
ఆత్మహత్య చేసుకున్న తండ్రి వద్ద చిన్నారి పిలుపులు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తండ్రి నిద్రపోయాడనుకున్న ఆ రెండేళ్ల చిన్నారి చనిపోయిన తండ్రిని ‘డాడీ.. లే డాడీ’.. అంటూ పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్ (డబుల్ బెడ్రూం సముదాయం)లోని బ్లాక్ నంబర్ 18, రూం నంబర్ 6లో నివాసముంటున్న తాడూరి రామ్‌కుమార్ (38) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు..
రామ్‌కుమార్ 14 ఏళ్ల కిత్రం వేములవాడకు చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం సుఖజిత్ (11), శ్రీవాస్తవ్ (5), విహాన్ (2). రామ్‌కుమార్ జిరాక్స్ మెషీన్ మెకానిక్‌గా, వివాహ ఈవెంట్లలోనూ పనిచేస్తుండేవాడు. పనులు సరిగాలేక రామ్‌కుమార్‌కు రూ.3 లక్షల వరకు అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
బుధవారం మధ్యాహ్నం భార్య వంట గదిలో ఉన్న సమయంలో పెద్ద కొడుకు సుఖజిత్‌తో మాట్లాడిన రామ్‌కుమార్, తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ఉరేసుకున్నాడు. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో భార్య కేకలతో స్థానికులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. ట్రెయినీ ఎస్సై వినీతారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.