మద్యం ప్రియుల్లో ‘నయా’ జోష్‌ .. తాగండి.. ఊగండి..! కానీ

TS Govt Extends Bars And Liquor Shops Timings For New Years Eve - Sakshi

సాక్షి, పెద్దపల్లి (కరీంనగర్‌): మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిసెంబర్‌ 31 సందర్భంగా మద్యం షాపులకు ఆంక్షలను ఎత్తివేసింది. పైగా అర్ధరాత్రి వరకు మద్యంషాపులు తెరిచి ఉంచవచ్చని, బార్లు ఒంటిగంట వరకూ నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఈవెంట్లు కూడా చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ కావడంతో మద్యంప్రియుల్లో జోష్‌ నెలకొంది. జిల్లావ్యాప్తంగా 77 మద్యం షాపులు ఉన్నాయి.

గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లో బార్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కషాప్‌ నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు అమ్మకాలు జరుగుతాయి. శుభకార్యాలు ఉంటే మరింత పెరుగుతాయి. అయితే డిసెంబర్‌ 31 అంటేనే యువతలో తెలియని జోష్‌ ఉంటుంది.

మద్యంతో విందులు చేసుకుంటూ సరదాగా గడుపుతారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటల వరకే వైన్స్‌షాపులు మూసివేయాలి. కానీ.. ఈ 31న మాత్రం అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటే వెసులుబాటు కల్పించింది. ఈవెంట్లు నిర్వహించుకునేవారు మాత్రం ఎక్సైజ్‌ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

బయటకొస్తే తాట తీస్తారు..
డిసెంబర్‌ 31 సందర్భంగా మద్యంషాపులపై ఆంక్షలు ఎత్తేసిన ప్రభుత్వం పోలీసులకు మాత్రం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా గుంపులు, గుంపులుగా కనిపించినా.. తాగి బయటకొచ్చినా పోలీసులు వదలరు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఒకవేళ మద్యం తాగి పోలీసులకు చిక్కితే మాత్రం కటకటాల్లోకి పంపించనున్నారు. ఎవరి ఇళ్లలో వారే పార్టీ చేసుకోవాలని, బయటకొస్తే మాత్రం తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.    

ఇప్పటికే జోరందుకున్న అమ్మకాలు
డిసెంబర్‌ 31 నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వైన్స్‌షాపులు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని తెలిసినా.. పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ మద్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే తనిఖీలు చేపడతామని, ఎవరు పట్టుబడినా.. జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

నిబంధనలు పాటించాలి
నిబంధనలు అందరూ పాటించాలి. ఎవరి ఇళ్లలో వారే సెలబ్రేషన్‌ చేసుకోవాలి. బయటకు రావొద్దు. జనజీవనానికి ఆటంకం కలిగించొద్దు. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం తీసుకెళ్లొచ్చు. అయితే అప్పటికే తాగి ఉండరాదు. ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్‌ ఉంటుంది. అందులో పట్టుబడితే జైలుకు పంపిస్తాం. ఇందులో అనుమానం లేదు.

– ఇంద్రసేనారెడ్డి, సీఐ, సుల్తానాబాద్‌ 

చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: విష్ణువర్ధన్‌  వైద్యానికి భరోసా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top