సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్‌ను నిర్ణయించారు. కానీ.. చాలా మంది వాహనదారులు లేన్ డ్రైవింగ్ నిబంధన పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఔటర్‌పై అతి వేగంగా వస్తున్న వాహనాలు ముందు ఆగి ఉన్న వాహనాలను అంచనా వేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యం కూడా ఔటర్‌పై రోడ్డు ప్రమాదాలలో కారణమేనని నిపుణులు చెబుతున్నారు.
శుక్రవారం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తున్న కారు పెద్దగోల్కొండ ఔటర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొని.. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే అసువులు బాశారు. లేన్ డ్రైవింగ్ పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఔటర్‌పై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
దారుణాలకు ఇవీ కారణాలే..
158 కిలోమీటర్ల ఔటర్‌పై రోజూ 15 లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ (వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది.
ఓఆర్‌ఆర్‌పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు.
కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి.
ఇలా వెళ్తే సేఫ్ జర్నీ..
ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1,2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్టంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి.
లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే ఆకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్‌పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం.
అదుపుతప్పిన అతివేగంతోనూ..
ఔటర్‌పై వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి. సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి.
ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపున సర్వీసు లేన్‌పైనే ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్‌లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. అలాగే ఓఆర్‌ఆర్ ప్రవేశం, నిష్కమణ మార్గాల్లో రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదు.


