బీఆర్ఎస్ నేత హ‌త్య కేసును చేధించిన పోలీసులు | Suryapet BRS Leader Death Case Latest Update | Sakshi
Sakshi News home page

బీఆర్ఎస్ నేత హ‌త్య కేసును చేధించిన పోలీసులు

May 25 2026 5:34 PM | Updated on May 25 2026 5:57 PM

Suryapet BRS Leader Death Case Latest Update

సూర్యాపేట: బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రొక‌రు ప‌రారీలో ఉన్నార‌ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర‌సింహ‌ సోమ‌వారం మీడియా స‌మావేశంలో తెలిపారు. పాత‌క‌క్ష‌ల నేప‌థ్యంలోనే మధును మ‌ట్టుబెట్టార‌ని చెప్పారు. త‌న తండ్రి హ‌త్య‌కు ప్ర‌తీకారంగా ప్ర‌ధాన నిందితుడు మిద్దె జీవన్ ఈ హ‌త్య‌కు పాల్ప‌డినట్టు ఎస్పీ వెల్ల‌డించారు. అత‌డికి మరో ఐదుగురు స‌హ‌క‌రించార‌ని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు మిద్దె రవీందర్ 2007లో యర్కారంలో హత్యకు గుర‌య్యాడు. త‌న తండ్రిని హ‌త్య చేసిన మ‌ధుపై ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ర‌వీంద‌ర్‌ కొడుకు జీవన్ గ‌తంలో రెండు సార్లు హత్యాయత్నం చేసి విఫలం అయ్యాడు. తాజాగా పక్కా ప్లాన్‌తో మధును హత్య చేశాడు. కొంత‌కాలంగా సూర్యాపేట బాలాజీన‌గ‌ర్‌లో కుటుంబంతో పాటు నివ‌సిస్తున్న మ‌ధును ప‌థ‌కం ప్ర‌కారం బ‌య‌ట‌కు తీసుకొచ్చి క‌త్తుల‌తో న‌రికి చంపారు.

చేపల కూరతో పార్టీ చేసుకుందామంటూ మ‌ధును చింత సైదులు శుక్ర‌వారం త‌న ఇంటికి పిలిచాడు. వీరితో పాటు మేదరి ప్రసాద్ అనే మ‌రో వ్య‌క్తి కూడా ఉన్నాడు. సాయంత్రం సైదులు, ప్రసాద్‌తో కలిసి మ‌ధు మ‌ద్యం సేవించాడు. అత‌డు మ‌త్తులోకి జారుకోగానే జీవన్‌కు సైదులు ఫోన్ చేశాడు. సోదరుడి వరుస అయ్యే ఆనంద్‌తో కలిసి మటన్ కొట్టే కత్తి తీసుకుని సైదులు ఇంటికి వ‌చ్చాడు జీవన్. ఆ తర్వాత జీవన్, సైదులు కత్తితో మధును విచక్షణారహితంగా నరికి చంపారు. మృతదేహాన్ని గొనెసంచితో మూట‌గ‌ట్టి, కారులో తీసుకెళ్లి యర్కారం వద్ద కల్వర్ట్‌లో పడేశారు.

మధు హత్యకు సహకరించిన సైదులు భార్య ముల్కలపల్లి భవానీ పరారీలో ఉంద‌ని ఎస్పీ నర‌సింహ తెలిపారు. మిద్దె జీవన్, చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్‌ల‌ను అరెస్ట్ చేసిన‌ట్టు చెప్పారు. నిందితులతో పాటు కారు, బైక్, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని ఎస్పీ అన్నారు. 

చ‌ద‌వండి: వ్య‌వ‌స్థ చ‌చ్చింది.. శవ‌మై న‌డిచింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement