కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు సందర్భంగా గ్లోబల్ సమ్మిట్
8న రెండో వార్షికోత్సవం.. 9న పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ
ఈ డాక్యుమెంట్ ఆధారంగానే భవిష్యత్తు నిర్ణయాలు: సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ –2025 నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అదే సమయంలో డిసెంబర్ 8వ తేదీన ప్రజా ప్రభుత్వం రెండో వార్షికోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు, 9వ తేదీన తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ రైజింగ్–2047తో రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పాలసీ డాక్యుమెంట్ అధారంగానే భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి పాలసీ డాక్యుమెంట్ పూర్తి స్పష్టతను ఇస్తుందని చెప్పారు.
శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్
గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నెలాఖరులోగా శాఖల వారీగా పాలసీ డాక్యుమెంట్ సిద్ధం కావాలని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ దేశాల ప్రతినిధులను ఆహ్వానించాలని, వారి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. సదస్సు ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం సమీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అధికారులు కూడా సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచాలి
ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలపై కూడా పూర్తిస్థాయిలో డాక్యుమెంట్‌ను రూపొందించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేపట్టనున్న బృహత్తర కార్యక్రమాలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంపొందించే దిశగా డాక్యుమెంట్ ఉండాలని సీఎం సూచించినట్లు సమాచారం. హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, అందుకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల ఆకర్షణ ప్రధానంగా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది.


