గ్రీన్‌ హైడ్రోజన్‌.. కొత్త విజన్‌! | Telangana Govt focus on green hydrogen and allied fuels industries | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ హైడ్రోజన్‌.. కొత్త విజన్‌!

Nov 18 2024 6:00 AM | Updated on Nov 18 2024 6:02 AM

Telangana Govt focus on green hydrogen and allied fuels industries

రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్, అనుబంధ ఇంధనాల పరిశ్రమలపై సర్కారు ఫోకస్‌

భారీ రాయితీ, ప్రోత్సాహకాలను ప్రకటించే యోచన 

ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమోనియా, గ్రీన్‌ మిథనాల్‌ ప్రాజెక్టులకూ వర్తింపు 

తెలంగాణ రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ–2024లో ప్రకటించనున్న ప్రభుత్వ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల (డెరివెటివ్స్‌) పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించబోతోంది. ఈ మేరకు త్వరలో తెలంగాణ రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ–2024ను రూపొందించింది. స్వచ్ఛమైన ఇంధనంగా ప్రాచుర్యంలోకి వచ్చిన గ్రీన్‌ హైడ్రోజన్‌ను రవాణా (హైడ్రోజన్‌ సెల్‌ ఆధారిత వాహనాలు)తోపాటు ఎరువులు, రసాయనాల తయారీ, ఇతర కర్మాగారాల్లో ఇంధనంగా ప్రోత్సహించడం ద్వారా ‘నెట్‌ జీరో’ఉద్గారాల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యంలో భాగంగా..
భూతాపాన్ని నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న చర్చ చాలాకాలం నుంచి సాగుతోంది. ఈ క్రమంలో శిలాజ ఇంధనాలకు బదులుగా కాలుష్య రహిత ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’ను ఇంధనంగా వినియోగించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో ప్రకటించిన నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌లో 2030 నాటికి దేశంలో ఏటా 5 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ, డెరివేటివ్స్‌ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్‌ అమోనియా, గ్రీన్‌ మిథనాల్‌ ఇంధనాలనే డెరివేటివ్స్‌గా పరిగణిస్తారు.

పరికరాలపై 25% పెట్టుబడి రాయితీ!
ఎలక్ట్రోలైజర్‌ ఆధారిత గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులకు.. ప్రతి మెగావాట్‌ /1,400 టీపీఏకు గరిష్టంగా రూ.కోటి చొప్పున ఎలక్ట్రోలైజర్‌ పరికరాలు, ప్లాంట్‌ వ్యయంలో 25శాతం వరకు రాయితీని అందిస్తారు. కనీసం150 కేటీపీఏ సామర్థ్యముండే హైడ్రోజన్‌ ప్లాంట్లకే సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్లలో వినియోగించే ఎలక్ట్రోలైజర్‌ పరికరాల తయారీ ప్రాజెక్టులకూ పెట్టుబడి వ్యయంలో 25శాతం వరకు రాయితీ అందిస్తారు. కనీసం 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకే ఇది వర్తిస్తుంది. గ్రీన్‌ హైడ్రోజన్‌ రీఫ్యూయలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కూడా పెట్టుబడి వ్యయంలో 25శాతం రాయితీ అందిస్తారు. తొలి 10 యూనిట్లకు మాత్రమే వర్తిస్తుంది. వీటికి అవసరమైన పరికరాల కొనుగోళ్లపై పూర్తి ఎస్‌జీఎస్టీని రీయింబర్స్‌ చేస్తారు.

‘ఇంటిగ్రేటెడ్‌’ ప్రాజెక్టులకూ సబ్సిడీలు
ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమోనియా, గ్రీన్‌ మిథనాల్‌ (బయోజనిక్‌ కార్బన్‌ సహా) పరిశ్రమల ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్‌ సహా) వ్యయంలో 25శాతం వరకు సబ్సిడీగా ప్రభుత్వం అందిస్తుంది. గ్రీన్‌ అమోనియా ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.1.85 కోట్లు, గ్రీన్‌ మిథనాల్‌ ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.2.25 కోట్లను పెట్టుబడి రాయితీగా ఇస్తుంది. గ్రీన్‌ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్‌ నుంచి విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్‌) తయారు చేసే ప్లాంట్లకూ ఈ రాయితీలు వర్తిస్తాయి.

డీసాలినేషన్‌ ప్లాంట్లకు 20% పెట్టుబడి రాయితీ
గ్రీన్‌ హైడ్రోజన్, దాని డెరివేటివ్స్‌ తయారీ అవసరమైన డీసాలినేషన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు 20శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. ప్రతి ఎంఎల్‌డీ (రోజుకు మిలియన్‌ లీటర్ల) సామర్థ్యానికిగాను రూ.కోటికి మించకుండా ఈ రాయితీ వర్తిస్తుంది. ఇక గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు కేంద్రం అందించే ఆర్థిక సాయానికి అదనంగా 25శాతం వరకు (రూ.10 కోట్లకు మించకుండా) రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.

ఇతర రాయితీ, ప్రోత్సాహకాలివీ..
 గ్రీన్‌ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల ప్రాజెక్టుల స్థలాలకు వ్యవసాయేతర స్థలాలుగా తక్షణమే గుర్తింపు కల్పిస్తారు.
వీటి ఉత్పత్తుల అమ్మకాలపై వసూలు చేసే రాష్ట్ర జీఎస్టీ మొత్తాన్ని ఐదేళ్లపాటు రీయింబర్స్‌ చేస్తారు.
ప్రాజెక్టులకు ప్రభుత్వమే నీటిసరఫరా సదుపాయాన్ని కల్పిస్తుంది. నీటి చార్జీలపై ఐదేళ్లపాటు 25శాతం రాయితీ ఇస్తారు.
గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు కొనుగోలు చేసే పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ చార్జీల్లో 50శాతం మేర ఐదేళ్ల పాటు రాయితీ ఇస్తారు. గరిష్టంగా మెగావాట్‌కు రూ.15లక్షల రాయితీ వర్తిస్తుంది.

గ్రీన్‌ హైడ్రోజన్‌ అంటే..?
సౌర, పవన విద్యుత్‌ వంటి కాలుష్య రహిత, పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టడం ద్వారా.. ఉత్పత్తి చేసే హైడ్రోజన్‌ను ‘గ్రీన్‌ హైడ్రోజన్‌’ అంటారు. వాహనాలతోపాటు ఎరువులు, ఉక్కు, సిమెంట్‌ పరిశ్రమల్లో వాడే కాలుష్య కారక సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా.. గ్రీన్‌ హైడ్రోజన్‌ను వినియోగించాలన్నది లక్ష్యం. తద్వారా కాలుష్యాన్ని తగ్గించడం, భూతాపం పెరగకుండా చూడటం వంటివి సాధ్యమవుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement