
ఫలితాలివ్వని ఎస్‌ఓపీలు, మానిటరింగ్ కమిటీలు
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి తెరపైకి
‘పోలీసుస్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మారాయి. వీటిని సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా మార్చారు. సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని చెప్పినా బెదిరింపులకు దిగుతూ ఏదో ఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నారు’
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి.
సాక్షి, హైదరాబాద్: సివిల్ వివాదం.. ఇదంటే పోలీసులకు వీనుల విందు, బహు పసందు కూడా. క్రిమినల్ కేసులో ఏముంటుంది... పరిశోధన, తిరగడం, చాకిరీ... అదే సివిల్ కేసుల్లో అయితే... డబ్బే డబ్బు. నగరంతో పాటు చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు పెరిగిపోయాయి. ఇలాంటి వివాదాలన్నీ చివరకు పోలీసుల వద్దకే చేరుతున్నాయి. దీంతో కొందరు పోలీసులు తమ సివిల్ సెటిల్‌మెంట్లకు పోలీసుస్టేషన్లనే అడ్డాలుగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి గతంలో న్యాయస్థానాలు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి.
ఆ విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ...
ఇప్పుడు అనేక పోలీసుస్టేషన్లలో భూ వివాదాలను పరిష్కరించడం మామూలు విషయంగా మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే సివిల్ వివాదాలు లేకపోతే స్టేషన్‌తో పాటు అధికారుల ఖర్చులు కూడా వెళ్లని పరిస్థితి నెలకొంది. తమ జేబులు నింపేవి కూడా అవే కావడంతో కింది స్థాయి పోలీసులు వాటి కోసం వెంపర్లాడుతున్నారు. అయితే బయటపడితే ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో సాధ్యమైనంత వరకు కేసు రిజిస్టర్ చేయకుండానే వ్యవహారం చక్కబెడుతుంటారు.
అప్పటికీ సెటిల్ కాకపోతే తాము ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఇరు వైపుల నుంచి ఫిర్యాదు తీసుకుని ఆ తర్వాత కథ నడిపిస్తున్నారు. కేసు నమోదయితేనే సివిల్ కేసుల్లో తలదూర్చుతున్నారని తెలుస్తోంది. అసలు కేసే నమోదు చేయకపోతే? పోలీసులకు ఇబ్బందే ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం కేసు నమోదు తప్పనిసరిగా మారుతుంది. అలాంటప్పుడు తమకు అనుకూలమైన లాయర్ల వద్దకు క్‌లైంట్స్‌ను పంపే పోలీసులు కోర్టు రిఫర్డ్ ద్వారా రమ్మని చెప్పి కేసులు నమోదు చేస్తుంటారు.
వాటి విభజన చాలా కష్టం...
‘ఇచ్చట సివిల్ కేసులు నమోదు చేసుకోం... వివాదాలు పరిష్కరింపబడవు’ దాదాపు ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ ఈ బోర్డులు మనకు కనిపిస్తుంటాయి. అయితే సివిల్ కేసులు నమోదు చేసుకోవడం మానేసిన ఖాకీలు... వచ్చిన కేసునల్లా సెటిల్‌మెంట్ చేయడం మాత్రం మర్చిపోవట్లేదు. దీనికి కారణం భూ వివాదాల్లో సివిల్, క్రిమినల్ విభజించడం చాలా కష్టం. ఈ రెండింటి మధ్యా ఓ చిన్న గీత మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తే... అది సివిల్ వివాదం అవుతుంది. దీనిపై న్యాయస్థానంలోనే తేల్చుకోవాలి. అదే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించే క్రమంలో కూల్చివేతలు, బెదిరింపులకు, దాడులకు దిగితే అది క్రిమినల్ కేసుగా మారుతుంది. అంటే.. పోలీసుల చేతికి వచ్చినట్లే. ఈ పరిణామాల నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు, కఠిన చర్యలు లేకుండా పోలీసులను, సివిల్ కేసులను వేరు చేయడం సాధ్యంకాదని వినిపిస్తోంది.
అవన్నీ అటకెక్కిపోయాయి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సివిల్ వ్యవహారాల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ 2010 నవంబర్ 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఆరోపణ, ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
చదవండి: అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల కూడా..
అప్పట్లో రాచకొండ లేకపోవడంతో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ అధ్యక్షుడిగా, ఐజీ స్థాయి అధికారులైన అదనపు కమిషనర్ (సమన్వయం), అదనపు కమిషనర్ (నేరాలు) సభ్యులుగా, సైబరాబాద్ కమిషరేట్ విషయానికి వస్తే అధ్యక్షుడిగా పోలీసు కమిషనరే ఉన్నప్పటికీ సభ్యులుగా పరిపాలన విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు, క్రైమ్ డీసీపీ వీటిని ఏర్పాటు చేశారు. ఆపై ఉన్నతాధికారులు అనేక సందర్భాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లకు (ఎస్‌ఓపీ) రూపమిచ్చి వెబ్‌సైట్లలో పొందుపరిచారు. కాలక్రమంలో ఇవన్నీ అటకెక్కిపోవడంతో ఠాణాల్లో సెటిల్‌మెంట్లు కొనసాగుతున్నాయి.