మృతుల్లో నాలుగేళ్ల బాలుడు, ఆర్టీసీ కండక్టర్
ధాన్యం కొనుగోలు కేంద్రంలో కుప్పకూలి ప్రాణాలు విడిచిన రైతు
సాక్షి నెట్‌వర్క్: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బకు గురయ్యే వారి సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో 49 మంది చనిపోయారు. వరంగల్ జిల్లా బుధరావుపేటలో గుండ్రపల్లి సదయ్య (58), ధర్మారంలో అంకేశ్వరపు సమ్మక్క (70), దమ్మన్నపేటలో అనసూర్య (68), ఖిలా వరంగల్ పడమరకోటలో బొల్లం వీరమల్లు (68), మొండ్రాయిలో తండ చేరాలు (75), పుల్లయబోడులో భూక్య నరేశ్ (29), సర్వాపురానికి చెందిన మండల వీరయ్మ (74) వడదెబ్బతో మృతిచెందారు.
⇒ పరకాల డిపోనకు చెందిన కండక్టర్ బి.శంకర్ (48) విధుల్లో భాగంగా భద్రాచలం నుంచి పరకాల బయలుదేరి కొత్తగూడెం దాటిన తర్వాత అనిశెట్టిపల్లి వద్ద వేడిగాలితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆర్టీసీ డ్రైవర్, ప్రయాణికులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణం కోల్పోయాడు.
⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నగరంపల్లిలో గొర్రెలకాపరి కోడారి సాంబయ్య(52), అంకుషాపూర్‌లో వ్యవసాయ కూలీ మహమ్మద్ సైద్‌ఖాన్ (42), జనగామ జిల్లా రంగరాయగూడెంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అదే గ్రామానికి చెందిన రైతు నెలమంచ ఎలేందర్‌రెడ్డి (39) ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై చనిపోయాడు. శివునిపల్లికి చెందిన పిట్టల శంకర్–రవళి దంపతుల కుమారుడు అక్షిత్ (4) ఎండ తీవ్రతతో మృతి చెందాడు.
ఘన్‌పూర్‌లో తాటికొండ నర్సమ్మ(65), కామారపు విజయ్ (60), వరంగల్ జిల్లా ఇటుకాలపల్లిలో కూలీ నైనబోయిన రాజు(44) హనుమకొండ జిల్లా నీరుకుళ్లలో మేస్త్రీ వద్ద పనిచేసే కూలీ వడదెబ్బతో చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెయింటర్ కొమిరె రమేశ్ (39), బైపాస్‌రోడ్డులో ఉండే యాచకుడు షేక్ లతీఫ్ (50), ములుగుకు చెందిన బీజేపీ నేత అన్నపురెడ్డి ప్రమోద్‌రెడ్డి (49), కమలాపురంలో అన్నపు రెడ్డి లక్ష్మీబాయి (80), తిరువాయిపేట వెంకటరమణ (48), తాడి సత్యవతి (80) వడదెబ్బతో చనిపోయారు.
⇒ నిజామాబాద్ జిల్లా అంజుమాన్ ఫారమ్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పడారి గంగన్న (40), బౌరంపేటలో రైతు రమేశ్ (42), ఉమ్మడి కరీంనగర్ జిల్లా..జగిత్యాలలో గొల్లపల్లి శివప్రసాద్‌గౌడ్ (50), రామడుగులో లక్ష్మీరాజం (48), గోపాల్‌రావుపేటలో షేర్ల నరేశ్ (30), ఘన్ముక్కులలో బొంగోని రాజవీరు (65), జమ్మికుంటలో దాసారపు కాంతమ్మ (59), సుల్తానాబాద్‌లో తోడేటి లక్ష్మి (44), వెన్నంపల్లిలో ఉపాధి కూలీ గోసు్కల గట్టయ్య (52), రామగుండంలో కుమార్ (40), యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరులో సుంకరి భాగ్యమ్మ (79), పెద్దగూడెంలో కౌలు రైతు కాకారం ధర్మారెడ్డి (70), తోపుచర్లలో వేముల సైదమ్మ (42), మంచిర్యాల జిల్లా జన్నారంలో యాట ఇందయ్య (60), మైలారంలో బర్ల బుచ్చయ్య (71), చెన్నూర్‌లో తోగటి అశోక్ (46), సీసీసీ రిటైర్‌మెంట్ కాలనీలో ఆటో డ్రైవర్ రెడ్డిమల్ల లక్ష్మణ్ (49), నర్సింగపూర్‌లో సిడం వెంకటేశ్(33), ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో బోనగిరి లస్మన్న(70), సిద్దిపేట జిల్లా తెల్లపలుగు తండాకు చెందిన బానోతు సంగ్లనాయక్ (65) వడదెబ్బతో చనిపోయారు.
⇒ భద్రాద్రి జిల్లాలోని చలమప్పగూడెంలో వ్యవసాయ పనులకు వెళ్లిన బండారు నాగమణి (40), అశ్వారావుపేటలో బోగి మంగ (62), జగన్నాథపురంలో ముత్తిని నర్సింహారావు (70), టేకులచెరువులో దాసరి దుర్గమ్మ (56), ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉస్మాన్ (54), నారపునేనిపల్లిలో మంచికంటి విజయ(80), దారేడులో కూలీ షేక్ ఇమామ్ (45) వడదెబ్బతో మృతి చెందారు.
మూడు రోజుల తర్వాత..
భార్య కూతురి ఇంటికి వెళ్లడంతో తల్లాడలో మిర్చి కమీషన్ వ్యాపారి బండారు మోహన్‌రావు (65) ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం నిద్రించాడు. ఎండల తీవ్రతతో వడదెబ్బ బారిన పడగా తాగునీరు ఇచ్చేవారు కూడా లేక రెండు రోజుల క్రితమే మృతి చెందాడు. ఇరుగు పొరుగు వారికి వాసన వస్తుండటంతో తలుపులు పగులగొట్టే సరికి కుళ్లిన స్థితిలో మృతదేహం బయటపడింది.


