గిరిజనులకు 10% కోటా.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  

Telangana Govt Issued Orders For 10 Percent Tribals Reservation - Sakshi

6 నుంచి 10 శాతానికి పెరిగిన ఎస్టీ రిజర్వేషన్లు 

రాష్ట్రపతి ఆమోదం లేకుండానే సర్కారు నిర్ణయం  

శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు 

రాష్ట్రంలో మొత్తం 70 శాతానికి పెరిగిన రిజర్వేషన్లు

సాక్షి, హైదరాబాద్‌:  గిరిజనులకు శుభవార్త. రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ ఉత్తర్వులు (జీవో నం.33) జారీ చేశారు. రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  

సీఎం హామీ నేపథ్యంలో.. 
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్బంగా సెప్టెంబర్‌ 17న ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ‘గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా వారం రోజుల్లో జీవో విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తాం. ప్రధాని నరేంద్ర మోదీ..మా జీవోను అమలు చేయించి గౌరవం కాపాడుకుంటావా? లేక దానితో ఉరి వేసుకుంటావా ఆలోచించుకో..’ అని ఈ సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు ఐదారు శాతంగా ఉన్న రిజర్వేషన్లను తెలంగాణ వచ్చాక 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ఏడేళ్లు గడిచినా రాష్ట్రపతి ఆమోదం లభించకపోవడాన్ని ఈ సభలో సీఎం కేసీఆర్‌ తీవ్ర స్థా యిలో తప్పుబట్టా రు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఐదు నిమిషాల్లో జీవో జారీ చేసుకుంటా మన్నారు. సీఎం హామీ ఇచ్చి వారం రోజులు గడిచిన నేపథ్యంలో.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన త ర్వాత రాష్ట్ర ప్రభు త్వం ఆఘమేఘాల మీద రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసింది. తమిళనాడులో   28 ఏళ్లుగా 69 శాతం రిజర్వేషన్లు అమలవుతుండటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాతిపదికగా జీవోలో చూపింది. 

66 నుంచి 70 శాతానికి రిజర్వేషన్లు 
రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మొత్తం రిజర్వేషన్లు 70 శాతానికి పెరిగాయి. అగ్రకుల పేదల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లను అమల్లోకి తెస్తూ గతేడాది మార్చి 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 65 జారీ చేయడంతో అప్పట్లో మొత్తం రిజర్వేషన్ల శాతం 66 శాతానికి పెరిగింది. తాజాగా ఎస్టీ కోటాను 6 నుంచి 10 శాతానికి పెంచడంతో 70 శాతానికి చేరింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top