breaking news
Heatstroke
-
రాష్ట్రంపై వడగాడ్పుల పడగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రచండ భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడగాడ్పుల ప్రభావానికి సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ప్రాణాలు విడిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 14 మంది ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, విశాఖ, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 10 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత అత్యంత తీవ్రంగా, 125 మండలాల్లో తీవ్రంగా ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, కృష్ణా, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు మండలాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేకచోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.నేడు ఎండ తీవ్రంగా ఉండే జిల్లాలుమంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
వడదెబ్బతో 49 మంది మృతి
సాక్షి నెట్వర్క్: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బకు గురయ్యే వారి సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో 49 మంది చనిపోయారు. వరంగల్ జిల్లా బుధరావుపేటలో గుండ్రపల్లి సదయ్య (58), ధర్మారంలో అంకేశ్వరపు సమ్మక్క (70), దమ్మన్నపేటలో అనసూర్య (68), ఖిలా వరంగల్ పడమరకోటలో బొల్లం వీరమల్లు (68), మొండ్రాయిలో తండ చేరాలు (75), పుల్లయబోడులో భూక్య నరేశ్ (29), సర్వాపురానికి చెందిన మండల వీరయ్మ (74) వడదెబ్బతో మృతిచెందారు. ⇒ పరకాల డిపోనకు చెందిన కండక్టర్ బి.శంకర్ (48) విధుల్లో భాగంగా భద్రాచలం నుంచి పరకాల బయలుదేరి కొత్తగూడెం దాటిన తర్వాత అనిశెట్టిపల్లి వద్ద వేడిగాలితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆర్టీసీ డ్రైవర్, ప్రయాణికులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణం కోల్పోయాడు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నగరంపల్లిలో గొర్రెలకాపరి కోడారి సాంబయ్య(52), అంకుషాపూర్‌లో వ్యవసాయ కూలీ మహమ్మద్ సైద్‌ఖాన్ (42), జనగామ జిల్లా రంగరాయగూడెంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అదే గ్రామానికి చెందిన రైతు నెలమంచ ఎలేందర్‌రెడ్డి (39) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై చనిపోయాడు. శివునిపల్లికి చెందిన పిట్టల శంకర్–రవళి దంపతుల కుమారుడు అక్షిత్ (4) ఎండ తీవ్రతతో మృతి చెందాడు. ఘన్‌పూర్‌లో తాటికొండ నర్సమ్మ(65), కామారపు విజయ్ (60), వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో కూలీ నైనబోయిన రాజు(44) హనుమకొండ జిల్లా నీరుకుళ్లలో మేస్త్రీ వద్ద పనిచేసే కూలీ వడదెబ్బతో చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెయింటర్ కొమిరె రమేశ్ (39), బైపాస్‌రోడ్డులో ఉండే యాచకుడు షేక్ లతీఫ్ (50), ములుగుకు చెందిన బీజేపీ నేత అన్నపురెడ్డి ప్రమోద్‌రెడ్డి (49), కమలాపురంలో అన్నపు రెడ్డి లక్ష్మీబాయి (80), తిరువాయిపేట వెంకటరమణ (48), తాడి సత్యవతి (80) వడదెబ్బతో చనిపోయారు. ⇒ నిజామాబాద్ జిల్లా అంజుమాన్ ఫారమ్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పడారి గంగన్న (40), బౌరంపేటలో రైతు రమేశ్ (42), ఉమ్మడి కరీంనగర్ జిల్లా..జగిత్యాలలో గొల్లపల్లి శివప్రసాద్‌గౌడ్ (50), రామడుగులో లక్ష్మీరాజం (48), గోపాల్రావుపేటలో షేర్ల నరేశ్ (30), ఘన్ముక్కులలో బొంగోని రాజవీరు (65), జమ్మికుంటలో దాసారపు కాంతమ్మ (59), సుల్తానాబాద్‌లో తోడేటి లక్ష్మి (44), వెన్నంపల్లిలో ఉపాధి కూలీ గోసు్కల గట్టయ్య (52), రామగుండంలో కుమార్ (40), యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో సుంకరి భాగ్యమ్మ (79), పెద్దగూడెంలో కౌలు రైతు కాకారం ధర్మారెడ్డి (70), తోపుచర్లలో వేముల సైదమ్మ (42), మంచిర్యాల జిల్లా జన్నారంలో యాట ఇందయ్య (60), మైలారంలో బర్ల బుచ్చయ్య (71), చెన్నూర్‌లో తోగటి అశోక్ (46), సీసీసీ రిటైర్మెంట్ కాలనీలో ఆటో డ్రైవర్ రెడ్డిమల్ల లక్ష్మణ్ (49), నర్సింగపూర్‌లో సిడం వెంకటేశ్(33), ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో బోనగిరి లస్మన్న(70), సిద్దిపేట జిల్లా తెల్లపలుగు తండాకు చెందిన బానోతు సంగ్లనాయక్ (65) వడదెబ్బతో చనిపోయారు. ⇒ భద్రాద్రి జిల్లాలోని చలమప్పగూడెంలో వ్యవసాయ పనులకు వెళ్లిన బండారు నాగమణి (40), అశ్వారావుపేటలో బోగి మంగ (62), జగన్నాథపురంలో ముత్తిని నర్సింహారావు (70), టేకులచెరువులో దాసరి దుర్గమ్మ (56), ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉస్మాన్ (54), నారపునేనిపల్లిలో మంచికంటి విజయ(80), దారేడులో కూలీ షేక్ ఇమామ్ (45) వడదెబ్బతో మృతి చెందారు.మూడు రోజుల తర్వాత..భార్య కూతురి ఇంటికి వెళ్లడంతో తల్లాడలో మిర్చి కమీషన్ వ్యాపారి బండారు మోహన్‌రావు (65) ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం నిద్రించాడు. ఎండల తీవ్రతతో వడదెబ్బ బారిన పడగా తాగునీరు ఇచ్చేవారు కూడా లేక రెండు రోజుల క్రితమే మృతి చెందాడు. ఇరుగు పొరుగు వారికి వాసన వస్తుండటంతో తలుపులు పగులగొట్టే సరికి కుళ్లిన స్థితిలో మృతదేహం బయటపడింది. -
వ్యవస్థ చచ్చింది.. శవమై నడిచింది!
భద్రాచలం టౌన్: ప్రభుత్వ వైద్యాధికారుల నిర్లక్ష్య వైఖరి పేదింటి కుటుంబాన్ని దుఃఖంలో ముంచింది. కంటిముందే ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోగా, ఆఖరి పయనానికైనా వాహనం ఇవ్వని వారి వైఖరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆదివారం రాత్రి ఒక కుటుంబం తమ బంధువు మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లేలా చేసింది. ఈ దయనీయ దృశ్యం స్థానికులను కలచివేసింది.పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన కండె వెంకన్న (42) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆదివారం సాయంత్రం స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందాడని తెలిపి, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రైవేటు వాహనంలో తరలించే ఆర్థిక స్తోమత లేక, మార్చురీ వ్యాన్ ఏర్పాటు చేయమని ఆస్పత్రి అధికారులకు ఆ కుటుంబీకులు పలుమార్లు విన్నవించుకున్నారు. రెండు గంటల పాటు ఆశగా ఎదురుచూసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోయింది. చీకటి రాత్రిలో.. నిస్సహాయ శవయాత్ర చివరకు రాత్రి 9 గంటల సమయంలో ఆ కన్నవారు గుండెలవిసేలా ఏడుస్తూ.. కండె వెంకన్న మృతదేహాన్ని తమ చేతులపైనే ఎత్తుకున్నారు. ఆసుపత్రి నుంచి సుభాష్ నగర్‌లోని తమ ఇంటి వరకు చీకట్లో సుమారు కిలోమీటరు దూరం మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లారు. ఈ అమానవీయ ఘటనపై భద్రాచలం ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణను వివరణ కోరగా.. తాను విధుల్లో లేనని, అధికారులు అంబులెన్స్ ఏర్పాటు చేసేలోగా కుటుంబీకులే మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పుకొచ్చారు. -
వడదెబ్బతో 61 మంది మృతి
సాక్షి, నెట్వర్క్ : అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో 61 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 26 మంది ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా పాతపోచారంలో లింగాల రాజయ్య(75), బడితండాలో అజ్మీరా లచ్యా (80), నెల్లికుదురులో వీరగాని వీరమ్మ (84), కొత్త రామయ్య (86), తొర్రూరులో పైండ్ల నర్సయ్య(45), అమ్మాపురంలో అత్తిలి రాము(60), నాంచారిమడూరులో సోమ నారాయణ (65), గూడూరులో పాపని ఎల్లమ్మ (68) వడదెబ్బతో మృతి చెందారు. ములుగు జిల్లా రామన్నగూడెంలో దొడ్డ వెంకటయ్య(85), కన్నెపల్లిలో పాయం సుశీంద్ర (65), జనగామ నాగిరెడ్డిపల్లిలో తేలు మల్లమ్మ (70), జఫర్‌గఢ్‌లో తాటికాయల బాబు (49), రంగరాయగూడెంలో తల్లీకూతుళ్లు మంద చంద్రమ్మ(80), కవిత (35), జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లిలో ఎర్రబోయిన జయలక్ష్మి (65), వరంగల్ కరీమాబాద్‌లో బేతి అశోక్ (55), కరీమాబాద్‌లో మైదం శ్రీను (55), వెంకటాపురంలో గోర్కటి లింగమ్మ (70), గొర్రెకుంటలో గడ్డం పద్మ (55), వర్ధన్నపేటలో చందు ఐలయ్య (88), ఇల్లందలో వనం వజ్రమ్మ (70), రొడ్డ సుశీల (65) వడదెబ్బతో మృతిచెందారు. హనుమకొండ జిల్లా గాంధీనగర్‌లో తూముల రాజయ్య (68), కొత్తూరు మార్కెట్ ప్రాంతంలో నివసించే ఎండీ.బియాబానీ (65), కొండపర్తిలో నీరటి అనసూర్య(58), వెల్లంపల్లిలో నూక సాంబయ్య (65) వడదెబ్బతో మృతి చెందారు. ⇒ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.. పెద్దపల్లి జిల్లా నాగారానికి చెందిన మల్యాల సత్తమ్మ (78), రొంపికుంటకు చెందిన కొండి లక్ష్మి (75), చిప్ప శ్రీనివాస్ (35), ధూళికట్టకు చెందిన గండ్ర సత్తెమ్మ (65), కొత్తపల్లికి చెందిన పిన్‌రెడ్డి అశ్విని (33), రాయికల్‌కు చెందిన గద్దె భూమక్క (75), పోచమ్మవాడకు చెందిన ఎద్దండి రాజవ్వ (85), కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన కనుకయ్య(60), రామగుండం యైటింక్లయిన్‌కాలనీలో ఆటో డ్రైవర్ ముత్యం అశోక్ (39), గోదావరిఖనిలో కూరెళ్ల సంపత్(50), అశోక్‌నగర్‌లో బొజ్జ శంకరయ్య(70) వడదెబ్బతో చనిపోయారు. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో... ఇల్లూరులో కొరివి అచ్చయ్య (90), పైనంపల్లిలో బీమాల వెంకటేశ్వర్లు (43), ఖమ్మం పాత బస్టాండ్‌లో గురుజాల కొండలు (50), బూర్గంపాడులో నోముల వంశీకృష్ణ (33), సారపాక ప్రధానకూడలి సమీపాన గుర్తు తెలియని వ్యక్తి, పాల్వంచలో కాగితాలు ఏరుకొని జీవించే గుర్తు తెలియని వ్యక్తి (50), అశ్వారావుపేటలో ఎస్.కే.షాహిదా (65), మామిడిగుండాలలో ముక్తి పూర్ణ (35), రుద్రంపూర్‌లో ఎన్.రజినీకాంత్(36) వడదెబ్బతో కన్నుమూశారు. ⇒ సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో చల్లగొండ లక్ష్మణ్‌రావు (59), హుస్నాబాద్‌లో పోశవేని సహదేవ్(64), – నిజామాబాద్ జిల్లా చౌడ్తండాలో ధరావత్ బుజ్జి (42), యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వెంకటేశ్ అలియాస్ చిన్న (47),వానరాశి రత్నమ్మ(52), ధర్మోజిగూడెంలో కృష్ణవేణి(60) , సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పుల శివ(40), ఇస్తాళపురంలో ఐలయ్య (66) వడదెబ్బతో మృతి చెందారు, ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. బాదంపల్లిలో దాది నరేశ్ (39), జెండావెంకటాపూర్‌లో లాటుకూరి కిరణ్(30), కుమురంభీం జిల్లా పారిగాంలో ఎల్కరి అశోక్, జక్కాపూర్‌లో పిప్రె సాయినాథ్(45), మంచిర్యాల జిల్లా ముత్యంపల్లిలో మందరాజు (49), నిర్మల్ జిల్లా కడెంలో గుర్తుతెలియని వ్యక్తి, జన్నారం మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. -
Telangana: వడదెబ్బతో 30 మంది మృతి
సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన గిరిజనుడు కిరణ్‌కుమార్ (27), తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఆత్రం రాము (44), నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని బొడ్రాయి వీధికి చెందిన గంగాధర శాంతమ్మ (86), నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన కుకుట్ల కృష్ణయ్య (46), సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ముక్కుడుదేవులపల్లికి చెందిన దాసరి బిక్షం (60) మృతి చెందారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడేనికి చెందిన జనగం రాంబాబు (43), ఖమ్మంలో గుర్తుతెలియని యాచకుడు (65), కొణిజర్లకు చెందిన ఉపాధి కూలీ పాముల శ్రీను (53), భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ఆజాద్‌నగర్‌కు చెందిన పురోహితుడు ముక్కవరపు వెంకటేశ్వర్లు (65), ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన శానిటరీ పనులతో జీవనం సాగించే యార్లగడ్డ గోవర్దన్‌రావు(70), చర్ల మండలం ఆర్.కొత్తగూడెం జీపీ పరిధి దానవాయిపేటకు చెందిన దాగం సీతమ్మ(60), ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ సలీం(42), చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన చింతచిగురు అమ్ముకునే పుట్టపర్తి భద్రమ్మ(60), ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన పూల దుకాణంలో పనిచేసే నాగయ్య(55), పరిగిముక్కల కాలనీకి చెందిన అచ్యుత్‌రావు(70) వడదెబ్బతో మృతి చెందారు. మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కోట నిరంజన్(60) బంధువుల అంత్యక్రియలకు వెళ్లివచ్చాక వడదెబ్బతో అస్వస్థతకు గురై కన్నుమూశాడు. ⇒ సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన గైని కవిత–సంజీవ్ దంపతులు కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. వీరి కూతురు కూతురు కీర్తిక (8) వేసవి సెలవుల్లో నానమ్మతో గడిపేందుకు సొంతూరికి వచ్చింది. నాలుగు రోజులుగా తోటి పిల్లలతో కలిసి ఆరు బయట ఆడుకుంటోంది. నీరసం, జ్వరం రాగా, ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ⇒ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ (68), డోర్నకల్ మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన నన్నెబోయిన సత్యం(75), వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ పడమర కోట ప్రాంతానికి చెందిన బండి హరిశంకర్ (58), రంగశాయిపేటకు చెందిన ఆటో డ్రైవర్ విండ్ల సంతోష్‌కుమార్ (49), పర్వతగిరికి చెందిన చిర్రబోయిన అరుణ (45), నల్లబెల్లి మండలం ఆసరవెల్లికి చెందిన గుగులోతు నరసింహ (55), జనగామ జిల్లా కొడకండ్ల మండలం గుమ్ములబండ తండాకు చెందిన గుగులోత్ రామ్‌సింగ్ (75) వడదెబ్బతో మృతిచెందారు. ⇒ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన ఆరెల్లి పరశురాములు (62), జగిత్యాల రూరల్ మండలం మోరపల్లికి చెందిన కర్నె లచ్చయ్య (85), పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన కల్వకోట రామస్వామి (70), గోదావరి ఖనికి చెందిన అబ్బాస్‌ఖాన్(53) వీణవంక మండలం ఇప్పలపల్లికి చెందిన వేల్పుల ఐలయ్య (62), జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్కోత్తూర్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మేస్త్రీ అండ్ర శ్రీనివాస్ (40) వడదెబ్బతో చనిపోయాడు. ⇒ మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్న మెట్పల్లి గ్రామానికి చెందిన వీఓఏ దుగుట సంతోశ్ శుక్రవారం వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. రహదారిపై స్కూటీ దగ్ధం జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ సమీపాన సీతారామ కెనాల్ బ్రిడ్జి ఎండ తీవ్రతతో ఓ స్కూటీ కాలిపోయింది. పాల్వంచకు చెందిన దంపతులు స్కూటీపై శుక్రవారం ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా వినోభానగర్ సమీపాన స్కూటీలో మంటలు మొదలయ్యాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించిన దంపతులు స్కూటీని వదిలేసి పక్కకు వెళ్లిన క్షణాల్లోనే మంటలు ఉధృత రూపం దాల్చి వాహనం కాలిబూడిదైంది. మరో రెండ్రోజులు అధిక ఉష్ణోగ్రతలే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
ఏసీలోనే యమ డేంజర్!
మనకేం చల్లగా ఏసీలో కూర్చుంటున్నాం. మనకెందుకు వడదెబ్బ తగులుతుంది? మనమెందుకు డీహైడ్రేషన్‌కు గురవుతాము.. అంటూ ధీమాగా కూర్చునే పరిస్థితి ఉందా? అంటే.. లేదనే అంటున్నారు వైద్యులు. ఇంకా చెప్పాలంటే ఎండలో తిరిగే వాళ్లకంటే శీతల గదుల్లో ఉండేవాళ్లే ఎక్కువ డేంజర్లో ఉన్నారని కూడా హెచ్చరిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్ఆఫీసుల్లో చల్లగా, సౌకర్యవంతంగా కూర్చుంటున్న వ్యక్తే డీహైడ్రేషన్ బాధితుడిగా మారుతున్నాడు. ఈ తరహా రోగుల సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని, బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో నెఫ్రాలజీ విభాగపు క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పి.విక్రాంత్‌రెడ్డి అంటున్నారు. డీహైడ్రేషన్ (శరీరంలో ఎలక్ట్రోలైట్స్తో పాటు ముఖ్యంగా నీటి శాతం తగ్గిపోవడం) పరిస్థితిలో శరీరానికి బలమైన హెచ్చరిక సంకేతం దాహం. వేడి, చెమట, వేసవి వల్ల బయట వాతావరణంలో కలిగే అసౌకర్యం దీనికి దారితీస్తుంది.అయితే వడదెబ్బకు గురైనా.. ఏసీ వాతావరణంసౌకర్యవంతంగా ఉండి చెమట పట్టక, చర్మం ఎర్రబడక, గొంతు ఎండిపోనప్పుడు శరీరం పంపాల్సిన హెచ్చరిక సంకేతాలు మందగిస్తాయి. దాంతో శరీరంలో ద్రవాలు కోల్పోతూనే ఉన్నా అది కంటికి కనిపించదు. ‘చల్లని గాలి సౌకర్యవంతంగా అనిపిస్తుంది, కానీ అది శరీరాన్ని బాగా పొడిబారేలా కూడా చేస్తుంది. మరోవైపు చర్మం శ్వాస ద్వారా ద్రవాలు తగ్గుతూనే ఉంటాయి. కాకపోతే చెమట కనిపించక పోవడంతో నీరు తాగడం అవసరమని అనిపించదు. దాంతో నీటి లోటు నెమ్మదిగా పెరుగుతూ పోతుందని వైద్యులు వివరిస్తున్నారు. కెఫిన్..మరో ముప్పు ఏ కార్యాలయంలోనైనా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య టీ రౌండ్లు, నిరి్వరామంగా పనిచేసే కాఫీ, టీ వెండింగ్ మెషీన్లు కనిపిస్తాయి. ‘అలసటను, నీరసాన్ని దూరం చేస్తున్నట్టు అనిపింపజేసే టీ, కాఫీ శరీరానికి కొంత ద్రవాన్ని అందిస్తాయి, కానీ ఒక వ్యక్తి అనేక కప్పుల కెఫిన్ తాగినా శరీరానికి అవసరమైన నీరు అందదు..’అని వైద్యులు వివరిస్తున్నారు. కప్పుల కొద్దీ చాయ్, భోజనం తర్వాత ఒక కాఫీ, లేదా ఒక శీతల పానీయం ఇలా ఏదో ఒకటి తాగుతూ ఉండడం వల్ల ఆ రోజుకు తగినంత నీరు తాగలేదనే విషయం చాలా మంది మదిలో నమోదు కాదని అంటున్నారు. సాధారణ మార్పులతో నిర్లక్ష్యంఈ పరిణామాల నేపధ్యంలో ఏసీలో ఉండే ఉద్యోగులలో డీహైడ్రేషన్ చాలా సాధారణమైన మార్పుల రూపంలో బయటపడుతుంది. మధ్యాహ్నం పూట తేలికపాటి తలనొప్పి, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏకాగ్రత తగ్గడం, శరీర మార్పుల వల్ల కాకుండా పనిభారం వల్ల వచి్చనట్లు అనిపించే అలసట వస్తాయి. దీనికి పనిభారం, స్క్రీన్ టైమ్, లేదా నిద్రలేమి కారణాలని భావిస్తారు. కానీ నీరు తాగకపోవడం కారణంగా గుర్తించరు. పెదవులు ఎండిపోవడం లేదా తలలో కొద్దిగా బరువుగా అనిపించడం వంటి వాటిని కూడా పట్టించుకోకుండా, రోజువారీ పని ఒత్తిడి వల్ల అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.కూర్చునే ఉండొద్దు.. గంటల కొద్దీ కూర్చుని ఉండకుండా.. లేచి ఎక్కడికైనా నడిచి, చుట్టూ పరిసరాలను గమనించినప్పుడు.. నోరు ఎండిపోయిందని, చాలా సేపటి నుంచి నీళ్లు తాగలేదని గుర్తించే అవకాశం పెరుగుతుంది. కేవలం స్క్రీన్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఎక్కువ సేపు కూర్చుంటే ఇది సాధ్యం కాదు. ‘ఎక్కువ సేపు ఒకే చోట ఉండటం వల్ల శరీరం అందించే సంకేతాలను గమనించే అవకాశాలు, నీళ్లు తాగడానికి అవకాశాలు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా ఇది ఒక అలవాటుగా మారి డెస్్కపై ఉన్న నీళ్ల సీసా ఖాళీ అవ్వదు. ఇలాంటి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని, ఏసీలో ఉన్నామనే భరోసాతో ఉండకుండా..తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
సముద్రాలకు ఎండదెబ్బ
‘ఎండ దెబ్బ’కు మహాసముద్రాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియాలతో కూడిన వాయవ్య పసిఫిక్ ప్రాంత సముద్ర జలాల్లో 2024లో రికార్డు స్థాయిలో ఏకంగా అర డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పసిఫక్ మహాసముద్ర జలాలు ఏకంగా 4 కోట్ల చదరపు కి.మీ. మేరకు కనీవిని ఎరుగని రీతిలో వేడెక్కిపోయాయి. ఆ పరిధిలోని జీవజాలాన్ని కూడా ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేసింది. అరుదైన కోరల్ రీఫ్స్ వంటివాటి ఉనికే ప్రమాదంలో పడింది. అంతేగాక ఇండొనేసియాలోని న్యూ గినియా దీవుల్లో ఉన్న ఆ ప్రాంతపు ఏకైక గ్లేసియర్ ఏడాదిలోనే సగం మేరకు కరిగిపోయింది. ఎండలు ఇలాగే పెరిగిపోతే మరో ఏడాదికల్లా అది పూర్తిగా మాయం కావడం ఖాయమని ఐరాస వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జోస్యం చెప్పింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్‌ల్లో గతేడాది ఎండలు సరికొత్త రికార్డులు సృష్టించాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ప్రపంచమైన ఎండల నడుమ వాయవ్య పసిఫిక్ ప్రాంత దేశమైన ఫిలిప్పీన్స్‌పై గత అక్టోబర్, నవంబర్ నెలల్లో లెక్కలేనన్ని తుపాన్లు విరుచుకుపడ్డాయి! ఈ విపరిణామాలన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం’’ అంటూ వాపోయింది. మొత్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా 2024లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని అధ్యయనకర్తల్లో ఒకరైన బ్లెయిర్ ట్రెవిన్ వివరించారు. ‘‘మొత్తం పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతను చూసుకున్నా 2022 తర్వాత రెండో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది! అక్కడి సముద్రమట్టాలు ప్రపంచ సగటుతో పోలిస్తే శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకర పరిణామాలే. ఎందుకంటే వాయవ్య పసిఫిక్ ప్రాంత జనాభాలో ఏకంగా సగానికి పైగా తీరానికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే నివసిస్తున్నారు’’ అని హెచ్చరించారు. సముద్రమట్టాల పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే వారంతా అతి త్వరలో నిర్వాసితులుగా మారి పొట్ట చేత పట్టుకుని వలస పోవడం తప్ప మరో మార్గం ఉండదని అధ్యయన బృంద సభ్యుడు థియా తుర్కింగ్టన్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చుక్కలు చూపిన ఎయిర్ షో
సాక్షి, చెన్నై: చెన్నైలో ఆదివారం జరిగిన భారీ ఎయిర్ షో చేదు అనుభవం మిగిల్చింది. ఎండలకు తాళలేక సొమ్మసిల్లి ఐదుగురు చనిపోగా, 230 మంది ఆస్పత్రి పాలయ్యారు. మృతుల్లో ఒకరు తెలుగు వ్యక్తి అని సమాచారం. షో ఉదయం 11 నుంచి కాగా జనం 8 గంటలకే మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివచ్చారు. ఎండ తీవ్రతకు చాలామంది షో ప్రారంభం కాకమునుపే సొమ్మసిల్లి పడిపోయారు. తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదని వాపోయారు. భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా 21 ఏళ్ల తర్వాత చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో 72 రకాల విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనలు చేశాయి. వీటిని చూసేందుకు ఏకంగా 16 లక్షల మంది తరలివచ్చారు. ప్రదర్శన అనంతరం అంతా ఒక్కసారిగా ఇళ్లకు మరలడంతో గందరగోళం నెలకొంది. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మండుతున్న ఎండ, రద్దీతో ముందుకు సాగేందుకు మార్గం లేకపోవడంతో ఒంట్లో ఓపికలేక చాలామంది రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు. బీచ్‌కు సమీపంలోని వారు కొందరికి మంచినీరు సరఫరా చేయడంతో పరిస్థితి కొంత తేలికపడింది. అయితే, జనం మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో మెట్రో స్టేషన్లు కూడా కిక్కిరిసిపోయాయి. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం లక్ష్యంగా పెట్టుకున్న అధికార యంత్రాంగానికి తగు ప్రణాళిక లేదని, కనీస వసతులు సైతం ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మెరీనా బీచ్ రోడ్డులో కిక్కిరిసిన జన సందోహం -
వడదెబ్బతో మన శరీరంలో ప్రభావమెంత?
-
ఢిల్లీలో తీవ్ర ఉక్కబోత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతోంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్‌కుపైగా నమోదవుతుండటంతో జనం ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో తీవ్రమైన వడగాలుల కారణంగా ఢిల్లీలో వేడి భయంకరంగా ఎక్కువైంది. బుధవారం ఢిల్లీలో 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, అవి ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రత కారణంగా ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. జూన్ ఒకటో తేదీన 4,390 మెగావాట్లుగా నమోదైన విద్యుత్ డిమాండ్ బుధవారానికి 7,190 మెగావాట్లకు ఎగసింది. -
దీన్ని ఎవరు విచారిస్తారు?: మహారాష్ట్ర విషాదంపై ఉద్ధవ్ థాక్రే ఫైర్
మహారాష్ట్ర భూషణ్ పురస్కార ప్రధానోత్సవంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 11 మంది వడదెబ్బ కారణంగా మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ ఘటనపై ఎవరూ సమగ్రంగా దర్యాప్తు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫైర్ అయ్యారు. ముంబై ఖార్గర్లో జరిగిన అవార్డు వేడుకను సరిగా ప్లాన్ చేయలేదని విమర్శించారు. ఈ మేరకు ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రే, ఎన్సీపీ నాయకుడు అజిత పవార్ ఎంజీఎం కమోతేతో కలిసి ఆ కార్యక్రమంలో వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరణించిన కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులను భరిస్తుందని సీఎం షిండే ట్వీట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు) -
బాబోయ్.. ఎండలు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త! ఇవి మాత్రం వద్దు!
సాక్షి, ఖమ్మం: ఎండలు తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు వెళ్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక వచ్చే మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న వేడి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నాపెద్ద అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. లక్షణాలు ఇవీ.. కళ్లు తిరగడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, శరీర కండరాలు పట్టుకోవడం, కాళ్లు వాపులు రావడం, తీవ్ర జ్వరం వంటివి కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరం సూర్యరశ్మి వలన త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రాథమిక చికిత్స.. ►వడదెబ్బ తగిలిన వ్యక్తి వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. ►వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►చల్లని గాలి తగిలేలా చూడాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి బొండాం నీరు, చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. జాగ్రత్తలు.. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపి వంటివి ధరించాలి. ►ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►హారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ►వదులైన నూలు దుస్తులు ధరించాలి. ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►మాంసామారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా భోజనంలో తీసుకోవాలి. ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీర, తాటి ముంజలు, బీర పొట్టు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి డైట్ కంట్రోల్ అవుతుంది. ►వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. సరైన డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. చేయకూడని పనులు.. ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లగా ఉండే రంగు పానీయాలు తాగొద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకూడదు. ఇంట్లో వండుకున్నవే తినాలి. ►శీతల పానీయాలు అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు తీసుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. -
బాక్సర్ అనుమానాస్పద మరణం
ప్రొఫెషనల్ బాక్సర్ కావాలని కలలుకన్న ఓ యువ బాక్సర్ ఆసక్మిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. స్కాటిష్ బాక్సర్ జోర్డాన్ కో (20) తన కలల సాకారంలో భాగంగా థాయిలాండ్ వెళ్లాడు. అక్కడ బరువుతగ్గడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం భారీ ట్రాక్ సూట్ లో శవమై తేలాడు. తన తదుపరి పోరాటం కోసం ఒక నిర్దిష్ట వెయిట్‌ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్యంగా థాయిలాండ్ లో మరణించడం కలకలం రేపింది. అయితే వడదెబ్బతో చనిపోయాడని అధికారులు ప్రాథమికంగా అంచానా వేశారు. జోర్డాన్ కో శనివారం రాత్రి మాంగ్ జిల్లా లో ఒక కంబోడియన్ బాక్సర్ తో తరపడాల్సి ఉంది. ఈ పోటీ తరువాత అతను గ్లాస్గో థాయ్ బాక్సింగ్ అకాడమీ పోటీల్లో పాల్గొనేందుకు స్కాట్లాండ్ కు తిరిగి వస్తాడని అందరూ భావించారు. కానీ కోచ్ క్రైగ్ ఫ్లోన్ గ్లాస్గో ఆదివారం ఉదయం జోర్డాన్ మరణించాడనే సమాచారాన్ని అందించాడు. వడదెబ్బతో అతని చనిపోయినట్టుగా అధికారులు భావిస్తున్నారని తెలిపాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు నిధుల సేకరణకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మూడున్నర సంవత్సరాలు తనతో కలిసి పనిచేశాడని, తాజాగా జోర్డాన్ ఒక ప్రొఫెషనల్ కావాలనే కోరికతో థాయ్‌లాండ్‌కు వచ్చినట్టు చెప్పారు. ఇంతలోనే అతను కన్నుమూయడం విచారకరమన్నాడు.మరోవైపు జోర్డాన్ మరణం పట్ల థాయ్‌లాండ్ విదేశాంగ శాఖ ప్రతినిధి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. -
భానుడి ప్రతాపం
నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. మార్చి నెల రెండో వారం నుంచే మాడు పగులుతోంది. మూడు రోజుల నుంచి వరుసగా 34, 35, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలు దాటితే ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పాఠశాలలు, పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఎండ వేడిమి తట్టుకోలేక పోతున్నారు. చాలా చోట్ల పరీక్ష సెంటర్లలో కనీస వసతులు లేక పోవడం మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. జిల్లాలో చాలా చోట్ల ఉపాధి కూలీలు, రోడ్డు పక్కన ఉంటున్న చిరు వ్యాపారులకు ఎండ తీవ్రత చాలా ఇబ్బందికరంగా మారింది. రానున్న రోజులలో ఎండ తీవ్రత మరింతగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో శనివారం పలువురికి వడ దెబ్బ కూడా తగిలింది. భానుడి ప్రతాపం నుంచి తట్టుకోవాలంటే ఎక్కువగా మంచినీరు, చలువ పదార్థాలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వడదెబ్బకు బాలుడి మృతి
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంలో తొమ్మిదేళ్ల బాలుడు వడదెబ్బతో మృతి చెందాడు. భూక్యా అరవింద్‌కుమార్ వడదెబ్బ కారణంగా రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు అశ్వారావుపేటలో వైద్యుడికి చూపించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతడ్ని చికిత్స కోసం శుక్రవారం ఉదయం విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో నూజివీడు వద్ద ప్రాణాలు విడిచాడు. -
వడదెబ్బకు వ్యక్తి మృతి
పసువులు మేపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం పెద్దాపూర్ గ్రామంలో జరిగింది. బండ్ల ఇదమయ్య(62) పశువులను మేపేందుకు వెళ్లి మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. -
నిప్పుల కొలిమిలో తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపం ధాటికి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి పలువురు అపస్మారకస్థితికి జారుకుని మృతి చెందుతున్నారు. కొద్ది రోజులుగా ఉపాధి హామీ కూలీలు మృత్యువాత పడుతున్నారు. తలమడుగు(ఆదిలాబాద్) తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలు ఎండ తీవ్రతకు తాళలేక ప్రాణాలొదిలారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సీతారాం(45), దేవరావ్(50) తోటి వారితో కలిసి పొలాల్లో ఉపాధి హామీ పనులు చేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమికి తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ధర్మవరం(అనంతపురం) ఆంధ్ర ప్రదేశ్ లోసైతం ఎండ వేడిమికి తాళలేక ఓ ఉపాధి హామీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కునుటూరు గ్రామానికి చెందిన వెంకటేశ్(65) మంగళవారం ఉపాధి పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన అతడు నీరు తాగిన కొద్దిసేపటికే చనిపోయాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. -
వడదెబ్బకు 8 మంది మృతి
సాక్షి నెట్వర్క్: వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం వడదెబ్బకు ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ భర్త మాదిరెడ్డి భూపాల్(47) ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. భోజన విరామ సమయంలో చెట్ల కింద సేదదీరారు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పనులు మొదలు పెట్టగా ఒక్కసారిగా అతను స్పృహతప్పి కిందపడిపోయాడు. తోటి కూలీలు వెంటనే చికిత్స నిమిత్తం ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నల్లగొండకు తరలించేందుకు 108ను పిలిపించగా అప్పటికే మృతి చెందాడు. ఇదే జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన చేగోజు కృష్ణయ్య(66) , బక్కమ్మ(60) దంపతులు తమ కుమారుడితో కలసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లారు. ఎండలో పనిచేయడంతో దంపతులిద్దరూ వడదెబ్బకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే బక్కమ్మ మృతిచెందింది. కృష్ణయ్యను స్థానిక ఆస్పత్రిలో చికిత్సచేయించినా ఫలితంలేకపోవడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. కొడుకు భీష్మాచారి కూడా అస్వస్థతకు గురికాగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మకూరు (ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన సుంచు అచ్చమ్మ(70) ఆదివారం అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆత్మకూరు(ఎం)లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. సోమవారం ఉదయం మృతి చెందింది. గుండాల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సంపతి యాదిరెడ్డి (65) ఉదయం బావి వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి వడదెబ్బకు గురై మృతిచెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం కొమ్మూరుకు చెందిన గూని వెంకటమ్మ (80) సోమవారం ఉదయం కూతురి దగ్గరికి వెళ్దామని మద్దూరుకు బస్సులో వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడంతో బస్టాండులోనే అపస్మారకస్థితిలోకి చేరుకుని మృతి చెందింది. ఇదే జిల్లా గట్టుకు చెందిన వడ్డే పెద్ద ఈరన్న అలియాస్ రామారావు(36) భార్య ఊసేనమ్మ పుట్టిల్లు అయిన తుమ్మలచెరువుకు వెళ్లాడు. మార్గంమధ్యలో ఆలూరు పునరావాస కేంద్రం దగ్గర దిగాడు. ఎండ తీవ్రత బాగా ఉండడంతో అక్కడే వడదెబ్బకు గురై మృతి చెందాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేటకు చెందిన కిషన్ (50) ఉపాధి పని చేస్తూ ఎండదెబ్బకు తాళలేక సొమ్మసిల్లిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు.


