‘బలగం’ సిద్ధం చేద్దాం

TPCC focus on the formation of mandal and district committees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయి బలగాన్ని సిద్ధం చేస్తోంది. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం మండల, జిల్లా కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ దృష్టి సారించింది. అందులో భాగంగా ఈనెల 20లోపు రాష్ట్రంలోని అన్ని మండలాల పార్టీ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని పార్లమెంటు ఇన్‌చార్జులను ఆదేశించింది. సామాజిక సమతుల్యతను పాటించడంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు ప్రాతినిధ్యం లభించేలా చూడాలని సూచించింది. మండల కమిటీల ఏర్పాటు అనంతరం జిల్లా కమిటీలను కూడా నియమించనున్న టీపీసీసీ.. సంస్థాగత నిర్మాణ ప్రక్రియను రెండు నెలల్లో ముగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.  

డీసీసీల సమన్వయంతో... 
పార్టీ జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకుంటూ ప్రతిపాదనలు పంపాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ సూచించారు. ఈ మేరకు సోమవారం పార్లమెంటు ఇన్‌చార్జీలకు లేఖలు రాశారు. ప్రతి కమిటీలో మండలాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారితో పాటు ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 21 మంది సభ్యులను తీసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు కలిపి 25 శాతం, ఓబీసీలకు 25 శాతం తగ్గకుండా పదవులు ఇవ్వాలని, మండల కమిటీ సభ్యుల్లోని 21 మందిలో కనీసం ఆరుగురు మహిళలుండాలని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు లేదంటే కనీసం ఒక్కరైనా కమిటీలో ఉండాలని, అన్ని వర్గాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం లభించేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 20 కల్లా గాంధీభవన్‌కు ప్రతిపాదనలు అందితే.. ఆ తర్వాత 10 రోజుల్లో కమిటీలను అధికారికంగా ప్రకటించనున్నారు. అప్పటిలోగా కమిటీలు ఎక్కడ ప్రకటించినా చెల్లుబాటు కావని, మండల కమిటీలను ఏర్పాటు చేసే అధికారం డీసీసీ అధ్యక్షులకు లేదని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

వెంటనే జిల్లా కమిటీలు 
మండల కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలను నియమించనున్నారు. ‘ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల సభ్యత్వం పూర్తికాగా, ప్రతి పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఎన్‌రోలర్లు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. వీరితో పాటు మండల, జిల్లా కమిటీలను ప్రకటించడం ద్వారా ప్రతి ఒక్కరినీ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టాం..’అని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో ఎన్‌రోలర్లు, గ్రామ స్థాయిలో ఉండే పార్టీ నేతలు, మండల, జిల్లా కమిటీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు.. ఇలా అన్ని స్థాయిల్లో ఎన్నికలకు అవసరమైన బలగాన్ని సిద్ధం చేసుకుంటున్నామని అన్నారు.  

ప్రధానికి పోస్టుకార్డు ఉద్యమం టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రారంభం 
ప్రపంచ సంపన్నుల జాబితాలో 609వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎనిమిదేళ్లలో రెండో స్థానా­నికి ఎలా రావచ్చనే ఫార్ములా ఏంటో తమకూ చెప్పాలని టీపీసీసీ నేతలు ప్రధాని మోదీని కోరా రు. తమ పార్టీ తరపున ఎన్నికైన వ్యక్తి ఈ ప్రశ్నలను పార్లమెంటులో అడిగేందుకు అవకాశమివ్వాల­ని, దేశంలో ఓటర్లయిన తమకైనా బదులివ్వాలంటూ సోమవారం ఆయనకు లేఖ రాశా­రు. అదానీ స్కాంపై జేపీసీ ఏర్పాటు చేయా­లన్న డిమాండ్‌తో టీపీసీసీ చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమాన్ని సోమవారం గాంధీభవన్‌లో ప్రారంభించారు. ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌జావెద్, ఎమ్మె­ల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్, అను­బంధ సంఘాల అధ్యక్షులు శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్, నాగరిగారి ప్రీతం, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌తోపాటు పెద్ద ఎత్తు న కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top