టీఎస్‌పీఎస్సీ అండర్‌ ‘కంట్రోల్‌’!

Sanctioned three posts including Controller of Examinations in Examination Department - Sakshi

పరీక్షల విభాగానికి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సహా మూడు పోస్టులు మంజూరు

కొత్తగా న్యాయ విభాగం ఏర్పాటు

మొత్తం 10 కొత్త పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

టీఎస్‌పీఎస్సీ ప్రతిపాదనలకు ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కీలకమైన పరీక్షల నిర్వ హణ, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ ను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీగా నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక విభాగాలు, పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా కొత్తగా 10 పోస్టులను మంజూరు చేసింది. ముఖ్యంగా పరీక్షల విభాగంపై దృష్టి పెట్టి కీలక మైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ సహా మూడు పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

లీకేజీల కలకలంతో..
వివిధ అర్హత పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఇందులో కీలకంగా వ్యవహరించగా, ప్రధాన నిందితుల్లో కమిషన్‌కు చెందిన పలువురు ఉద్యోగులు కూడా ఉండటం సంచలనం సృష్టించింది. కమిషన్‌లో ఉద్యోగులపై అజమాయిషీ తగ్గిందని, నియామ కాల్లో పలు స్థాయిలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

లీకేజీలతో ప్రతిష్ట మసక బారడంతో టీఎస్‌పీఎస్సీ నష్టనివారణ చర్యలు మొదలుపెట్టింది. పర్యవేక్షణ కట్టుదిట్టం చేసే దిశలో వివిధ స్థాయిల్లో అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, కమిషన్‌ ప్రతిపాదించిన 10 పోస్టులను మంజూరు చేసింది.

వీటిల్లో పరీక్షల నిర్వహణ విభాగంలో మూడు పోస్టులు, సమాచార విభాగంలో రెండు పోస్టులు, నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ లో రెండు పోస్టులు, ప్రోగ్రామింగ్‌ విభాగంలో రెండు పోస్టులున్నాయి. కమిషన్‌లో ప్రత్యేకంగా న్యాయ విభాగం ఏర్పాటు చేస్తూ ఆ విభాగానికి ప్రత్యేక న్యాయ అధికారిని నియమించాలని కోరగా ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది.

అన్నీ కొత్తగా నియమించాల్సిందే...
ఈ 10 పోస్టులు కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన వే. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్‌ పద్ధ తిలోనో లేక, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతి లోనో నియమించేలా కాకుండా శాశ్వత పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేర కు పోస్టుల వారీగా స్కేలును సైతం ఖరారు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

పరీక్షల నిర్వహణ ప్రత్యేక విభా గంపై అజమాయిషీకి ముగ్గురు అధికారులు ఉంటారు. సమాచారం గోప్యత తదితరాలకు మరో ఇద్దరు అధికారులు.. కమిషన్‌లో కంప్యూటర్లు, నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థ, ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలో కీలకంగా పనిచేసేందుకు నలుగురు అధికారులు ఉంటారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి స్థాయి అధికారి లా ఆఫీస ర్‌గా కొనసాగుతారు. ఈ మేరకు శాశ్వత ప్రాతిపది కన నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శిగా సంతోష్‌  
హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీఎం సంతోష్‌ను ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌కు బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న బీఎల్‌ఎన్‌ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. హెచ్‌జీసీఎల్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి బదిలీపై వెళ్లిన సంతోష్‌కు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ విభాగం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు కట్టబెట్టింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top