
ఆర్థిక ఇబ్బందులతో ప్రాణం తీసుకోవాలనుకున్న దంపతులు
భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
హైదరబాద్: ఆ భార్యాభర్తలు ఒకరికొకరు తోడు.. నీడగా జీవనం సాగించాలనుకున్నారు.కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని భావించారు. అయితే వారిని ఆరి్థక ఇబ్బందులు వెంటాడాయి. అప్పుల బాధలు ఎక్కువయ్యాయి. దీంతో ప్రాణం తీసుకోవాలని భావించారు. ఎలా మృతి చెందాలో అర్థం కాలేదు. ప్రాణం తీసుకునే ధైర్యం లేకో.. ఏమో..ఒకరిని ఒకరు కత్తితో పొడుచుకొని చావాలని నిర్ణయించుకున్నారు. నాలుగు రోజుల పాటు ఒకరిని ఒకరు పొడుచుకున్నారు. ఈ క్రమంలో భర్త మరణించగా భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు..
గుంటూరు జిల్లాకు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (45), రమ్యకృష్ణ(38)లు కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్‌లో పనిచేస్తుండగా భార్య గృహిణి. గతంలో నిర్వహించిన వ్యాపారాల్లో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు గాయపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నాలుగు రోజులుగా ఒకరిని ఒకరు ఉదరభాగం, మణికట్టు, గొంతుపై గాయపరుచుకున్నారు. ఉదర భాగంలో తీవ్ర రక్తస్రావమై రామకృష్ణ శుక్రవారం మృతి చెందగా, రమ్యకృష్ణ తీవ్రంగా గాయపడింది.
శనివారం ఉదయం రమ్యకృష్ణ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. కేపీహెచ్‌బీ పోలీసులు వెళ్లి చూడగా రామకృష్ణ మృతి చెందినట్లు గమనించారు. రమ్యకృష్ణ సోఫాలో కూర్చుని ఉంది. వెంటనే ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి, కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, సెక్టార్ ఎస్‌ఐ శ్రీలతా రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మూడు నెలల క్రితమే...
వీరు మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నట్లు రమ్యకృష్ణ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. శుక్రవారం రామకృష్ణ బలమైన గాయం చేయాలని రమ్యకృష్ణపై ఒత్తిడి చేయడంతోపాటు తనను తాను గాయపరుచుకునేందుకు యత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో రామకృష్ణ మృతి చెందాడు. బెడ్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఇదిలా ఉండగా పోలీసులు వచ్చే వరకు అపార్టుమెంట్‌లో ఏ ఒక్కరికి కూడా విషయం తెలియకపోవడం, కత్తితో తీవ్రంగా గాయాలు చేసుకున్నప్పటికి ఎవరూ అరవకపోవడం గమనార్హం.
సూసైడ్ నోట్ రాసి...
అవమానాలు భరించలేకపోతున్నాం... ఈ లోకంలో ఉండలేకపోతున్నాం. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాం అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు రామకృష్ణ గదిలో స్వాధీనం చేసుకున్నారు. పదిహేను రోజుల క్రితం రాసిన ఈ లేఖలో ఆర్థికం ఇబ్బందులుతో పాటు చేతి బదులుగా డబ్బులు ఇచ్చిన వారు తీర్చేందుకు సమయం ఇవ్వకపోవడం అవమానించడం వంటి వివరాలను రాసినట్లుగా ఉంది.