లెక్కలు లేని.. 3.5 కోట్లు స్వాధీనం | Sakshi
Sakshi News home page

లెక్కలు లేని.. 3.5 కోట్లు స్వాధీనం

Published Wed, Oct 12 2022 12:45 AM

Task Force Police Focused On Money Smuggling While Munugode Bypoll Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగదు అక్రమ రవాణాపై దృష్టిపెట్టారు. గతవారం మూడు ఘటనల్లో రూ.3.7కోట్లు పట్టుకోగా..సోమవారం రాత్రి నగరంలోని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసు­లు లెక్కలు లేని రూ.3.5 కోట్లను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిర్మాణ రంగ వ్యాపారైన హిమాయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కె.వెంకటేశ్వర్‌రావు సైదాబాద్‌కు చెందిన మరోవ్యాపారి బాలు మహేందర్‌కు రూ.3.5 కోట్లు నగదు రూపంలో ఇవ్వాలని భావించారు.

అయితే ఈ నగదు తీసుకునేందుకు బాలు మహేందర్‌ కర్మన్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన తన స్నేహితులు గండి సాయికుమార్‌ రెడ్డి, మహేశ్, సందీప్‌కుమార్, మహేందర్, అనూష్‌రెడ్డి, భరత్‌­లను పంపాడు. ఈ ఆరుగురూ సోమవారం రాత్రి రెండుకార్లలో మారియట్‌ హోటల్‌ వెనుక ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడకు మరో కారులో వచ్చిన వెంకటేశ్వర్‌రావు నాలుగు అట్టపెట్టెల్లో సీల్‌­వేసి తీసుకువచ్చిన నగదును వీరికి అప్పగించాడు. వాటిని తమ కార్లలో పెట్టుకుని ఆరుగురూ సైదాబా­ద్‌ వైపు బయల్దేరారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి వారిపై దాడిచేసి నలుగురిని పట్టుకున్నారు.

వెంకటేశ్వర్‌రావు, బాలు మహేందర్‌లు పారిపోయారు. కాగా, వీరి వాహనాలను తనిఖీ చేయగా రూ.3.5 కోట్లు బయటపడ్డాయి. ఈ నగదుకు సంబంధించిన లెక్కలు వారి వద్ద లేకపోవడంతో కార్లతో సహా స్వాధీనం చేసుకుని గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్‌రావు, బాలు మహేందర్‌ కోసం గాలిస్తున్నారు. ఈ నగదుతో మునుగోడు ఉప ఎన్నికలకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement