Telangana: పది పరీక్షలు ప్రారంభం.. వచ్చే నెలాఖరుకు ఫలితాలు

Telangana 10th Class SSC 2022 Exams Begin - Sakshi

క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై పరీక్షల విభాగం డైరెక్టర్‌ సమావేశం   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. మొత్తం 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ఆదివారం వర్చువల్‌ పద్ధతిలో అధికారులతో సమీక్షించారు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని, అదనపు బల్లలు, ఇతర సౌకర్యాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని.. వాటికయ్యే ఖర్చు పరీక్షల విభాగం భరిస్తుందని తెలిపారు. తర్వాత ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. పరీక్షల ఫలితాలను ఎట్టి పరిస్థితుల్లో జూన్‌ నెలాఖరుకు వెల్లడించాలని నిర్ణయించామన్నారు. వీలైనంత త్వరగా మార్కుల మెమోలు కూడా అందే ఏర్పాటు చేస్తామన్నారు. జూన్‌ 2 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం మొదలవుతుందని, పరీక్షలు జరుగుతుండగానే ఇందుకు కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నామని చెప్పారు.  

అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు
ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా నిఘా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ గదిలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి అక్కడ ప్రశ్నపత్రాల బండిల్‌ను ఓపెన్‌ చేస్తారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పోలీసుల పహారా ఉంటుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top