అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు | Sakshi
Sakshi News home page

అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు

Published Tue, Nov 1 2022 8:03 PM

Telangana Development Forum Jai Kisan Help to Farmers on Natural Farming - Sakshi

ముస్తాబాద్‌(సిరిసిల్ల): దగాపడ్డ తెలంగాణ పునర్నిర్మాణానికి రెండు దశాబ్దాల క్రితమే నడుం బిగించారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించాలన్న సంకల్పం వారిని ముందుకు నడిపించింది. వెనకబడ్డ పురిటిగడ్డను బాగు చేసేందుకు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందే 1999లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆవిర్భవించింది. ఖండాంతరాలలో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు ఒక్కటై.. అమెరికాలోని న్యూజెర్సీలో టీడీఎఫ్‌ పురుడుపోసుకుంది. అలా మొదలైన టీడీఎఫ్‌ ప్రస్థానం రెండు దశాబ్దాలకు పైగా సేవలు అందిస్తూనే ఉంది.జైకిసాన్‌తో రైతులకు సేవలు

అమెరికాలోని న్యూజెర్సీలో పురుడుపోసుకున్న టీడీఎఫ్‌ను పలు విభాగాలకు విస్తరించారు. 5 వేల మంది సభ్యులతో ప్రారంభమై ఎన్నో సేవలు అందిస్తోంది. భారతదేశం అంటేనే గుర్తుకు వచ్చేది వ్యవసాయ. అందుకు ప్రాధాన్యతను కల్పిస్తూ జైకిసాన్‌ విభాగాన్ని ప్రారంభించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అవగాహన కల్పిస్తున్నారు. రసాయన ఎరువులకు దూరంగా, సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను వివరిస్తూ ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులకు కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చేయూతను అందించి, ఆత్మహత్యలు జరగకుండా అవగాహన కల్పిసున్నారు. 

జీవామృతం, ఘనామృతం తయారీ, డ్రమ్‌సీడర్‌ ద్వారా సాగు, పెస్టిసైడ్స్‌ ద్వారా కలిగే నష్టాలను వివరిస్తున్నారు. సమీకృత వ్యవసాయం వల్ల కలిగే ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండ్‌ను తీసుకువస్తున్నారు. పంట మార్పిడి, చిరుధాన్యాల సాగు, వాటి ద్వారా తయారయ్యే ఉత్పత్తులపై చైతన్యాన్ని తెస్తున్నా రు. గ్రామాలలో రైతుసేవా కేంద్రాలు ఏర్పా టు చేసి వారికి అవసరమైన యంత్ర పరికరాలను అందిస్తున్నారు. వ్యవసాయాధికారుల సమన్వయంతో కార్పొరేట్‌ స్థాయికి తీసుకువచ్చే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వరి కొయ్యలు కాల్చకుండా, కొయ్యకాళ్లను ఎరువుగా ఎలా మార్చుకోవచ్చో చేసి చూపుతున్నారు. పశుపోషణతో కలిగే లాభాలను రైతులకు చేరవేస్తున్నారు.


యంత్రాలను వాడుకుంటున్నాం

ముస్తాబాద్‌లోని టీడీఎఫ్‌ రైతుసేవాకేంద్రంలోని యంత్రాలను వాడుకుంటున్నాం. డ్రమ్‌సీడర్, పచ్చిరొట్ట ఎరువుల తయారీ, సేంద్రియ సాగు పద్ధతులను వివరించారు. కేంద్రంలోని యంత్రాల సాయంతో గడ్డిని తొలగించుకున్నాం. కలుపు అవసరం లేకుండా అది ఉపయోగపడింది. రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
– దేవిరెడ్డి, రైతు, ముస్తాబాద్‌


ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి కావాలి

రైతులు ఆరుగాలం శ్రమించి పండించే పంటలు ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఆ దిశగా వారిని చైతన్యం చేస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గిస్తూ సేంద్రియ విధానం వైపు తీసుకువస్తున్నాం. రైతులు బాగున్నప్పుడే దేశంలోని ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుంది. దానికోసం జై కిసాన్‌ పనిచేస్తుంది.                
– మట్ట రాజేశ్వర్‌రెడ్డి, టీడీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి 


ఎన్నారైల సహకారంతో సేవలు

తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఇక్కడి ప్రజల జీవన విధానాలను మెరుగుపరిచేందుకు ఒక్కటై టీడీఎఫ్‌ను స్థాపించారు. దాని కోసం ఆహర్నిషలు పనిచేస్తున్నారు. సారవంతమైన నేలను కాపాడుకుంటూనే అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో శాస్త్రీయంగా అవగాహన కల్పిస్తున్నాం. రైతుల కోసం టీడీఎఫ్‌ మరింత ముందుకు వెళ్తుంది.  
– పాటి నరేందర్, జైకిసాన్‌ ఇండియా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
 
Advertisement