చిన్నసైజు తుంపర్లతోనూ కరోనా

Spread of corona virus by singing and shouting - Sakshi

వర్జీనియా టెక్‌ వర్సిటీ పరిశీలనలో వెల్లడి 

పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా వ్యాప్తి 

భౌతిక దూరం ఆరడుగులకంటే ఎక్కువ ఉండాలి 

సాక్షి, హైదరాబాద్‌: గాలి లేదా బయటి వాతావరణంలో ఉండిపోయే చిన్న తుంపర్లతోనూ కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశాలున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్‌ పొగ మాదిరిగా వ్యాప్తి చెందే సూక్ష్మస్థాయిలో ఉండే తుంపర్లు ఒకసారి వెలువడ్డాక ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం,మాట్లాడడం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో తుంపర్లు వెలువడుతున్నాయి. ఈ తుంప ర్లు ఏ సైజులో ఉంటే ఎలా ప్రభావితం చేస్తాయి? ఎంత దూరం, ఎలా పయనిస్తుంది తదితర అంశాలపై పరిశోధకులు దృష్టి కేంద్రీకరించారు.

పెద్దసైజు తుంపర్లు ముక్కు,నోరు,కళ్లపై పడినపుడు లేదా గాలిరూపంలో పీల్చుకున్నపుడు ఇతరులకు ఇన్ఫెక్షన్‌ సోకుతుందని గతంలోనే పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇప్పుడు చిన్న సైజు తుంపర్లు, సిగిరెట్‌పొగ మాదిరిగా వ్యాప్తిచెందే తుంపర్లు కొన్ని గంటల వరకు గాలిలోనే ఉండిపోతాయని చెబుతున్నారు. ఇవి గదంతా వ్యాపించడంతో పాటు గాలి, వెలుతురు తక్కువ ఉన్నచోట్ల మరింత అధికమవుతా యంటున్నారు. ‘మీసిల్స్‌’ మాదిరిగా ఇవి వ్యాపిస్తాయని, ‘ఏరోసొల్స్‌’గా పిలుస్తున్న ఈ చిన్నసైజు తుంపర్లు ఆరు అడుగులకు మించి వ్యాపించే అవకాశాలు న్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల వ్యక్తుల మధ్య భౌతిక దూరం 6 అడుగుల కంటే ఎక్కువగా ఉంటే మంచిదని వర్జీనియా టెక్‌ వర్సిటీ పరిశోధకులు లిన్సేమార్‌ తెలిపారు. ఏరోసొల్స్‌ పార్టికల్స్‌ సమీపంలో ఉన్నవారిపై అధిక ప్రభావం చూపుతాయని, అతిదగ్గరగా ఉన్న వారిపై ఎక్కువ ప్రమాదం కలగజేసే అవకాశముంది అని హెచ్చరిస్తున్నారు.  

సీడీసీ పరిశీలన 
దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే పెద్ద సైజు తుంపర్లతోనే వైరస్‌ సోకుతోందని యూఎస్‌లోని సెంటర్స్‌ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డా.జె బట్లర్‌ పేర్కొన్నారు. అయితే ఎక్కువగా ఏరోసొల్స్‌ కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నట్టుగా లిన్సేమార్‌ చెబుతున్నారు. వైరస్‌ ఉన్న ఒక్క ‘సూపర్‌ స్ప్రెడర్‌’నుంచి ఒకేఒక్కసారి కలుసుకున్నపుడే లెక్కకు మించిన సంఖ్యలో ఇతరులకు వ్యాప్తి చెందినట్టు లిన్సేతో పాటు ఇతర పరిశోధకులు కూడా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం సామూహిక ప్రార్థనలకు సంబంధించిన రిహార్సల్‌ నిర్వహించినపుడు కరోనా లక్షణాలున్న వ్యక్తినుంచి 52మందికి అది సోకడమే కాకుండా వారిలో ఇద్దరు మరణించినట్టుగా పరిశోధకులు తెలి పారు. చైనాలోనూ గాలి, వెలుతురు తక్కువ ఉన్న ఓ రెస్టారెంట్‌ లో ఐదుగురికి కరోనా సోకినట్టు, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒకవ్యక్తి నుంచి వేర్వేరుచోట్ల కూర్చున్న 23 మంది ప్రయాణికులకు వైరస్‌ సోకినట్టు వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top