రికార్డు స్థాయిలో కొనుగోళ్లు : మంత్రి గంగుల

Telangana Purchases Paddy To Fill Centre 46LT Rice Order: Gangula Kamalakar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయి కొనుగోళ్లు నమోదు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర రైతుల పక్షాన నిలిచి ధాన్యం సేకరించినట్లు చెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌పై సమీక్షను మంగళవారం నిర్వహించారు. ధాన్యం సేకరణ లక్ష్యం దాదాపు పూర్తికావచ్చిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 46 ఎల్‌ఎంటీ బియ్యానికి సమానమైన 68.65 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరణలో 3వ తేదీ నాటికే 65.20 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించినట్లు తెలిపారు. కేంద్రం విధించిన నిబంధనలతో సంబంధం లేకుండా ఎంత ధాన్యం వచ్చినా సేకరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4,808 కొనుగోలు కేంద్రాల్లో సేకరణ పూర్తయిందని, వాటిని మూసివేసివేశామని తెలిపారు.

ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ అందజేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని, ఈ వానకాలానికి సంబంధించి దాదాపు 4 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్‌ చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్లు శ్రీకాంత్‌ రెడ్డి, రుక్మిణి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, కాశీ విశ్వనాథ్, వాణీభవాని, నసీరుద్దీన్, పౌరసరపరాల సంస్థ జనరల్‌ మేనేజర్‌ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top