అసెంబ్లీకి అనూహ్య ఎక్స్‌టెన్షన్‌.. మరో రెండు రోజులు! | Telangana Assembly Session May Be Extended by Two More Days | Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి అనూహ్య ఎక్స్‌టెన్షన్‌.. మరో రెండు రోజులు!

Sep 16 2026 12:49 PM | Updated on Sep 16 2026 12:57 PM

Telangana Assembly Session May Be Extended by Two More Days

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయనుకుంటే.. అనూహ్యంగా పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతోనే సమావేశాలు ముగుస్తాయని ఇప్పటివరకు భావించినప్పటికీ.. ఇవాళ కాకుండా మరో రెండు రోజుల పాటు సభను నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ సమావేశాల వ్యవధిపై ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన నేపథ్యంలో.. ఈ అంశంపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఎన్నికల హామీల అమలు, ఇప్పటివరకు సాధించిన పురోగతిపై సభలో వివరించే అవకాశం ఉంది. మరోవైపు వెయ్యి రోజుల పాలనపై ‘మోసం’ పేరిట బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో.. సభా వేదికగా వాటికి సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉంది. ఇవాళ్టి సమావేశాల బ్రేకులో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారని సమాచారం. అయితే సాయంత్రంకల్లా దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

22ఏపై నేడు చర్చ
మరోవైపు ఎల్‌ నినోతో పాటు 22ఏ నిషేధిత భూముల అంశంపై కూడా గురువారం మధ్యాహ్నం తర్వాత సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ అంశంపై మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 22ఏ జాబితాలో ప్రైవేటు భూములు చేరడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం తన వైఖరిని సభలో స్పష్టం చేయనుంది.

రెండు రోజులు ఎందుకు?
అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తాయని అంతా భావించిన వేళ.. మరో రెండు రోజులు పొడిగించే ఆలోచన తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. వెయ్యి రోజుల పాలనపై చర్చతోపాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం సమగ్రంగా వివరించే అవకాశం ఉంది. తద్వారా బీఆర్‌ఎస్‌, బీజేపీ చేస్తున్న విమర్శలకు సభా వేదికగానే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సమావేశాల పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగుతాయన్నది స్పష్టత రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement