శ్రీరాంపూర్‌ ఓసీకి ‘మట్టి’ కొట్టారు | Coal production dropped in Srirampur open cast mine | Sakshi
Sakshi News home page

శ్రీరాంపూర్‌ ఓసీకి ‘మట్టి’ కొట్టారు

Oct 14 2025 4:50 AM | Updated on Oct 14 2025 4:50 AM

Coal production dropped in Srirampur open cast mine

రెండు ఓబీ సంస్థలు చేతులెత్తేయడంతో నిలిచిన మట్టి వెలికితీత పనులు  

పడిపోయిన బొగ్గు ఉత్పత్తి 

ఆందోళనలతో అట్టుడుకుతున్నసింగరేణి ఉపరితల గని  

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్టు గని తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఓబీ(మట్టి) పనులు చేసే రెండు కాంట్రాక్ట్‌ సంస్థలు ఒక దాని తర్వాత ఒకటి చేతులెత్తేశాయి. దీంతో మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. గని ఏర్పడిన నాటినుంచి ఇలాంటి పరిస్థితి ఎన్నడూ రాలేదని అధికారులు పేర్కొంటున్నారు.  

రెండు సంస్థలకు ఓబీ పనులు  
శ్రీరాంపూర్‌ ఓసీలో ఓబీ వెలికితీత టెండర్‌ను సీఆర్‌ఆర్, జీవీఆర్‌ సంస్థలు దక్కించుకున్నాయి. నాలుగేళ్లు నిర్దేశిత ఓబీ వెలికి తీసేలా ఒప్పందం చేసుకున్నాయి. 2022 డిసెంబర్‌ 1 నుంచి సీఆర్‌ఆర్‌ సంస్థ పనులు చేపట్టింది. 2023 అక్టోబర్‌ 1 నుంచి జీవీఆర్‌ సంస్థ పనులు ప్రారంభించింది. సీఆర్‌ఆర్‌ సంస్థ 720 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తీయాల్సి ఉండగా, అక్టోబర్‌ 1 వరకు కేవలం 360 లక్షల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే వెలికితీసింది. జీవీఆర్‌ సంస్థ 495 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తీయాల్సి ఉండగా, 220 లక్షల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తీసింది.  

లాస్‌ వస్తుందని.... 
ఈ రెండు సంస్థలు తమకు నష్టం వస్తుందని అర్ధంతరంగా పనులు నిలిపివేశాయి. సీఆర్‌ఆర్‌ సంస్థ ఆగస్టు 27 నుంచి, జీవీఆర్‌ సంస్థ అక్టోబర్‌ 1 నుంచి పనులు చేయడం లేదు. టెండర్‌ ప్రకారం నాలుగేళ్ల కాలానికి నిర్దేశించిన ఓబీ తీయాల్సి ఉండగా, తమతో ఇక కాదని చేతులెత్తేశాయి. జీవీఆర్‌ సంస్థ ముందుగా నోటీసులు ఇచ్చి పనులు నిలిపివేయగా, సీఆర్‌ఆర్‌ సంస్థ చెప్పా పెట్టకుండానే పనులు నిలిపివేసింది. ఈ సంస్థకు సింగరేణి యాజమాన్యం పలుమార్లు నోటీసులు ఇచి్చంది. ఇస్తే ఇదిగో వస్తాం.. చేస్తాం.. అంటూ తప్పించుకున్నారు. చేసేది లేక యాజమాన్యం సీఆర్‌ఆర్‌ను టెర్మినేట్‌ చేసేలా నోటీసులు ఇచ్చింది.  

కంపెనీలపై ఫెనాల్టీల భారం  
రెండు సంస్థలకు సింగరేణి యాజమాన్యం రూ. 84 కోట్ల జరిమానా విధించింది. ఇందులో సీఆర్‌ఆర్‌ సంస్థకు రూ.57 కోట్లు, జీవీఆర్‌ సంస్థకు రూ. 27 కోట్ల ఫెనాల్టీ వేసింది. పనులు నిలిపివేయడానికి జరిమానా కూడా కారణమని తెలుస్తోంది.  

రోజుకు 12 వేల టన్నుల ఉత్పత్తికి ఆటంకం నష్టం  
ఓబీ సంస్థల నిర్వాహకంతో శ్రీరాంపూర్‌ ఓసీలో రోజుకు 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఈ కారణంగా సంస్థ రోజుకు రూ.కోటి వరకు నష్టపోతోంది. టెండర్‌ సమయంలో అధికారులు ఓబీ సంస్థల సామర్థ్యాన్ని అంచనా వేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓబీ సంస్థలు చేతులు ఎత్తేయడంతో సింగరేణి సొంతంగా ఓబీ పనులు చేపడుతోంది. సంస్థ ఉద్యోగులతో 3 షావల్స్‌తో ఓబీ వెలికి తీస్తున్నా.. రోజుకు కనీసం 5 వేల క్యూబిక్‌ మీటర్ల కూడా తీయలేకపోతోంది. 

మరోవైపు కాంట్రాక్టర్‌తో ఓబీ తీస్తే క్యూబిక్‌ మీటర్‌కు రూ.135 ఖర్చు అయితే నేడు కంపెనీ ఇందుకు రూ.400 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓసీలో ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 1 వరకు 16.09 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 14.58 లక్షల టన్నులు మాత్రమే వెలికితీశారు. 83 శాతం లక్ష్యాన్నే సాధించారు. సమస్య పరిష్కరించి ఓబీ, బొగ్గు ఉత్పత్తి పెంచకుంటే సంస్థ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.  

నిత్యం ఆందోళనలు.... 
ఇదిలా ఉంటే సీఆర్‌ఆర్‌ కాంట్రాక్టు సంస్థ నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కారి్మకులు నిత్యం ఆందోళనలు చేస్తున్నారు. కార్మికులకు రూ.4 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో వారు వాహనాల నిలిపివేత, ఆత్మహత్యాయత్నాలు, అధికారులు ఘెరావ్‌లతో గని ఉద్రిక్తంగా మారింది. వేతనాలు చెల్లించకుంటే గనిని పూర్తిగా మూసేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల పహారాలో ఓసీ నడుస్తోంది. వేతనాలు చెల్లించకుంటే మరో రెండు రోజుల్లో అధికారుల కార్యాలయాలకు తాళం వేస్తామని కార్మికులు అల్టిమేటం ఇచ్చారు.  

కొత్త టెండర్లు పిలిచాం.... 
జీవీఆర్‌ సంస్థ స్థానంలో మరో సంస్థ కోసం కొత్త టెండర్‌ పిలిచాం. రెండు మూడు నెలల్లో పనులు మొదలవుతాయి. ఇక సీఆర్‌ఆర్‌ ఇష్యూ కూడా సెటిల్‌ చేసి, దానికి కూడా టెండర్‌ పిలుస్తాం. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. రెండు టెండర్లు పూర్తయితే పనులు పంజుకుంటాయి. అప్పటి వరకు కంపెనీ ఆధ్వర్యంలో ఓబీ వెలికితీస్తూ వీలైనంత బొగ్గు ఉత్పత్తి చేస్తాం.   – చిప్ప వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు అధికారి, ఓసీపీ పీఓ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement