అప్పులు పైపైకి.. | Telangana Rs 80000 Crores debts has significantly increased | Sakshi
Sakshi News home page

అప్పులు పైపైకి..

Mar 21 2026 6:05 AM | Updated on Mar 21 2026 6:05 AM

Telangana Rs 80000 Crores debts has significantly increased

రూ.80 వేల కోట్లు దాటిన రుణాల ప్రతిపాదన

గత ఏడాదితో పోలిస్తే రూ.8 వేల కోట్లు ఎక్కువ.. అసలు, వడ్డీల

కింద చెల్లించాల్సింది రూ.41 వేల కోట్లు

జీఎస్‌డీపీలో 32.50% మేర అప్పుల ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పటిలాగే అప్పుల పద్దు ఈసారి బడ్జెట్‌లో కూడా పెరిగింది. అనివార్య ఖర్చులు, రెవెన్యూ వ్యయం సజావుగా సాగేందుకు వీలుగా వివిధ రూపాల్లో తీసుకునే రుణాలు 2026–27 బడ్జెట్‌లో రూ.80 వేల కోట్లు దాటాయి. 2025–26లో రూ.74,645 కోట్లను ప్రతిపాదించగా, ఈసారి అంతకంటే దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కువగా రూ.82,870.42 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణాలే రూ.73,383 కోట్లు ఉన్నాయి. అలాగే కేంద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర రుణాలు, డిపాజిట్‌ లావాదేవీలు, అడ్వాన్సుల రూపంలో మరో రూ.4 వేల కోట్ల వరకు అప్పు తీసుకోవాలని ప్రతిపాదించారు.

సగం వరకు చెల్లింపులకే..
ఏటా తీసుకునే అప్పులతో పాటు పద్దులో చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. కాలపరిమితి తీరిన గత అప్పులు, అన్ని అప్పులకు వడ్డీలు ఏయేటికాయేడు చెల్లించేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేస్తారు. ఈ మేరకు అప్పుల్లో అసలుతో పాటు వడ్డీల చెల్లింపు కింద రూ.41 వేల కోట్లు చూపెట్టారు. ఇందులో అసలు కంటే వడ్డీలే ఎక్కువ ఉండడం గమనార్హం. 2026–27లో అసలు కింద రూ. 19,785 కోట్లు చెల్లించనుండగా, వడ్డీల కింద రూ.21,304 కోట్లు కట్టనున్నారు. ఇవి పోను మిగతా రూ.41 వేల కోట్లు ఇతర ఖర్చుల  కోసం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.

బడ్జెట్‌ కంటే ఎక్కువ సేకరణ
గత రెండు బడ్జెట్‌లను పరిశీలిస్తే ప్రతిపాదించిన వాటి కంటే ఎక్కువే అప్పులు సేకరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అన్ని రూపాల్లో కలిపి 2024–25లో రూ.62 వేల కోట్లు తీసుకోవాల్సి ఉండగా, రూ.63,786 కోట్లను సేకరించింది. 2025–26లో రూ.74,645 కోట్ల మేర రుణాలు తీసుకోవాలని బడ్జెట్‌లో పెట్టగా రూ.77,359 కోట్లను సేకరించారు.

మూడేళ్లలో రూ.20 వేల కోట్లు పెరిగిన రుణాలు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి 2024–25లో సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఆ ఏడాది పద్దు రూ. 62,440 కోట్లు ఉండగా, ఆ తర్వాతి ఏడాది రూ.74 వేల కోట్లకు పెరిగింది. ఈసారి రూ.82 వేల కోట్లకు చేరడంతో మూడేళ్ల కాలంలో ఒక్క అప్పుల పద్దే ఏకంగా రూ.20 వేల కోట్లు పెరిగినట్టయింది. అదేవిధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)తో పోలిస్తే అప్పులు 32.5 శాతానికి చేరినట్టు బడ్జెట్‌ గణాంకాల్లో వెల్లడించారు. 2025–26లో కూడా ఇదే రీతిలో అప్పుల ప్రతిపాదనలుండడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement