Dharani Website Issues: పల్లెబాట పడితేనే 'ధరణి' దారికి | Telangana Dharani Problems Can Be Solved By Going Villages | Sakshi
Sakshi News home page

పల్లెబాట పడితేనే 'ధరణి' దారికి.. గ్రామాలకు వెళితేనే భూ సమస్యలకు పరిష్కారమంటున్న నిపుణులు

Aug 11 2022 1:13 AM | Updated on Aug 11 2022 3:22 PM

Telangana Dharani Problems Can Be Solved By Going Villages - Sakshi

రెండేళ్లుగా రైతుల పాట్లు రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు సులభతరమైన భూసేవలను అందించేందుకు గాను ప్రభుత్వం ధరణి పేరిట పోర్టల్‌ను తీసుకువచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌:  ఒక్కో గ్రామంలో కనీసం 200 సమస్యలు. గ్రామీణ ప్రజలకు న్యాయ సహాయం అందించేందుకు గాను ఓ స్వచ్ఛంద సంస్థ ఇటీవల రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఉన్న నాలుగు గ్రామాల్లో పర్యటిస్తే.. ధరణి పోర్టల్‌కు సంబంధించి వెలుగుచూసిన సమస్యల సంఖ్య ఇది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలోని 12 వేలకు పైగా ఉన్న గ్రామాల్లో 24 లక్షలకు పైగానే సమస్యలు ఉండే అవకాశం ఉందని భూచట్టాల నిపుణుల అంచనా. ఈ సమస్యలకు ధరణి పోర్టల్‌లో పరిష్కారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పారదర్శక నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో కార్యాచరణ ద్వారానే అది సాధ్యమవుతుందని వారంటున్నారు. గురువారం రాష్ట్ర కేబినెట్‌ భేటీ జరగనున్న నేపథ్యంలో ధరణి పోర్టల్‌ సమస్యలపై చర్చించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.  

రెండేళ్లుగా రైతుల పాట్లు రాష్ట్రంలోని భూములకు సంబంధించిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు సులభతరమైన భూసేవలను అందించేందుకు గాను ప్రభుత్వం ధరణి పేరిట పోర్టల్‌ను తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా, ఈ పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలు, పరిష్కారం చూపని మాడ్యూళ్లు, క్షేత్రస్థాయిలో పరిష్కార వ్యవస్థలు లేకపోవడంతో దాదాపు రెండేళ్లుగా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ప్రయత్నిస్తోందే తప్ప శాస్త్రీయ పరిశీలన జరపడం లేదనే విమర్శలున్నాయి. రైతాంగం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.  

కొన్నిటికి పరిష్కార మాడ్యూళ్లే లేవు? 
రైతుల ఇక్కట్ల నేపథ్యంలో ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రాన్ని పైలట్‌గా ఎంచుకుంది. ఈ గ్రామంలో మొత్తం 277 సమస్యలున్నాయని గుర్తించగా, ఇందులో 140 సమస్యల పరిష్కారానికి అసలు ధరణి పోర్టల్‌లో మాడ్యూళ్లే లేవని భూనిపుణులు చెపుతున్నారు. కానీ ఈ సమస్యలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది.  

తాత్కాలిక ఉపశమనమే! 
ధరణి పోర్టల్‌లో ఎదురయ్యే సమస్యలపై చేసుకునే దరఖాస్తులను పరిష్కరించే బాధ్యత జిల్లా కలెక్టర్లకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం క్షేత్రస్థాయిలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు ఇచ్చే సమాచారం మేరకు కలెక్టర్లు నిర్ణయం తీసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నారు, లేదంటే తిరస్కరిస్తున్నారు. కానీ ఈ సమస్యలు పరిష్కరించినా లేదా తిరస్కరించినా.. ఆ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదు. కంప్యూటర్‌లోనే ఆమోదించి, లేదంటే తిరస్కరించి ఆ మేరకు ధరణి రికార్డులను మార్చేస్తున్నారు. ఈ విధంగా చేయడం తాత్కాలిక ఉపశమనమే కానీ చట్టాల ముందు కలెక్టర్లకు కట్టబెట్టిన ఈ అధికారాలు నిలబడవని నిపుణులు అంటున్నారు. భూరికార్డుల్లో జరిగిన మార్పులకు లిఖితపూర్వక ఆదేశాలు లేదా ఉత్తర్వులు లేనిదే అవి చెల్లుబాటు కావనేది భూ చట్టాల నిపుణుల వాదన. 2020 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో ఈ మేరకు కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టే నిబంధన ఎక్కడా లేదని వారంటున్నారు. 

సాదాబైనామాలకైనా చట్ట సవరణ చేయాల్సిందే.. 
ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకురావడం ద్వారా కానీ, చట్టాన్ని సవరించి కానీ.. ఏదో స్థాయిలోని అధికారికి తగిన అధికారాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. సదరు అధికారులు గ్రామాలకు వెళ్లి సర్వే నంబర్ల వారీగా దరఖాస్తులను పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేసినప్పుడే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు. ఇక సాదాబైనామాల అంశాన్ని పరిష్కరించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న భూ హక్కుల (ఆర్‌వోఆర్‌) చట్టానికి తప్పనిసరిగా సవరణ జరగాల్సిందేనని పేర్కొంటున్నారు. పాత చట్టం (1971 ఆర్‌వోఆర్‌) అమల్లో ఉన్నప్పుడు వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాన్న కోర్టు.. కొత్త చట్టం (2020) వచ్చాక స్వీకరించిన దరఖాస్తులపై స్టే విధించింది. కొత్త చట్టంలో సాదాబైనామాల పరిష్కారానికి ఎలాంటి నిబంధన పొందుపరచక పోవడమే ఇందుకు కారణం. అయితే కోర్టు చెప్పినట్టు పాత చట్టం ఉన్నప్పుడు వచ్చిన 2.4 లక్షల సాదాబైనామాలను పరిష్కరించాలన్నా చట్ట సవరణ చేయాల్సిందేనని నిపుణులు అంటున్నారు.  

గ్రామాలకు వెళ్లి పరిష్కరించడమే ఉత్తమం 
భూసమస్యల పరిష్కారానికి గ్రామాలే సరైన వేదికలని గత 20 ఏళ్ల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. 2004–05 మధ్య కాలంలో గ్రామ రెవెన్యూ అదాలత్‌లను నిర్వహించారు. ఆ తర్వాత 2005–07 మధ్య కాలంలో గ్రామ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ కోర్టుల ద్వారానే భూసమస్యలను పరిష్కరించాలని, ఎమ్మార్వో స్థాయిలో 75 శాతం, ఆర్డీవో స్థాయిలో 50 శాతం సమస్యలను.. గ్రామ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేసి పరిష్కరించాలని అప్పట్లో జీవో కూడా ఇచ్చారు. ఆ తర్వాత రైతుల పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్లపై యూనిక్‌ కోడ్‌ వేసేందుకు గాను రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్లింది. ఆ తర్వాత రఘువీరారెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మూడు నెలల పాటు గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు రెండేళ్ల పాటు వరుసగా నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ పరిశీలిస్తే క్షేత్రస్థాయికి అంటే గ్రామ స్థాయికి వెళ్లి ధరణి సమస్యలను పరిష్కరించడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రతి భూ కమతానికి భూ కిట్‌ ఇవ్వాలి 
క్షేత్రస్థాయిలో భూసమస్యల పరిష్కారానికి కనీసం 6–8 నెలల సమయం పడుతుంది. సర్వే నంబర్లు, భూయజమానులు, సమస్యలను గుర్తించేందుకు రెండు నెలలు, ఆ తర్వాత సమస్యల పరిష్కారానికి దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు 2 నెలలు, వాటిని గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో పరిష్కరించేందుకు మరో 2–4 నెలలు పడుతుంది. ప్రతి భూకమతానికి భూకిట్‌ (పహాణీ నకలు, 1బీ నకలు, టిప్పన్, గ్రామ పటం, సేత్వార్, పాస్‌బుక్, టైటిల్‌ డీడ్‌) ఇచ్చినప్పుడే భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్టవుతుంది. ఇందుకోసం ఆర్‌వోఆర్‌ చట్టానికి సవరణ చేయడం, రికార్డుల సవరణ అధికారాలను కట్టబెట్టడం, గ్రామస్థాయికి రెవెన్యూ యంత్రాంగం వెళ్లడం చాలా కీలకం. ఈ దిశలో మంత్రివర్గం ఆలోచించాలి. 
– భూమి సునీల్, భూమి చట్టాల నిపుణుడు
చదవండి: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement