ఏసీలోనే యమ డేంజర్! | Health risks associated with air conditioning in Telangana | Sakshi
Sakshi News home page

ఏసీలోనే యమ డేంజర్!

May 1 2026 6:11 AM | Updated on May 1 2026 6:11 AM

Health risks associated with air conditioning in Telangana

హెచ్చరిక సంకేతాలు ఏసీ మందగింపజేస్తుందంటున్న వైద్యులు 

తేలికపాటి తలనొప్పి, అలసట వంటి లక్షణాలను తేలిగ్గా తీసుకునే చాన్స్‌ 

టీ, కాఫీలతోనూ శరీరానికి కావాల్సిన నీరు అందకుండా పోతున్న వైనం

మనకేం చల్లగా ఏసీలో కూర్చుంటున్నాం. మనకెందుకు వడదెబ్బ తగులుతుంది? మనమెందుకు డీహైడ్రేషన్‌కు గురవుతాము.. అంటూ ధీమాగా కూర్చునే పరిస్థితి ఉందా? అంటే.. లేదనే అంటున్నారు వైద్యులు. ఇంకా చెప్పాలంటే ఎండలో తిరిగే వాళ్లకంటే శీతల గదుల్లో ఉండేవాళ్లే ఎక్కువ డేంజర్‌లో ఉన్నారని కూడా హెచ్చరిస్తున్నారు.

సాక్షి, హైదరాబాద్‌
ఆఫీసుల్లో చల్లగా, సౌకర్యవంతంగా కూర్చుంటున్న వ్యక్తే డీహైడ్రేషన్‌ బాధితుడిగా మారుతున్నాడు. ఈ తరహా రోగుల సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని, బంజారా హిల్స్‌లోని కేర్‌ హాస్పిటల్స్‌లో నెఫ్రాలజీ విభాగపు క్లినికల్‌ డైరెక్టర్, సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ పి.విక్రాంత్‌రెడ్డి అంటున్నారు. డీహైడ్రేషన్‌ (శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌తో పాటు ముఖ్యంగా నీటి శాతం తగ్గిపోవడం) పరిస్థితిలో శరీరానికి బలమైన హెచ్చరిక సంకేతం దాహం. వేడి, చెమట, వేసవి వల్ల బయట వాతావరణంలో కలిగే అసౌకర్యం దీనికి దారితీస్తుంది.

అయితే వడదెబ్బకు గురైనా.. ఏసీ వాతావరణంసౌకర్యవంతంగా ఉండి చెమట పట్టక, చర్మం ఎర్రబడక, గొంతు ఎండిపోనప్పుడు శరీరం పంపాల్సిన హెచ్చరిక సంకేతాలు మందగిస్తాయి. దాంతో శరీరంలో ద్రవాలు కోల్పోతూనే ఉన్నా అది కంటికి కనిపించదు. ‘చల్లని గాలి సౌకర్యవంతంగా అనిపిస్తుంది, కానీ అది శరీరాన్ని బాగా పొడిబారేలా కూడా చేస్తుంది. మరోవైపు చర్మం శ్వాస ద్వారా ద్రవాలు తగ్గుతూనే ఉంటాయి. కాకపోతే చెమట కనిపించక పోవడంతో నీరు తాగడం అవసరమని అనిపించదు. దాంతో నీటి లోటు నెమ్మదిగా పెరుగుతూ పోతుందని వైద్యులు వివరిస్తున్నారు.  

కెఫిన్‌..మరో ముప్పు 
ఏ కార్యాలయంలోనైనా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య టీ రౌండ్లు, నిరి్వరామంగా పనిచేసే కాఫీ, టీ వెండింగ్‌ మెషీన్లు కనిపిస్తాయి. ‘అలసటను, నీరసాన్ని దూరం చేస్తున్నట్టు అనిపింపజేసే టీ, కాఫీ శరీరానికి కొంత ద్రవాన్ని అందిస్తాయి, కానీ ఒక వ్యక్తి అనేక కప్పుల కెఫిన్‌ తాగినా శరీరానికి అవసరమైన నీరు అందదు..’అని వైద్యులు వివరిస్తున్నారు. కప్పుల కొద్దీ చాయ్, భోజనం తర్వాత ఒక కాఫీ, లేదా ఒక శీతల పానీయం ఇలా ఏదో ఒకటి తాగుతూ ఉండడం వల్ల ఆ రోజుకు తగినంత నీరు తాగలేదనే విషయం చాలా మంది మదిలో నమోదు కాదని అంటున్నారు.      

సాధారణ మార్పులతో నిర్లక్ష్యం
ఈ పరిణామాల నేపధ్యంలో ఏసీలో ఉండే ఉద్యోగులలో డీహైడ్రేషన్‌ చాలా సాధారణమైన మార్పుల రూపంలో బయటపడుతుంది. మధ్యాహ్నం పూట తేలికపాటి తలనొప్పి, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఏకాగ్రత తగ్గడం, శరీర మార్పుల వల్ల కాకుండా పనిభారం వల్ల వచి్చనట్లు అనిపించే అలసట వస్తాయి. దీనికి పనిభారం, స్క్రీన్‌ టైమ్, లేదా నిద్రలేమి కారణాలని భావిస్తారు. కానీ నీరు తాగకపోవడం కారణంగా గుర్తించరు. పెదవులు ఎండిపోవడం లేదా తలలో కొద్దిగా బరువుగా అనిపించడం వంటి వాటిని కూడా పట్టించుకోకుండా, రోజువారీ పని ఒత్తిడి వల్ల అనుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.

కూర్చునే ఉండొద్దు.. 
గంటల కొద్దీ కూర్చుని ఉండకుండా.. లేచి ఎక్కడికైనా నడిచి, చుట్టూ పరిసరాలను గమనించినప్పుడు.. నోరు ఎండిపోయిందని, చాలా సేపటి నుంచి నీళ్లు తాగలేదని గుర్తించే అవకాశం పెరుగుతుంది. కేవలం స్క్రీన్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించి ఎక్కువ సేపు కూర్చుంటే ఇది సాధ్యం కాదు. ‘ఎక్కువ సేపు ఒకే చోట ఉండటం వల్ల శరీరం అందించే సంకేతాలను గమనించే అవకాశాలు, నీళ్లు తాగడానికి అవకాశాలు కూడా తగ్గుతాయి. కాలక్రమేణా ఇది ఒక అలవాటుగా మారి డెస్‌్కపై ఉన్న నీళ్ల సీసా ఖాళీ అవ్వదు. ఇలాంటి పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని, ఏసీలో ఉన్నామనే భరోసాతో ఉండకుండా..తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement