Today Corona Strain Cases in Hyderabad | 200 UK Returns Tested Positive - Sakshi
Sakshi News home page

విదేశాల నుంచి రాష్ట్రానికి బ్రిటన్‌ స్ట్రెయిన్

Published Mon, Mar 8 2021 8:24 AM

UK Covid Strain Cases In Telangana Who Came From Foreign Countries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు. ఈ పరీక్షల్లో బ్రిటన్‌ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనూ బ్రిటన్‌ స్ట్రెయిన్‌ ఉన్నట్లు గుర్తించారు. జనవరి 10వ తేదీ నుంచి ఇప్పటివరకు బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిని, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 15 దేశాల నుంచి వచ్చినవారినీ కలిపితే మొత్తం 20 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగారు.

వీరంతా విదేశాల్లోనే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని వచ్చినప్పటికీ... ఇక్కడ దిగాక కొందరిలో లక్షణాలు కనపడటంతో మళ్లీ టెస్టులు నిర్వహించారు. వీరిలో దాదాపు 200 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయా శాంపిళ్లను సీసీఎంబీకి పంపగా, అందులో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ ఉన్నట్లు తేలిందని అధికారులు చెబుతున్నారు. ఇలా వివిధ దేశాల నుంచి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ రాష్ట్రంలోకి వస్తుండటంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. తప్పుడు చిరునామా, ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల ఇద్దరికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వచ్చి నా... వారిని పట్టుకోవడం అధికారులకు సవాల్‌గా మారింది.

చదవండి: 60 ఏళ్లు పైబడ్డ వాళ్లు టీకా తీస్కోండి

Advertisement

తప్పక చదవండి

Advertisement