Telangana: వడదెబ్బతో 30 మంది మృతి | Scooter Catches Fire Due To Heat Waves In Bhadradri Kothagudem Distric | Sakshi
Sakshi News home page

Telangana: వడదెబ్బతో 30 మంది మృతి

May 23 2026 3:47 AM | Updated on May 23 2026 5:52 AM

Scooter Catches Fire Due To Heat Waves In Bhadradri Kothagudem Distric

వినోభానగర్‌లో దగ్ధమవుతున్న స్కూటీ

మృతుల్లో వేసవి సెలవులకు నానమ్మ ఇంటికి వచ్చిన చిన్నారి..  

భద్రాద్రి జిల్లాలో ఎండల తీవ్రతకు కాలిపోయిన స్కూటీ  

సాక్షి, నెట్‌వర్క్‌: వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 30 మంది మృతి చెందారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన గిరిజనుడు కిరణ్‌కుమార్‌ (27), తలమడుగు మండలం కుచులాపూర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ ఆత్రం రాము (44), నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని బొడ్రాయి వీధికి చెందిన గంగాధర శాంతమ్మ (86), నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన కుకుట్ల కృష్ణయ్య (46), సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండలంలోని ముక్కుడుదేవులపల్లికి చెందిన దాసరి బిక్షం (60) మృతి చెందారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లింగగూడేనికి చెందిన జనగం రాంబాబు (43), ఖమ్మంలో గుర్తుతెలియని యాచకుడు (65), కొణిజర్లకు చెందిన ఉపాధి కూలీ పాముల శ్రీను (53), భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ఆజాద్‌నగర్‌కు చెందిన పురోహితుడు ముక్కవరపు వెంకటేశ్వర్లు (65), ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన శానిటరీ పనులతో జీవనం సాగించే యార్లగడ్డ గోవర్దన్‌రావు(70), చర్ల మండలం ఆర్‌.కొత్తగూడెం జీపీ పరిధి దానవాయిపేటకు చెందిన దాగం సీతమ్మ(60), ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్‌ షేక్‌ సలీం(42), చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన చింతచిగురు అమ్ముకునే పుట్టపర్తి భద్రమ్మ(60), ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన పూల దుకాణంలో పనిచేసే నాగయ్య(55), పరిగిముక్కల కాలనీకి చెందిన అచ్యుత్‌రావు(70) వడదెబ్బతో మృతి చెందారు. మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన కోట నిరంజన్‌(60) బంధువుల అంత్యక్రియలకు వెళ్లివచ్చాక వడదెబ్బతో అస్వస్థతకు గురై కన్నుమూశాడు. 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన గైని కవిత–సంజీవ్‌ దంపతులు కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. వీరి కూతురు కూతురు కీర్తిక (8) వేసవి సెలవుల్లో నానమ్మతో గడిపేందుకు సొంతూరికి వచ్చింది. నాలుగు రోజులుగా తోటి పిల్లలతో కలిసి ఆరు బయట ఆడుకుంటోంది. నీరసం, జ్వరం రాగా, ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.  

⇒  మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కొట్టెం భద్రమ్మ (68), డోర్నకల్‌ మండలంలోని తహసీల్దార్‌ బంజర గ్రామానికి చెందిన నన్నెబోయిన సత్యం(75), వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌ పడమర కోట ప్రాంతానికి చెందిన బండి హరిశంకర్‌ (58), రంగశాయిపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ విండ్ల సంతోష్‌కుమార్‌ (49), పర్వతగిరికి చెందిన చిర్రబోయిన అరుణ (45), నల్లబెల్లి మండలం ఆసరవెల్లికి చెందిన గుగులోతు నరసింహ (55), జనగామ జిల్లా కొడకండ్ల మండలం గుమ్ములబండ తండాకు చెందిన గుగులోత్‌ రామ్‌సింగ్‌ (75) వడదెబ్బతో మృతిచెందారు.  

⇒  కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పోరండ్లకు చెందిన ఆరెల్లి పరశురాములు (62), జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లికి చెందిన కర్నె లచ్చయ్య (85), పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన కల్వకోట రామస్వామి (70), గోదావరి ఖనికి చెందిన అబ్బాస్‌ఖాన్‌(53) వీణవంక మండలం ఇప్పలపల్లికి చెందిన వేల్పుల ఐలయ్య (62), జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్‌కోత్తూర్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మేస్త్రీ అండ్ర శ్రీనివాస్‌ (40) వడదెబ్బతో చనిపోయాడు.  

⇒  మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్న మెట్‌పల్లి గ్రామానికి చెందిన వీఓఏ దుగుట సంతోశ్‌ శుక్రవారం వడదెబ్బతో సొమ్మ
సిల్లి పడిపోయాడు.  

రహదారిపై స్కూటీ దగ్ధం 
జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌ సమీపాన సీతారామ కెనాల్‌ బ్రిడ్జి ఎండ తీవ్రతతో ఓ స్కూటీ కాలిపోయింది. పాల్వంచకు చెందిన దంపతులు స్కూటీపై శుక్రవారం ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా వినోభానగర్‌ సమీపాన స్కూటీలో మంటలు మొదలయ్యాయి. దీంతో ప్రమాదాన్ని గుర్తించిన దంపతులు స్కూటీని వదిలేసి పక్కకు వెళ్లిన క్షణాల్లోనే మంటలు ఉధృత రూపం దాల్చి వాహనం కాలిబూడిదైంది. 

మరో రెండ్రోజులు అధిక ఉష్ణోగ్రతలే 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాడ్పుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండ్రోజులపాటు రాష్ట్రంలో ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర అధికంగా నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఖమ్మంలో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement