‘సంక్షేమం’ కాస్త మెరుగు !

Telangana Budget 2023: 17700 Crore Allocated Under Dalit Bandhu For SC - Sakshi

గత బడ్జెట్‌తో పోలిస్తే సంక్షేమ శాఖలకు పెరిగిన నిధులు  

ఎస్సీలకు దళితబంధు కింద రూ.17,700 కోట్లు  

బీసీల స్వయం ఉపాధికి మాత్రం అరకొరగానే కేటాయింపులు

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ శాఖలకు 2023–24 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు మెరుగుపడ్డాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి నిధులు కాస్త పెరిగాయి. నూతన నియామకాలు, ఇతరత్రా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను పెంచింది. అయితే పెరిగిన కేటాయింపులతో మాత్రం క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాలకు పెద్దగా ప్రయోజనం లేదు.

గత బడ్జెట్‌లో సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు జరిగినట్లుగానే ఈదఫా అటుఇటుగా కేటాయింపులు చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ (ఎస్సీడీడీ)కు గత బడ్జెట్‌ కంటే దాదాపు రూ.400 కోట్లు పెరిగాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలు చేస్తున్న దళితబంధు పథకానికి ఈసారి కూడా రూ.17,700 కోట్లు కేటాయించారు. అయితే ఈ పథకం కింద 2022–23లో ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఆ నిధులనే ఈసారి క్యారీఫార్వర్డ్‌ చేశారు.

బీసీలకు అంతంతే...!
బడ్జెట్‌ వెనుకబడిన తరగతుల్లో పెద్దగా ఉత్సాహం నింపలేదు. ఈసారి బీసీ సంక్షేమ శాఖకు రూ.6,229 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.531 కోట్లు పెరిగాయి. తాజాగా బీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. గత బడ్జెట్‌లో ఎంబీసీ కార్పొరేషన్లకు రూ.400 కోట్లు కేటాయించగా... ఈసారి రూ.100 కోట్లు తగ్గింది. 2022–23లో ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి సంబంధించిన పథకాలేవీ అమలు కాలేదు.

దీంతో గత కేటాయింపులే ఈసారీ జరిపినట్లు చెప్పొచ్చు. ఇక రజక, నాయూ బ్రాహ్మణ ఫెడరేషన్లకు గత బడ్జెట్‌ మాదిరిగానే ఈసారీ రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. కల్లుగీత కార్మికుల ఫెడరేషన్‌కు కూడా గతంలో మాదిరిగానే రూ.30 కోట్లు కేటాయించగా... మిగతా ఫెడరేషన్లకు నామమాత్రపు నిధులే కేటాయించడంతో ఆయా వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసినట్లైంది.

బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో 2023–24 సంవత్సరంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ప్రస్తుత సంస్థల అప్‌గ్రెడేషన్, తరగతుల పెరుగుదల, కొత్తగా ఉద్యోగుల నియామకాలు తదితరాలకు నిధుల ఆవశ్యకత పెరగడంతో కేటాయింపుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అదేవిధంగా క్రిస్టియన్‌ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్‌లకు ఆర్థిక చేకూర్పు పథకాల కింద 270 కోట్లు కేటాయించారు. కార్మిక సంక్షేమ శాఖకు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలకు కూడా కేటాయింపులు కాస్త మెరుగుపడ్డట్లు బడ్జెట్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ శాఖల పరిధిలో కొత్త పథకాల ఊసులేదు.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top