టిప్పన్‌ నక్ష.. రాష్ట్రంలో భూముల సర్వేకు ఈ పేరుకు సంబంధం ఏంటి?

Telangana: What Is Tippan Nakasha Basic Survey Document Field Survey - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టిప్పన్‌ నక్ష..... ఇప్పుడు రాష్ట్రంలో అందరి నోటా నానుతున్న పేరు ఇది. దీని ప్రాతిపదికనే రాష్ట్రంలో భూముల సర్వే చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అసలు ఈ టిప్పన్‌ నక్ష అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టిప్పన్‌ నక్ష గురించి తెలసుకుందాం. 
పటమే నక్ష.. 
శిస్తు వసూలు కోసం ఎవరి దగ్గర ఎంత భూమి ఉందనే లెక్క తేల్చేందుకు నాటి నిజాం సర్కారు భూముల సర్వేకు నడుం బిగించింది. అప్పట్లోనే శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా, గ్రామీణ ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో ఈ సర్వే సాగింది. సర్వే కోసం ఇనుప లింకులను అప్పట్లో వాడుకలో ఉన్న అణాల లెక్కన లెక్కగట్టారు. ఏక్‌ అణా... దో అణా పేరుతో 16 అణాలకు 50 లింకులు కలిపి ఒక గొలుసు (అణాకు మూడు లింకులు+2 అధికం) తయారు చేశారు. ఈ గొలుసులతో భూములను కొలిచి హద్దులు నిర్ణయించి కొలత రికార్డు నమోదు చేసి నంబర్‌ ఇచ్చారు. దీన్నే సర్వే నంబర్‌గా, ప్రతి సర్వే నంబర్‌లోని కొలత రికార్డును (పేపర్‌) టిప్పన్‌గా వ్యవహరించే వారు. ఇలా గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల టిప్పన్‌ రికార్డుల ఆధారంగా ఒక గ్రామ పటం తయారు చేశారు. దీనికి నక్ష అని పేరు పెట్టారు. అంటే ఒక గ్రామంలోని భూ రికార్డులను సంక్షిప్తం చేసిన గ్రామ పటమే టిప్పన్‌ నక్ష అన్నమాట. ఈ నక్ష రికార్డులను మార్చడానికి లేదా ట్యాంపర్‌ చేయడానికి అవకాశం లేదు. దీని ఆధారంగానే ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామీణ భూముల సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.   

చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్‌ నాన్నకు..’

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top