మృతదేహం కోసం నిరీక్షణ: నేడు హైకోర్టలో విచారణ

Sirnapally Man Deceased In Gulf Family Petition In HC Hearing Today - Sakshi

గల్ఫ్‌లో మృతి చెందిన సిర్నాపల్లి వాసి

3 నెలలుగా మృతదేహం కోసం ఎదురుచూపులు

హైకోర్టును ఆశ్రయించిన భార్య.. నేడు విచారణ

డిచ్‌పల్లి: గల్ఫ్‌లో మరణించిన తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాలంటూ మృతుడి భార్య వేసిన పిటిషన్‌ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. తమ మూడు నెలల నిరీక్షణకు సోమవారమైనా తెరపడుతుందని ఆ కుటుంబం ఆశిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లికి చెందిన వొంటరి నర్సారెడ్డి (49) ఉపాధి కోసం 2013 అక్టోబర్‌లో గల్ఫ్‌ వెళ్లారు. ఇరాక్‌ సరిహద్దులోని సకాకా పట్టణ మున్సిపాలిటీలో కార్మికుడిగా చేరారు. గత నవంబర్‌ 1న వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు. కరోనా, లాక్‌డౌన్‌తో విమానాల రాకపోకలు లేకపోవడం, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో మృతదేహం ఇప్పటికీ స్వగ్రామానికి చేరుకోలేదు.

దీంతో మృతుడి భార్య లక్ష్మి, తల్లి సత్తెవ్వ, కొడుకు సంతోష్‌రెడ్డి, కూతురు లావణ్య.. నర్సారెడ్డి మృతదేహాన్ని రప్పించడానికి చేయని ప్రయత్నం లేదు. చివరకు మానవ హక్కుల కార్యకర్త, హైకోర్టు న్యాయవాది పి.శశికిరణ్‌ సూచనతో భారత ప్రభుత్వ విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సౌదీ అరేబియాలోని ఇండియన్‌ ఎంబసీ కార్యాలయాన్ని ప్రతివాదులుగా చేస్తూ ఈనెల 4న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. మృతుడి భార్య వొంటరి లక్ష్మి, ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల పిటిషనర్లుగా ఉన్నారు. మృతదేహాన్ని వెంటనే భారత్‌కు చేరేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఇది నేడు విచారణకు రానుంది.
.(చదవండి: అమ్మా ఇంటికొస్తున్నా.. బాధపడకు )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top