టికెట్‌ ఎందుకు బుక్‌ చేశారు? సింహయాజీతో మీకున్న  సంబంధం  ఏంటి?

SIT Questioned Lawyer Srinivas In The Case Of Purchasing MLAs - Sakshi

ఎమ్మెల్యేలకు ఎర కేసులో న్యాయవాది శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్‌  

ఓ జాతీయ పార్టీకి చెందిన పలువురి పేర్లు వెల్లడి 

బ్యాంక్‌ లావాదేవీలపైనా ఆరా సుదీర్ఘంగా 8 గంటలపాటు సాగిన విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు­లో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తును వేగవంతం చేసింది. దర్యాప్తు పురోగతి నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిట్‌ పలువురికి 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమీప బంధువు, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌ సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరయ్యారు. సిట్‌ సభ్యులైన సైబరాబాద్‌ డీసీపీ (క్రైమ్స్‌) కళ్మేశ్వర్, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌ వేర్వేరుగా సాయంత్రం 6:30 గంటల వరకూ ఆయనను సుమారు 8 గంటలపాటు విచారించారు. శ్రీనివాస్‌ ఫోన్‌ కాల్‌డేటాతోపాటు, ఆయన బ్యాంక్‌ ఖాతా వివరాలను పరిశీలించి, వాటిపై పలు సందేహాలు లేవనెత్తినట్లు సమాచారం.

గత నెల 26న నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిలతో హరియాణాకు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌ వ్యాపారి నందుకుమార్, తిరుపతి స్వామి సింహయాజీలు రహస్య మంతనాలు జరుపుతుండగా.. పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. అదేరోజు మధ్యాహ్నానికి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ ఇండియా విమాన టికెట్‌ను బుక్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు సింహయాజీతో మీకున్న సంబంధం ఏంటని అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. సింహయాజీతో పూజలు చేయించడం కోసమే ప్రత్యేకంగా టికెట్‌ బుక్‌ చేశానని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అలాగే శ్రీనివాస్‌ ఫోన్‌లోని యూపీఐ లావాదేవీల జాబితాను ముందు పెట్టి విచారించారు. కాగా, విచారణలో శ్రీనివాస్‌ ఓ జాతీయ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు వెల్లడించినట్టు సమాచారం. దీంతో వారికీ 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. 

అరగంట ఫోన్‌లో ఏం మాట్లాడారు? 
తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ మొదటిది కానుంది. నోటీసులు జారీ చేసిన నలుగురిని విచారించేందుకు 16, 17 అంతస్తుల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యే వారి ప్రతి కదలిక, హావభావాలు, విచారణ సమయంలో సిట్‌ ప్రశ్నలు, రాబట్టే సమాధానాలు, వారి స్పందన.. ఇలా అన్ని అంశాలూ స్పష్టంగా రికార్డయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు నందుకుమార్‌ ఫోన్‌ను విశ్లేషించగా.. గత నెల 26 కంటే ముందు అరగంట సేపు సెల్‌ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఏం మాట్లాడారు? 26న టికెట్లు బుక్‌ చేయాలని ఎవరైనా కోరారా? అని లోతుగా విచారించినట్లు సమాచారం. ఇదిలాఉండగా.. శ్రీనివాస్‌ నుంచి సంతృప్తికర సమాధానాలు రాబట్టలేని అధికారులు.. మంగళవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్టు తెలిసింది.

ఇదీ చదవండి: సామాన్యుడి కోసం ధర్మపీఠం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top