రాష్ట్రంపై వడగాడ్పుల పడగ | 25 die of heatstroke in Andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంపై వడగాడ్పుల పడగ

May 26 2026 5:40 AM | Updated on May 26 2026 6:04 AM

25 die of heatstroke in Andhra pradesh

ఒక్క రోజులోనే 25 మంది మృత్యువాత

కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు  

115 మండలాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు 

చాలాచోట్ల సాధారణం కంటే 6 డిగ్రీలు అధికంగా నమోదు

ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 14 మంది మృతి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రచండ భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడగాడ్పుల ప్రభావా­నికి సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ప్రాణాలు విడిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 14 మంది ప్రాణాలు కోల్పోగా, ఉమ్మడి తూర్పుగో­దా­వరి జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, విశాఖ, తిరుపతి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.

కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 10 మండలాల్లో వడగాడ్పుల తీవ్రత అత్యంత తీవ్రంగా, 125 మండలాల్లో తీవ్రంగా ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, కృష్ణా, బాపట్ల, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూ­రు మండలాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేకచోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణో­గ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

నేడు ఎండ తీవ్రంగా ఉండే జిల్లాలు
మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూ­రు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మరోవైపు  ద్రోణి 
ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement