
సింగరేణిలో 38.96 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
రెండు ఏరియాల్లో మాత్రమే 100 శాతం నమోదు
మిగతా తొమ్మిది ఏరియాలు వెనుకంజ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం (2025–26)లో 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో నెలవారీ లక్ష్యాలను కేటాయించగా.. గత ఆగస్టులో సంస్థ వ్యాప్తంగా 81 శాతం ఉత్పత్తి మాత్రమే నమోదైంది. సంస్థ పరిధిలోని 11 ఏరియాల్లో 19 ఓపెన్ కాస్ట్ గనులు, 21 భూగర్భ గనుల్లో 48.13 లక్షల టన్నుల లక్ష్యానికి.. 38.96 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధించగలిగారు.
ఓసీల్లో 85, భూగర్భ గనుల్లో 53%
సింగరేణి వ్యాప్తంగా భూగర్భ గనుల్లో గడిచిన ఆగస్టులో 6,20,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో 3.27,033 టన్నులు (53 శాతం) సాధించారు. ఇక ఓపెన్ కాస్ట్ గనుల్లో 41,92,885 టన్నులకు 35,69,656 టన్నుల (85శాతం) ఉత్పత్తి నమోదైంది. సంస్థ రోజూ 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. 1.13 లక్షల టన్నులకే పరిమితమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు ఐదు నెలల్లో పరిశీలిస్తే 25.62 మిలియన్ టన్నుల లక్ష్యానికి 24.08 మిలియన్ టన్నులు (94 శాతం)గా ఉత్పత్తి నమోదైంది. అంటే దాదాపు 1.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి వెనుకంజలో ఉంది.
రెండు భేష్.. తొమ్మిది బ్యాక్
సంస్థ పరిధిలోని 11 ఏరియాలకు యాజమాన్యం ప్రతీనెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఇందులో ఆగస్టు నెలకు ఆర్జీ–1 ఏరియా 110 శాతం ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలవగా, ఆర్జీ–2 ఏరియా 108 శాతం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఇక కొత్తగూడెం ఏరియా 98 శాతం, ఆర్జీ–3 ఏరియా 86 శాతం, శ్రీరాంపూర్ 82, మణుగూరు 74, భూపాలపల్లి 72 శాతం, బెల్లంపల్లి 68, ఇల్లెందు 46, మందమర్రి 35, ఆండ్రియాల ఎనిమిది శాతంతో సరిపెట్టుకున్నాయి.
ఐదు నెలల్లో మూడు ఏరియాలు
సింగరేణి సంస్థ వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు ఐదు నెలల్లోనూ చాలా ఏరియాలు వెనుకబడ్డాయి. అయిదు మాసాలుగా కొత్తగూడెం ఏరియా 103 శాతం, మణుగూరు ఏరియా 102 శాతం, ఆర్జీ–2 ఏరియా 128 శాతం ఉత్పత్తి సాధించాయి.
ఇక ఇల్లెందు 74 శాతం, బెల్లంపల్లి 90, మందమర్రి 61, శ్రీరాంపూర్ 91, ఆర్జీ–1 ఏరియా 88, ఆర్జీ–3 ఏరియా 87, ఆండ్రియాలా 15 శాతం, భూపాలపల్లి ఏరియా 76 శాతం ఉత్పత్తి మాత్రమే సాధించగలిగాయి. ఇక సింగరేణి వ్యాప్తంగా కొత్తగూడెం ఏరియాలోనే అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి నమోదవుతోంది. అయిదు మాసాలుగా 57,74,900 టన్నుల లక్ష్యానికి 58,90,549 టన్నుల ఉత్పత్తి సాధించడం విశేషం.
100 శాతం ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి
ఆగస్టులో సింగరేణి పరిధిలోని జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈనెల బొగ్గు ఉత్పత్తి 81 శాతానికి పరిమితమైంది. ఇకనుంచి భూగర్భ గనులు, ఓసీల్లో 100 శాతం ఉత్పత్తి నమోదయ్యేలా గనుల వారీగా సమీక్షలు నిర్వహిస్తాం. ఏరియాల వారీగా అధికారులు పర్యవేక్షించేలా సూచనలు చేస్తాం. – కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)