పసిడి పరుగు, కానీ వారి జీవితాలు ఛిద్రం | Surge in gold prices gold smiths lifes and work impacts | Sakshi
Sakshi News home page

పసిడి పరుగు, కానీ వారి జీవితాలు ఛిద్రం

May 20 2026 12:32 PM | Updated on May 20 2026 2:18 PM

Surge in gold prices gold smiths lifes and work impacts

పనులు కనుమరుగు

స్వర్ణకారుల జీవితాలు ఛిద్రం

బంగారం ధరలు పెరగడంతో గిరాకీలు లేక స్వర్ణకారుల ఉపాధి దెబ్బతిన్నది. ఆర్థికంగా ఉన్నవారు జ్యువెల్లరీ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. స్వర్ణకారుల దగ్గర ఆభరణాలు చేయించుకునేది సామాన్య ప్రజలు మాత్రమే. అయితే బంగారం ధర పెరగడంతో వారికి అందని ద్రాక్షగా మారింది. దీంతో పని లేక స్వర్ణకారులు కుటుంబ పోషణకు వాచ్‌మెన్‌లు, సేల్స్‌బాయ్‌గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపక పోవడంతో దీనావస్థలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.  

మెదక్‌ కలెక్టరేట్‌: ఒకప్పుడు మెదక్‌ గోల్డ్‌ బజార్‌ నిత్యం వినియోగదారులతో కిటకిటలాడేది. హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల ప్రజలు ఇక్కడే బంగారం కొనుగోలు చేయడంతోపాటు పలు రకాల నగలు చేయించుకునేవారు. వందలాది స్వర్ణకారులు కులవృత్తితో తమ కుటుంబాలను పెంచి పోషించుకునేవారు. కాగా పెరిగిన పసిడి ధరలతో ప్రస్తుతం వినియోగదారులు లేక వెలవెలబోతుంది. 

పనులు కరువు.. 
బంగారం ధరలు పెరగడంతో గిరాకీల్లేక స్వర్ణకారులు దుకాణాలను మూసివేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 వరకు దుకాణాలు మూతపడినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రత్యామ్నాయం కల్పించకపోవడంతో దర్జాగా బతికిన స్వర్ణకారులు పలు చోట్ల జీతాలకు పనిచేస్తున్నారు. గత్యంతరం లేక కుటుంబ పోషణకు వాచ్‌మెన్‌లు, సేల్స్‌బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నారు. 

ఆరు నెలల క్రితం నరేశ్‌చారి అనే స్వర్ణకారుడు పనులు దొరక్క కుటుంబ పోషణకు చేసిన అప్పులు భారమై ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డున పడిన అతని కుటుంబాన్ని తోటి స్వర్ణకారులు ఆదుకున్నారు. అంతేకాని ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజు కూలీ కూడా రావట్లేదు..  
రోజంతా కూర్చుంటే కనీసం వంద రూపాయలు రావడం లేదు. నెల వచ్చేసరికి దుకాణ కిరాయిలు మీద పడుతున్నాయి. మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. దీంతో అప్పులు పెరిగాయి. ఫలితంగా దుకాణం మూసివేయాల్సి వచ్చింది. గతంలో ఎంతో దర్జాగా బతికిన తాను గత్యంతరం లేక కుటుంబ పోషణకు ఓ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాను.   –శ్రీనివాసచారి, మెదక్, స్వర్ణకారుడు  

350 దుకాణాలు.. 
మెదక్‌ గోల్డ్‌ బజార్‌లో మొత్తం 350 దుకాణాలు ఉన్నాయి. 50 జ్యూవెల్లరీ షాపులు, 300 స్వర్ణకారుల దుకాణాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి సుమారు వెయ్యి కుటుంబాలు జీవిస్తున్నాయి. నిత్యం పెరుగుతూ నిలకడలేని బంగారం ధరలతో స్వర్ణకారులకు గిరాకీలు తగ్గిపోయాయి. సామాన్య ప్రజలు అందుకోలేని స్థాయికి పసిడి ధరలు వెళ్లిపోయాయి. స్వర్ణకారుల దగ్గర నగ, నట్రా చేయించుకునేది సామాన్య ప్రజలే. అయితే ఎక్కువ డబ్బులున్న వారు జ్యువెల్లరీ షాపులకే వెళ్తుండగా, సామాన్యులు చిన్న చిన్న ఆభరణాలు చేయించుకునేందుకు స్వర్ణకారుల వద్దకు వచ్చేవారు. దీంతో వారికి ఉపాధి లభించేది.  ప్రస్తుతం పని లేక ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement