
నోటికాడి కూడు లాగేశారంటూ ఆగ్రహం
బంద్ నిర్వహించి రాష్ట్రాన్ని స్తంభింపచేస్తాం: ఆర్.కృష్ణయ్య
రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయి: జాజుల
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై గురువారం హైకోర్టు స్టే విధించడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు నోటివరకు అందిన కూడును లాగేశారంటూ మండిపడ్డాయి. స్టే విధిస్తూ తీర్పు ఇచి్చన వెంటనే హైకోర్టు ప్రాంగణంలో బీసీ సంఘాల నేతలు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. ప్రధాన పార్టీలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర బంద్ నిర్వహిస్తాం: ఆర్.కృష్ణయ్య
ఈరోజు రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. జీవో ఇచి్చన వెంటనే కోర్టులో పిటిషన్ వేసినప్పుడు అదేరోజు స్టే ఇవ్వాల్సింది. కానీ అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత... చివరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు సమరి్పంచిన తర్వాత స్టే ఇవ్వడం దారుణం. ఈ అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రభుత్వ వైఖరిని బట్టి భవిష్యత్ ప్రణాళిక చేపడతాం. రాష్ట్ర బంద్ నిర్వహించి జనజీవనాన్ని స్తంభింపజేస్తాం.
రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: జాజుల
బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో స్టే వచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయపరమైన అవరోధాలు ఉండేవి కావు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలాడుతున్నాయి. శుక్రవారం హైదరాబాదులో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
చీకటి రోజు: జూలూరి గౌరీశంకర్
రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధ్యం కావని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టకుండా జీవో 9ని ఇచ్చి అన్యాయం చేసింది. 42 శాతం రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ విడుదల చేసి బీసీలను కాంగ్రెస్ మరోసారి మోసగించింది.
మరో మండల్ ఉద్యమం
బీసీల రిజర్వేషన్ల కోసం మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని, అందరం కలిసి నేటి బంద్‌ను విజయవంతం చేద్దామని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పాపని నాగరాజు వ్యాఖ్యానించారు. అగ్రకుల పాలకుల మీద ఆధారపడకుండా స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం గురువారం రాత్రిలోగా నిర్ణయం ప్రకటించకుంటే బంద్ నిర్వహిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలిపారు.
హైకోర్టు వద్ద ఉద్రిక్తత
చార్మినార్ (హైదరాబాద్): స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంతో బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. హైకోర్టు ప్రాంగణం నుంచి రోడ్డుపైకి వచి్చన నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. స్పందించిన పోలీసు లు వారిని రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక నినాదాలతో హైకో ర్టు పరిసరాలు మారుమోగాయి.
బీఆర్‌ఎస్–బీజేపీ కుమ్మక్కై తమ నోటికాడి ముద్దను లాక్కున్నాయంటూ కొందరు నేతలు నినాదాలు చేశారు. హైకోర్టులోనే ఉన్న మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, వి.హనుమంతరావు తదితరులు తీర్పు అనంతరం హైకోర్టు ప్రాంగణం నుంచి బయటికి వచ్చి బీఆర్‌ఎస్–బీజేపీ కుట్ర పన్నాయంటూ ధ్వజమెత్తారు.