం లాంటివి నివేదికలో పొందురుపర్చారు. అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రూ.15 కోట్లను ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంజూరు చేశారు. ఆ నిర్మాణాలతో పోలికలు పంపండి: యునెస్కో ఇప్పటికే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కట్టడాలతో రామప్పను పోలుస్తూ నివేదిక సమర్పించాలని యునెస్కో కోరింది. నిర్మాణానికి వాడిన రాయి, పునాదిలో వినియోగించిన పరిజ్ఞానం, ఆలయ నగిషీలు, శిల్పకళారీతుల వర్ణన, నాట్యరీతులతో కూడిన శిల్పాలకు సంబంధించి ఖజురహో, హంపి, తంజావూరు బృహదీశ్వరాలయం, పట్టదకల్లు, బాదామీ ఆలయాలతో పోలుస్తూ నివేదికను సమర్పించారు. కంబోడియా, థాయ్‌లాండ్ లాంటి దేశాల్లోని ఆలయాలతో పోలుస్తూ వచ్చే డిసెంబర్ నాటికి నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు. -
స్కూళ్లను కాదని ఆన్‌లైన్‌కు వెళితే.. చదువుకు చెద!
నిరంతరాయంగా పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. పేదలు, అణగారిన వర్గాల పిల్లలు చాలా నష్టపోతారు. అసమానతలు పెరిగి, సమాజంపై దుష్ప్రభావం పడుతోంది. పిల్లల్లో డ్రాపవుట్లకు దారితీస్తోంది. పాఠశాలలు తెరిచిన తరువాత బాలలకు సరైన సామర్థ్యాలు లేక స్కూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. చివరకు వారు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. – యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) నివేదిక సాక్షి, అమరావతి: కరోనా మూడో వేవ్ ఉన్నప్పటికి, విద్యార్థుల భవిష్యత్తు, అభ్యసన సామర్థ్యం దెబ్బతినకుండా విద్యా సంస్థలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రొటోకాల్‌కు అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు రాకుండా పటిష్టమైన జాగ్రత్తలతో విద్యాసంస్థల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) కూడా పాఠశాలలను తెరవాలనే చెబుతోంది. విద్యా సంస్థలను తెరిచి, ప్రత్యక్ష బోధనే మేలని వెల్లడించింది. పాఠశాలల మూసివేత వల్ల విద్యార్థులు, ముఖ్యంగా పేద, బడుగు బలహీనవర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతారని తెలిపింది. ఉన్నత, పేద వర్గాలకు మధ్య అసమానతలు మరింత పెరుగుతాయని, ఇది సమాజంపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీని పర్యవసానాలపై యునెస్కో అంతర్జాతీయంగా అనేక కోణాల్లో అధ్యయనం చేసి, ఇటీవల ‘కోవిడ్–19 ఎడ్యుకేషన్ రెస్పాన్స్’ పేరిట నివేదికను విడుదల చేసింది. విద్యా సంస్థల మూసివేత వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు.. అంతిమంగా సమాజానికి ఎంతటి నష్టమో వివరించింది. ప్రత్యక్ష బోధన లేక సామర్థ్యాలు, నైపుణ్యాలకు దెబ్బ పాఠశాలలు తెరచి ప్రత్యక్ష బోధన చేయడం వల్ల విద్యార్థులకు ఆశించిన మేరకు అభ్యాసన సామర్థ్యాలు లభిస్తాయి. పాఠశాలలు మూసివేస్తే వారిలో ఉన్న అభ్యసన సామర్థ్యాలను కూడా కోల్పోతున్నారు. సందేహాలు తీర్చే వారుండరు. వారిలోని లోపాలను సరిచేసే వారుండరు. దీంతో వెనుకబాటుకు గురవుతున్నారు. గత రెండేళ్లలో పాఠశాలలు మూతపడి ఈ సమస్య చాలా పెరిగిందని అసర్ సర్వే కూడా తేటతెల్లం చేసింది. స్కూళ్ల మూసివేత వల్ల అట్టడుగు వర్గాల పిల్లలు మరింతగా నష్టపోతారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకు వచ్చే పిల్లల్లో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో అత్యధికులు పేద వర్గాల వారే. వీరికి సరైన ఆహారమూ ఇళ్లలో అందదు. పాఠశాలలు తెరిస్తే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందుతుంది. లేకపోతే ఆ ఆహారమూ లేక ఆకలితో అలమటిస్తారు. సరైన ఆహారం అందక శారీరక ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. డిజిటల్ పరికరాల లేమి ఆన్లైన్ బోధనకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా శాఖ తగిన ఏర్పాట్లు చేస్తున్నా, ఈ స్కూళ్లలో చదివేది అత్యధికులు నిరుపేద విద్యార్థులే. వారికి డిజిటల్ పరికరాలు లేక ఆన్లైన్ బోధనను అందుకోలేకపోతున్నారు. మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల పిల్లలు మరింత వెనుకబాటుకు లోనవుతున్నారు. వారి కోసం దూరదర్శన్, ఆలిండియా రేడియోల ద్వారా పాఠాలను ప్రసారం చేయిస్తున్నా, టీవీ లేని వారికి అవీ అందడంలేదు. పాఠాలు ప్రసారమయ్యే సమయాల్లో పిల్లలను టీవీలు, రేడియోల ముందు కూర్చోబెట్టి వాటిని నేర్చుకొనేలా చేసే అవకాశం పనులకు వెళ్లిపోయే ఆ పేద తల్లిదండ్రులకు ఉండడంలేదు. డిజిటల్ పరికరాలు ఉన్న టీనేజ్ పిల్లలు కొన్ని సందర్భాల్లో ఇతర దురలవాట్లకు లోనయ్యే ప్రమాదమూ ఉంటోంది. వాటి ద్వారా పాఠాల అభ్యసనానికి బదులు ఇతర దుష్ప్రభావాలకు లోనవుతున్నారు. అదే స్కూళ్లు తెరిచి ఉన్నప్పుడు పిల్లల చదువు సంధ్యలను టీచర్లు పర్యవేక్షిస్తారు. పాఠశాలలు మూసివేత వల్ల వైరస్ భయంతో పెద్దలు పిల్లలను బయట కూడా తిరగనివ్వడంలేదు. పిల్లలు ఇళ్లలోనే మగ్గిపోయి, మానసికంగా అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లల సంరక్షణ, ఆర్థిక సమస్యలు ఇతర కారణాలతో పెద్దల ఆరోగ్యమూ దెబ్బతింటోంది. ఇది ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోందని యునెస్కో అభిప్రాయపడింది. బాల్య వివాహాలు పాఠశాలలు మూతపడి స్కూళ్లకు వెళ్లాల్సిన టీనేజ్ ఆడ పిల్లలు ఇళ్లకే పరిమితమై పోతుండడంతో తల్లిదండ్రులు వారికి పెళిŠల్ చేసే ఆలోచనలు చేస్తున్నారు. ఇది బాల్య వివాహాలకు దారితీస్తోంది. కొన్ని చోట్ల ఇళ్లకే పరిమితమై ఉండే బాలికలపై లైంగిక వేధింపులు కూడా జరుగుతున్నట్లు యునెస్కో వివరించింది. ఉపాధ్యాయులకూ సమస్యే పాఠశాలలు తెరిస్తే ఉపాధ్యాయులు నేరుగా బోధిస్తారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుస్తారు. పిల్లలతో నేరుగా సంభాషించి, వారిలోని లోపాలను అప్పటికప్పుడు సరిచేస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు. అదే స్కూళ్లు మూతపడితే ఆన్లైన్లోనో, డిజిటల్ విధానం, వాట్సప్, ఇతర ప్రక్రియల ద్వారా బోధించాలి. విద్యార్ధులతో నేరుగా మాట్లాడలేరు. వారి సామర్థ్యాలను అంచనా వేయలేరు. మరోవైపు పాఠ్యాంశాలను ఆన్లైన్, డిజిటల్ ప్రక్రియల్లోకి మార్చడం కూడా టీచర్లకు సమస్యే. వీడియోలో రికార్డు చేసి బోధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ కంటెంట్లను విద్యార్థులకు సరిగా అందించలేక ఎక్కువ శాతం టీచర్లు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. ఆన్లైన్ బోధన వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాలు కూడా సరిగా ఉండవని యునెస్కో వెల్లడించింది. గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా కోవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. అనివార్య పరిస్థితుల్లో పిల్లలందరినీ వారి సామర్థ్యాలు, ప్రతిభతో సంబంధం లేకుండా ఆల్‌పాస్‌గా ప్రకటించాల్సి వచ్చింది. తల్లిదండ్రులపైనా తీవ్ర ఒత్తిడి పాఠశాలల మూత వల్ల పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోన్లు, కంప్యూటర్లు వంటివి అందించడం పెద్ద సమస్యగా మారింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వీటి కోసం అప్పుల పాలవుతున్నాయి. చాలామంది వీటిని సమకూర్చలేక పిల్లల చదువులపై ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలకు ఆ పరికరాలు సమకూర్చినా, చదువులు ఎలా సాగుతున్నాయోనని పర్యవేక్షణ మరో సమస్య. వాటి వినియోగంలో పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో అర్థంకాక అయోమయంలో పడుతున్నారని యునెస్కో తెలిపింది. పాఠశాలలకూ ఆన్లైన్ వనరులు సమకూర్చడం సమస్యే పాఠశాల తరగతిలో బోధన జరిగితే స్కూళ్ల యాజమాన్యాలు ఉన్న వనరులతో మంచి ఫలితాలు సాధించే వీలుంటుంది. పాఠశాలలు మూసివేస్తే ఆన్లైన్ బోధనకు ఏర్పాట్లు చేయడం స్కూళ్లకూ సమస్యగా మారింది. ఆన్లైన్ బోధనకు అనువుగా పోర్టళ్లు, కంటెంట్‌ను రూపొందించాలి. ఇవన్నీ యాజమాన్యాలకు తలకుమించిన భారం. వీడియో కంటెంట్లు, లైవ్ ఆన్లైన్ తరగతులు కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో కూడా పరిమితంగానే అమలవుతున్నాయి. బడ్జెటరీ పాఠశాలల్లో అదీ ఉండడం లేదు. ఏపీలో అనేక జాగ్రత్తలతో పాఠశాలలు పాఠశాలల మూసివేత వల్ల అనేక నష్టాలు, పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఉండడంతో రాష్ట్రంలో పాఠశాలలను కొనసాగించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ çపూర్తిస్థాయి జాగ్రత్తలతో విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసింది. 15 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా యుద్ధప్రాతిపదికన టీకాలు వేస్తోంది. ప్రభుత్వ చర్యలతో సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రారంభమైన స్కూళ్లకు తొలి రోజే 61 శాతం మంది పిల్లలు హాజరవడం విశేషం. ఆన్లైన్ కంటే ఆఫ్‌లైన్ మేలు మానసిక కోణంలో ఆలోచిస్తే విద్యార్ధులకు శిక్షణ, క్రమశిక్షణ చాలా అవసరం. పాఠశాలలు చదువు చెప్పే కేంద్రాలే కావు. పిల్లల్లో సమగ్రమైన అభివృద్ధికి, భావి పౌరులుగా తీర్చిదిద్దే సంస్థలు. పిల్లల్లోని ఎమోషన్సును బేలెన్సు చేసేవి స్కూళ్లే. ఎక్కువ సమయం స్కూల్లోనే ఉంటారు కనుక అనేక అంశాలు నేర్చుకుంటారు. టీచర్ నేరుగా చెప్పడం ద్వారానే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. సాధ్యమైన మేరకు తరగతులు నిర్వహించడమే మంచిది. పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించడమే మేలు. – డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, సైకాలజిస్టు, విజయనగరం స్కూళ్లు మూస్తే నష్టం స్కూళ్లు మూసివేయడం వల్ల గత రెండేళ్లుగా మా పిల్లలు చాలా నష్టపోయారు. ఆన్లైన్ బోధన వల్ల పాఠాలేవీ నేర్చుకోలేదు. వారి పరిస్థితి చూసి మాకే కష్టమనిపించింది. ఇప్పుడు కూడా స్కూళ్లు మూసివేస్తే మరింత నష్టపోతారు. కరోనా ఉన్నా మాస్కులు వేసి స్కూళ్లకు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలు నడిపించడమే మంచిది. – పెద్దిరెడ్డి (విద్యార్థి తండ్రి) పడమటి యాలేరు, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా అన్నీ తెరిచే ఉన్నాయిగా.. సినిమా హాళ్లు, షాపులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, మార్కెట్లు అన్నీ తెరిచే ఉంటున్నాయి. పండగలు, జాతరలు, ఉత్సవాలూ వేలాది మందితో జరుగుతున్నాయి. వాటివల్ల రాని కరోనా సమస్య పాఠశాలలు తెరిస్తే వస్తుందా? రెండేళ్లుగా పాఠశాలలు సరిగా తెరవకపోవడం వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికీ స్కూళ్లు మూసే ఉంటే వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లలోనే పాఠాలు చెప్పాలి. – శ్రీధర్, ప్రభుత్వ ఉద్యోగి, అనంతపురం మరింత నష్టపోకూడదు పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లు తెరవడమే మేలు. ఇప్పటికే రెండు విద్యా సంవత్సరాలు పిల్లలు నష్టపోయారు. వారు మరింత నష్టపోకుండా స్కూళ్లలోనే బోధన జరగాలి. పిల్లలకు వ్యాక్సిన్ వేస్తున్నందున ఎలాంటి ఇబ్బంది రాదు. – ఓబుళపతి, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
జర్నలిస్ట్‌ల హంతకులకు శిక్షలు పడడం లేదు
లండన్: గత రెండేళ్ల(2017,2018)లో 55% జర్నలిస్ట్‌ల హత్యలు ఘర్షణాత్మక వాతావర ణం లేని ప్రాంతాల్లోనే జరిగాయని యునె స్కో ఒక నివేదికలో పేర్కొంది. నేరాలు, అవినీతి, రాజకీయాలపై పాత్రికేయులు జరిపిన రిపోర్టింగ్ కారణంగానే ఈ హత్యలు జరిగాయని దీని ద్వారా స్పష్టమవుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2006 నుంచి 2018 మధ్య 1109 మంది జర్నలిస్ట్‌లు హత్యకు గురి కాగా, ఆ హత్యలకు బాధ్యులైన వారిలో 90% మందికి శిక్షలు పడలేదని వెల్లడించింది. నవంబర్ 2ను ‘ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఇంప్యూనిటీ ఫర్ క్రైమ్స్ అగైనెస్ట్ జర్నలిస్ట్స్’ గా జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో శుక్రవారం ఈ ‘ఇంటెన్సిఫైడ్ అటాక్స్, న్యూ డిఫెన్సెస్’ అనే నివేదికను విడుదల చేసింది. 2014 కన్నా ముందు ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్యల కన్నా 2014 తరువాతి ఐదేళ్లలో జరిగిన జర్నలిస్ట్‌ల హత్య లు 18% పెరిగాయని ఆ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా పాత్రికేయుల హత్యల్లో 30% అరబ్ దేశాల్లో, 26% లాటిన్ అమెరికా కరేబియన్ ప్రాంతంలో, 24% ఆసియా పసిఫిక్ దేశాల్లో చోటు చేసుకున్నాయని పేర్కొంది. -
చదువురాని పెద్దలు 28 కోట్లు
ఐరాస: జనాభాలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య కూడా అత్యధికంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. దాదాపు 28.7 కోట్ల మంది భారతీయులకు సరస్వతీ కటాక్షం లేదని పేర్కొంది. వాస్తవానికి దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెరిగినా జనాభా సంఖ్య పోటీగా ఎగబాకటంతో నిరక్షరాస్యుల శాతంలో మార్పులేదని వివరించింది. ఐరాస విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) ప్రచురించిన ‘అందరికీ విద్య-అంతర్జాతీయ పర్యవేక్షణ 2013/14’ నివేదికలో ఈ వివరాలను పొందుపరిచింది. యునెస్కో నివేదికలో ముఖ్యాంశాలు.. అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో 37 % మంది భారతీయులే. సంపన్న, పేద భారతీయుల విద్యాస్థాయిల్లో తారతమ్యాలు అధికం. భారత్‌లో 1991లో అక్షర్యాసత శాతం 48 కాగా 2006 నాటికి ఇది 63కి పెరిగింది. వృద్ధి చెందుతున్న జనాభా సంఖ్య వల్ల నిరక్షరాస్యులూ పెరుగుతున్నారు. భారత్‌లో సంపన్న యువతులు అంతర్జాతీయ అక్షరాస్యతా స్థాయిని చేరుకున్నారు. పేదలు మాత్రం వెనకబడే ఉన్నారు. - అణగారిన వర్గాలు అక్షరాస్యతను సాధించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. లేదంటే ప్రయోజనాలు కొందరికే పరిమితమవుతాయి. - చదువులపై అంతర్జాతీయంగా ప్రభుత్వాలు ఏటా సుమారు రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. - ప్రాథమిక విద్యపై ప్రపంచ దేశాలు వెచ్చిస్తున్న వ్యయంలో 10 శాతం నాసిరకం విద్యా ప్రమాణాల వల్ల నిరుపయోగంగా మారుతోంది. ఈ - ప్రభావం పేద దేశాలపై పడుతోంది. అక్కడ ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు కనీసం ఒక్క వాక్యం కూడా చదవటంలో విఫలమవుతున్నారు. - కేరళలో ఒక్కో విద్యార్థిపై ఏటా ప్రభుత్వం రూ.43,000 చదువు కోసం ఖర్చు చేస్తోంది. - భారత్‌లోని సంపన్న రాష్ట్రాల్లోనూ గణితశాస్త్రంలో పేద బాలికల ప్రదర్శన అట్టడుగు స్థాయిలో ఉంది. - యూపీ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పేదరికం ప్రభావం బాలికలపై అధికంగా ఉంది. ఐదో తరగతి కూడా దాటడం గగనమవుతోంది. ఐదుగురిలో ఒక్క బాలికకు కూడా గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు లేవు. - అరకొరగా చదివే విద్యార్థులు త్వరగా బడికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. - కొన్ని దేశాల్లో ఉపాధ్యాయ సంఘాల కృషి ఫలితంగా మెరుగైన ఫలితాలు దక్కాయి. - ఉపాధ్యాయుల గైర్హాజరు కూడా ప్రభావం చూపుతోంది. టీచర్లు తరగతిలో బోధన కంటే ప్రైవేట్‌గా ట్యూషన్లు చెప్పటం తదితర అంశాల వల్ల పేద విద్యార్థుల సామర్థ్యం కుంటుపడుతోంది.