ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

Published Wed, Dec 8 2021 8:53 PM

Telangana CM KCR Letter To Prime Minister Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్‌) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి  చేశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధానికి లేఖ రాశారు. సాలీనా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మరియు తమిళనాడులోని థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తుందని సిఎం లేఖలో పేర్కొన్నారు.

చదవండి: Bipin Rawat: ఎంఐ హెలికాప్టర్‌.. మృత్యువుకి మరో పేరు.. 42 మందికి పైగా దుర్మరణం 

రాష్ట్ర విభజన తర్వాత  తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ జూన్ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగినందున విద్యుత్ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని తెలిపారు.  సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్ లీజులను మంజూరు చేసిందని, దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రాంచ్ 13 కింద వేలం వేయదలిచిన జేబిఆర్ఓసి-3, శ్రావన్  పల్లి ఓసి, కోయగూడెం ఓసి-3 మరియు కెకె -6 యుజి బ్లాక్ ల వేలం వల్ల సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వున్నందున వాటి వేలాన్ని నిలిపివేయమని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను  ఆదేశించవలసిందిగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రధానిని కోరారు. ఈ బ్లాక్ లను సింగరేణికే కేటాయించేలా చూడాలని సిఎం.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement