కదం తొక్కిన పాలమూరు సర్పంచ్‌లు

Sarpanches Protest In Telangana State Ministers Meeting - Sakshi

మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం

రసాభాసగా సర్పంచ్‌ల అవగాహన సదస్సు

సర్పంచుల తీరుపై మంత్రుల ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లా సర్పంచ్‌లు నిరసనబాట పట్టారు. ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్‌ రద్దు, రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న నూతన ఆసరా పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులు, ఉపాధిహామీ పథకం పనుల బిల్లులు, జనాభా ప్రాతిపదికన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరు, గ్రామ పంచాయతీలకు వీధిదీపాల నిర్వహణ తదితర డిమాండ్లు ఆమోదించాలని నినదించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని వైట్‌హౌస్‌లో అధికారులు ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల అవగాహనాసదస్సును బహిష్కరించారు. ఉదయం జిల్లా నలుమూలల నుంచి భారీర్యాలీలుగా వైట్‌హౌస్‌కు చేరుకున్న సర్పంచ్‌లు లోపలికి వెళ్లకుండా అరగంటపాటు బయట ఆందోళనకు దిగారు.

అప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ న్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సభాప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బయటికి వచ్చి సర్పంచ్‌లను సముదాయించే ప్రయత్నం చేశారు. సర్పంచ్‌లు చివరికి లోపలికి వచ్చి సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ల తీరుపై మంత్రులు దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు నా మాట వినకపోతే వెళ్లిపోతా. పరిస్థితి ఇలా ఉంటుం దనుకుంటే అధికారులతోనే సమీక్ష పెట్టుకునేవాళ్లం. పాలమూరు నుంచే సదస్సులు ప్రారంభించాలనుకున్నాం. మీరిలా చేయడం నన్ను బాధించింది’అని ఎర్రబెల్లి అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తీవ్ర ఉత్కంఠ నడుమ సర్పంచ్‌ల సదస్సు పూర్తయింది.

ఇప్పటికిప్పుడే మార్పు అసాధ్యం
పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పు ఇప్పటికిప్పుడే అసాధ్యమని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్‌ రద్దు విషయంలో న్యాయనిపుణుల సలహాలు తీసుకుని, సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘మీ గౌరవవేతనం మంజూరుకు ఉపసర్పంచ్‌ సంతకం తప్పనిసరి. కొంతమంది ఉపసర్పంచ్‌లు సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో చర్చించి నేరుగా అవి మీ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఉపసర్పంచులు వారంరోజుల్లో సంతకం చేయకుంటే వారి చెక్‌పవర్‌ను రద్దు చేసి ఆ అధికారం మీకు నమ్మకస్తుడైన వార్డ్‌మెంబర్‌కు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. అందుకూ ఓ పద్ధతి ఉంది. మీరు ముందుగా అధికారులకు పిటిషన్‌ ఇవ్వాలి. ఒకవేళ అధికారులూ స్పందించకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటాం’అని అన్నారు.

 సర్పంచ్‌లను సముదాయిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top