భర్త, కూతురిని చంపి.. మూడు రోజులుగా మృతదేహాలతో? | Shocking Incident In Khammam District | Sakshi
Sakshi News home page

భర్త, కూతురిని చంపి.. మూడు రోజులుగా మృతదేహాలతో?

Apr 27 2026 5:19 AM | Updated on Apr 27 2026 12:48 PM

Shocking Incident In Khammam District

ఖమ్మం క్రైం: తెలంగాణలోని ఖమ్మం బుర్హాన్‌పురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో తండ్రీ కుమార్తె మృతి చెందగా.. తల్లి, మరో కూతురు అపస్మారక స్థితిలో ఉండడాన్ని ఆదివారం రాత్రి పోలీసులు గుర్తించారు. నేలకొండపల్లి మండలం అనంతనగర్‌కు చెందిన కణతల రాము(29) ఓ దినపత్రికలో జర్నలిస్ట్‌ కాగా భార్య రమ్య, కుమార్తెలు దివ్య నైనీ(5), దీక్షితతో కలిసి బుర్హాన్‌పురంలో ఉంటున్నాడు. నాలుగైదు రోజులుగా రాముకు ఆయన కుటుంబ సభ్యులు ఫోన్‌చేసినా ఎత్తకపోగా.. ఆయన భార్య రమ్య ఫోన్‌ ఎత్తి ఆయనకు ఆరోగ్యం బాగా లేక తాను మాట్లాడుతున్నట్లు చెబుతోంది.

ఆదివారం ఉదయం ఒక మహిళ రమ్య ఇంటికి వచ్చి పిలవగా.. రమ్య దుప్పటి కప్పుకుని బయటకు వచ్చి రాము అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు చెప్పింది. ఇంట్లో దుర్వాసనపై ఆరా తీయగా.. ఇంట్లో ఎవరికీ బాగాలేకపోవడంతో శుభ్రం చేయలేదని బదులిచ్చింది. కాగా, ఆదివారం రాత్రి రమ్య సోదరుడు వీరి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా.. స్పందన లేకపోవడం, దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా మంచం కింద రాము, కూతురు దివ్యనైనీ మృతదేహాలు కనిపించాయి. గది నిండా రక్తం ఉంది. అప్పటికే ఇద్దరి మృతదేహాలు కుళ్లిపోయాయి. మంచం పక్కనే రమ్య, చిన్నకూతురు దీక్షిత అపస్మారక స్థితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

 

 

మూడు రోజులపాటు మృతదేహాలతో ఇంట్లోనే రమ్య ఉన్నా అబద్ధం ఆడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భర్త, కుమార్తెను హత్య చేసి గుట్టురట్టు కాకుండా ఎలుకల మందు కాస్త తాగి, చిన్న కూతురుకు కూడా తాగించి ఉంటుందని భావిస్తున్నారు. చిన్న కూతురు తలపై గాయాలు ఉండటంతో ఆమెను కూడా హత్య చేయడానికి పథకం రూపొందించి ఉంటుందని భావిస్తున్నారు. మూడు రోజుల క్రితమే వారు మృతి చెందితే భయపడి తాను బయటకు చెప్పలేదని అంగీకరించినా.. కారణాలు చెప్పలేదని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement