CM KCR: ఏకమై ఎండగడదాం! | Sakshi
Sakshi News home page

CM KCR: ఏకమై ఎండగడదాం!

Published Sat, Jul 30 2022 2:34 AM

Telangana CM KCR To Meet Akhilesh Yadav - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో అన్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్‌ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం.

బీజేపీ బాధిత పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ చేపడితే తప్ప దీనిని ఎదుర్కోలేమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఐదు రోజులుగా ఢిల్లీ ఉన్న సీఎం కేసీఆర్‌తో శుక్రవారం అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌లు భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సైతం సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన భేటీలో జాతీయ రాజకీయాలు, ముఖ్యమైన ఇతర జాతీయ అంశాలపై చర్చ జరిగింది.  

త్రైపాక్షిక ఒప్పందాలంటూ ఆర్థిక కట్టడి 
విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఇటీవల రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లోకి కేంద్రం చొచ్చుకొచ్చిన తీరును ఇరువురు నేతలకు కేసీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించుకుంటున్న సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక సాయం అందించని కేంద్రం, కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న రుణాలపైనా ఆంక్షలు విధిస్తోందని చెప్పారు. రుణాలు, రుణాలపై వడ్డీలను రాష్ట్రమే చెల్లిస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే లక్ష్యంతో ఎన్నడూ లేనివిధంగా త్రైపాక్షిక ఒప్పందాలంటూ కొత్త నిబంధనలు తెచ్చి ఆర్థిక కట్టడి చేస్తోందని వివరించారు.
 
విపక్షాలు ఒక్కతాటిపైకి రావాల్సిందే.. 
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విఫలమై, ఉద్యోగ కల్పనలో చేతులెత్తేసి, పరిమితులకు మించి అప్పులు చేస్తున్న కేంద్రం.. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను శ్రీలంకతో పోల్చడం ఏంటనే భావనను ఎస్పీ నేతలు సైతం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రభుత్వాలను ఈడీ, సీబీఐ కేసులతో భయపెట్టడం, లేదంటే చీలికలను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టడం పరిపాటిగా మారిందని, దీన్ని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్రలో చీలికలకు బీజేపీ ప్రోత్సాహం, పశ్చిమ బెంగాల్‌లో ఈడీ దాడులు, గోవాలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు గాలం, జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలపైనా నేతల మధ్య చర్చ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మతపరమైన అంశాలను ఎగదోస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్న తీరుపైనా చర్చించారు. 

భావసారూప్య పార్టీలన్నీ ఉద్యమించాలి 
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న తీరుపైనా నేతల మధ్య చర్చ జరిగింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు అంశాలపై చర్చను కోరుతున్న విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయా అంశాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేయకుండా.. ప్రశ్నించే ఎంపీల గొంతు నొక్కడం అప్రజాస్వామికమని అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా విపక్షాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బీజేపీ తీరును ప్రతి వేదికపై తిప్పికొట్టాల్సిందేనని, దీనికై భావ సారూప్య పార్టీలన్ని ఉమ్మడిగా ఉద్యమించాల్సిందేనని నేతలు నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలో కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎస్పీ నేతలు చెప్పినట్లు సమాచారం.  

Advertisement
 
Advertisement
 
Advertisement