Telangana Electricity Bill: ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్‌ కట్‌! | Sakshi
Sakshi News home page

Telangana Electricity Bill: ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్‌ కట్‌!

Published Thu, Jul 21 2022 1:29 AM

Telangana Electricity Connection Will Be Terminated If Not Paid Bill - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లు చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఎడాపెడా విద్యుత్‌ కనెక్షన్‌ను కట్‌ చేస్తున్నారు. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఎడాపెడా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారు. వ్యక్తిగత, వృత్తిపర జీవితాల్లో బిజీగా ఉండడం, ఇంకా సమయముంది కదా.. తర్వాత చెల్లిద్దామనుకుని మరిచిపోవడం వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోతున్నారు.

ఇంతకుముందు నెల, రెండు నెలలు ఆలస్యమైతే క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్‌మెన్, ఇతర సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి బిల్లు కట్టమని గుర్తు చేసేవారు. గత రెండు మూడు నెలలుగా ఒక్కరోజు ఆలస్యమైనా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బిల్లు చెల్లిస్తాం.. గంటసేపు ఆగమని కోరినా ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈఆర్సీ మార్గదర్శకాల వక్రీకరణ
గడువులోగా బిల్లు చెల్లింపులో విఫలమైతే ఏడు రోజుల గడువుతో నోటీసు జారీ చేసి, ఆ తర్వాత కూడా చెల్లించకపోతేనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేయాలని ఈఆర్సీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, గడువులోగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్‌ తొలగింపునకు మార్గదర్శకాలు’ పేరుతో ఈఆర్సీ 2002 అక్టోబర్‌ 16న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కనెక్షన్‌ తొలగింపునకు ముందు వినియోగదారులకు ఏడు రోజుల సమయం ఇవ్వడమే నోటీసు ఉద్దేశం. ఒకవేళ బిల్లు చెల్లించినా సాంకేతిక/సిబ్బంది తప్పిదాలతో చెల్లించలేదని రికార్డుల్లో నమోదైతే సంజాయిషీ ఇచ్చుకోవడానికి వినియోగదారులకు తగిన సమయం లభిస్తుంది. అత్యవసర సేవల కింద వచ్చే విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేస్తే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి నోటీసు ఇవ్వకుండా కనెక్షన్‌ తొలగించడం సరైంది కాదని ఈ నిబంధనలను ఈఆర్సీ పెట్టింది.

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు మాత్రం ఈ మార్గదర్శకాలను వక్రీకరించి వినియోగదారులకు ‘బిల్‌ కమ్‌ నోటీసు’పేరుతో ప్రతి నెలా జారీ చేసే బిల్లులోనే ముందస్తుగా నోటీసును సైతం పొందుపరుస్తున్నాయి. బిల్లులోనే నోటీసు ఉందన్న విషయం సాధారణ వినియోగదారులకు అర్థం కాదు. కేవలం ఈఆర్సీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్టు చూపడానికే డిస్కంలు ‘బిల్‌ కమ్‌ నోటీసు’పద్ధతిని అవలంబిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లు బకాయిలు, డిస్కనెక్షన్, రీకనెక్షన్‌ చార్జీలను చెల్లించిన తర్వాత పట్టణాల్లో 4 గంటల్లోగా, గ్రామాల్లో 12 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది.

అయితే, బిల్లు కట్టిన తర్వాత సకాలంలో సరఫరాను పునరుద్ధరించడం లేదని అంటున్నారు. అయితే, కనెక్షన్‌ తొలగించడంపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఓ అధికారి తెలిపారు. స్థానికంగా కొందరు సిబ్బందికి, వినియోగదారులతో ఏదైనా ఘర్షణ వాతావరణం ఎదురైతే తొందరపాటుతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బిల్లుల వసూళ్ల కోసం తీవ్ర ఒత్తిడి
భారీగా విద్యుత్‌ చార్జీలను పెంచినా డిస్కంలు నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగు నెలలుగా విద్యుత్‌ ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారు. 100శాతం కనెక్షన్లకు మీటర్‌ రీడింగ్‌ తీసి బిల్లులు జారీ చేయాలని, 100శాతం బిల్లులు వసూలు చేయాలని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో డీఈలకు లక్ష్యాలను నిర్దేశించాయి.

ప్రతి నెలా 100శాతం బిల్లులు జారీచేసినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే జీతాలు చెల్లిస్తామని లింకు పెట్టాయి. దీంతో ఒత్తిడి పెరగడంతో వసూళ్లను పెంచేందుకు ఎడాపెడా కనెక్షన్లను తొలగిస్తున్నారని విమర్శలున్నాయి. బిల్లు వసూళ్ల కోసం ఇళ్లకు వస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహార తీరు అవమానకరంగా ఉంటోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement