‘సోనూసూద్‌ అంకుల్‌నే కొడతారా’.. టీవీ పగలగొట్టిన బుడ్డోడు

Sangareddy: 7 Years Boy Breaks TV For Sonu Beaten Up In Film, Actor Reaction - Sakshi

సినిమాలో సోనూసూద్‌ను కొట్టారని టీవీ పగులగొట్టిన బుడతడు 

సాక్షి, న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): తన అభిమాన హీరో సోనూసూద్‌ను సినిమాలో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బుడతడు టీవీని పగుల గొట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. న్యాల్‌కల్‌లోని ఎస్సీ కాలనీకి చెందిన పుష్పలతకు సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన సీహెచ్‌ ప్రణయ్‌కుమార్‌తో ఎనమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి కుమారుడు విరాట్‌ హుజూర్‌నగర్‌లోని శ్రీచైత్య స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు.

కరోనా కారణంగా పాఠశాలలు మూత పడడంతో ఇటీవల న్యాల్‌కల్‌కు వచ్చాడు. సోమవారం రాత్రి ఇంట్లో మరదలు అద్విన్‌తో కలిసి టీవీలో దూకుడు సినిమా చూస్తున్నాడు. ఈ క్రమంలో హీరో మహేశ్‌బాబుకు విలన్‌ సోనూసూద్‌ మధ్య ఫైటింగ్‌ సీన్‌ జరుగుతుంది. సోనూసూద్‌ను కొట్టడాన్ని చూసిన బుడతడు విరాట్‌కు కోపం వచ్చింది. కరోనా  టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్‌ అంకుల్‌ని కొడతావా అంటూ బయటకు వెళ్లి ఓ రాయిని తెచ్చి టీవీపై కోపంతో కొట్టాడు. దీంతో టీవీ పగిలిపోయింది.

పక్కనే సినిమా చూస్తున్న మరదలు అద్విన్‌ టీవీని పగుల గొడతావా? ఇంకో టీవీ తీసుకరా అంటూ ఏడవ సాగింది. గమనించిన కుటుంబ సభ్యులు టీవీని ఎందుకు పగుల గొట్టావురా అంటూ విరాట్‌ను నిలదీశారు. అందరికీ సాయం చేస్తున్న సోనూసూద్‌ అంకుల్‌ను వేరే వాళ్లు కొడుతుంటే కోపం వచ్చి రాయితో కొట్టాను అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఈ విషయం కాస్తా అందరికి తెలియడంతో వైరల్‌గా మారింది. విరాట్‌ టీవీ పగలగొట్టిన ఘటన చివరికి సోనూసూద్‌ను చేరడంతో ట్విటర్‌లో స్పందించాడు. ‘అరేయ్‌.. మీ టీవీ పగలగొట్టకు.. మళ్లీ మీ నాన్న నన్ను కొత్త టీవీ కొనాలని అడుగుతాడు’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top