తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు | Sri Rama Navami Celebrations Andhra Pradesh And Telangana | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Mar 27 2026 11:03 AM | Updated on Mar 27 2026 2:53 PM

Sri Rama Navami Celebrations Andhra Pradesh And Telangana

సాక్షి, భద్రాచలం: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. భద్రాద్రిలో రాములోరి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. కళ్యాణం కనులారా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల తర్వాత శంకు ,చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన రామయ్య ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోనికి కళ్యాణ మండపానికి తీసుకొచ్చిన అర్చకులు.. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం నిర్వహించారు.

అనంతరం కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపచేశారు. భక్త రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చల హారం రామయ్యకు అలంకరణ, లక్ష్మణుడికి రామమాడ ధరింప చేశారు. చైత్ర శుద్ధ నవమి అభిజిత్ లగ్న ముహూర్తం రాగానే సీతారాముల కల్యాణం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

పులివెందులలో..
వైఎస్సార్ జిల్లా: పులివెందులలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని భాకరాపురం, నగరిగుట్ట, వేల్పుల గ్రామంలోని రామాలయాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భద్రాద్రిలో కన్నుల పండువగా... సీతమ్మ తల్లి మాంగళ్య ధారణ

గొల్లల మామిడాడలో
కాకినాడ జిల్లా: పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలోని ప్రసిద్ధి గాంచిన కోదండ రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాములోరి కళ్యాణం జరిగింది. ఉదయం 10 గంటలకు కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. సుదూర ప్రాంతాల నుండి కళ్యాణం చూడడానికి ముందురోజే భక్తులు తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement