ఆర్థిక స్తోమత లేక.. భుజంపై మృతదేహాన్ని కిలోమీటరు మోసుకెళ్లిన కుటుంబీకులు మార్చురీ వ్యాన్ ఏర్పాటు చేయమని కోరినా.. ఆస్పత్రి అధికారులు స్పందించ లేదంటున్న బాధితులు
భద్రాచలం టౌన్: ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి పేదింటి కుటుంబాన్ని దుఃఖంలో ముంచింది. కంటిముందే ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోగా, ఆఖరి పయనానికైనా వాహనం ఇవ్వని వారి వైఖరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం రాత్రి ఒక కుటుంబం తమ బంధువు మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లేలా చేసింది. ఈ దయనీయ దృశ్యం స్థానికులను కలచివేసింది.
పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన కండె వెంకన్న (42) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆదివారం సాయంత్రం స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందాడని తెలిపి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రైవేటు వాహనంలో తరలించే ఆర్థిక స్తోమత లేక, మార్చురీ వ్యాన్ ఏర్పాటు చేయమని ఆస్పత్రి అధికారులకు ఆ కుటుంబీకులు పలుమార్లు విన్నవించుకున్నారు. రెండు గంటల పాటు ఆశగా ఎదురుచూసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోయింది.
చీకటి రాత్రిలో.. నిస్సహాయ శవయాత్ర
చివరకు రాత్రి 9 గంటల సమయంలో ఆ కన్నవారు గుండెలవిసేలా ఏడుస్తూ.. కండె వెంకన్న మృతదేహాన్ని తమ చేతులపైనే ఎత్తుకున్నారు. ఆసుపత్రి నుంచి సుభాష్ నగర్‌లోని తమ ఇంటి వరకు చీకట్లో సుమారు కిలోమీటరు దూరం మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లారు. ఈ అమానవీయ ఘటనపై భద్రాచలం ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణను వివరణ కోరగా.. తాను విధుల్లో లేనని, అధికారులు అంబులెన్స్ ఏర్పాటు చేసేలోగా కుటుంబీకులే మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు.


