సాక్షి,హైదరాబాద్: తోటి మహిళా ట్రైనీ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని భారీ భద్రత నడుమ చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించిన కేసులో అరెస్టయిన సస్పెండెడ్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్, కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డికి, బాధితురాలికి మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి క్రిమినల్ వేధింపులకు దిగాడు. బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ చాట్స్, ఫొటోలను సోషల్ మీడియాలో బయటపెడతానంటూ తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. నకిలీ అకౌంట్లతో కుటుంబసభ్యులు, సహచరులకు వేధింపులుబాధితురాలిని మానసికంగా వేధించడమే కాకుండా, ఉదయ్ కృష్ణారెడ్డి నకిలీ (ఫేక్) సోషల్ మీడియా అకౌంట్లను సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ నకిలీ ఖాతాల ద్వారా బాధితురాలి కుటుంబసభ్యులకు, ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న సహచర అధికారులకు (బ్యాచ్‌మేట్స్) మెసేజ్‌లు పంపుతూ, తప్పుడు ప్రచారం చేస్తూ వేధించాడని డీసీపీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైన తర్వాత దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలిసి పరారయ్యాడు. అయితే, నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. చివరకు ఆయనను ఆరంఘర్ చౌరస్తా వద్ద పక్కా ప్లాన్‌తో అదుపులోకి తీసుకున్నారు.
ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన ఆత్మహత్య బెదిరింపులు, తీవ్ర మానసిక వేధింపుల కేసును షీటీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలను సేకరించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.


