హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025
డిసెంబర్ 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలోనే ఈ సదస్సు
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్శించేందుకు ప్రజాపాలన–ప్రజావిజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’నిర్వహించనుంది. వచ్చే నెల 8,9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్ల కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ అధ్యక్షతన ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవడంతోపాటు డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు కావడంతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ విజన్ రైజింగ్–2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కొత్త ఇండస్ట్రీ, మైనింగ్, ఎడ్యుకేషన్ పాలసీలను విడుదల చేస్తారు.
ఏడుగురితో ప్రత్యేక కమిటీ
టీజీ ఎస్‌పీడీసీఎల్, జలమండలి, హెచ్‌ఎండీఏ, ఐటీ, ట్రాన్స్‌కో, హౌసింగ్, ట్రాన్స్‌పోర్ట్ వంటి పలు ప్రభుత్వ విభాగాల సమన్వయానికి జయేశ్‌రంజన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వికాస్‌రాజ్, సంజయ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తాని యా, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.
ఫార్చ్యూన్–500 కంపెనీలకు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్‌కు ఫార్చ్యూన్–500 కంపెనీలకు ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్‌రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధి ఎలా ఉంటుందో వివరించనున్నారు. రెండు రోజుల సదస్సులో ఫ్యూచర్ సిటీలో పలు ప్రభుత్వ విభాగాలకు భూములను కేటాయించనున్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్ సిటీ కమిషనర్ శశాంక ఆధ్వర్యంలో ఎంఓయూ, అనౌన్స్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతినిధుల భద్రత ఏర్పాట్ల కోసం అదనపు డీజీ డీఎస్ చౌహాన్, ఐజీ ఎం.రమేశ్, రాచకొండ కమిషనర్ సు«దీర్‌బాబులతో సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్ కమిటీని ఏర్పాటు చేశారు.


