ఇంటి నుంచి నేరుగా ప్రయాణించేలా ... బస్సు టు క్యాబ్‌

RTC Set Up Cab Services All Alighting Points To Attract Passengers - Sakshi

సాక్షి హైదరాబాద్‌: గ్రేటర్‌లో ప్రజా రవాణా సదుపాయాలు విరివిగా అందుబాటులో ఉన్నప్పటికీ  ‘సీమ్‌లెస్‌’ జర్నీ ఒక కలగానే మారింది. నగరంలోని ప్రధాన రూట్‌లలో మెట్రో రైళ్లు  నడుస్తున్నాయి. కానీ ప్రయాణికులు తమ ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకొనే సదుపాయం లేదు. వందల కొద్దీ కాలనీలు, బస్తీలు, నగరంలోని అనేక ప్రాంతాలు మెట్రో రైలుకు దూరంగానే ఉన్నాయి. మరోవైపు  కాలనీలకు మినీ బస్సులను నడపాలనే ప్రతిపాదన కూడా ఇప్పటికీ అమలుకు నోచలేదు.

ఇక  హైదరాబాద్‌ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే  ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే వారికి కూడా లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ అందుబాటులో లేదు. బస్సు దిగిన ప్రయాణికులు గమ్యం చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో అన్ని అలైటింగ్‌ పాయింట్‌ల వద్ద క్యాబ్‌ సేవలను  ఏర్పాటు చేసి ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది.  

ఎదురు చూపులు లేకుండా... 
ప్రస్తుతం నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌ల నుంచి  ఓలా, ఉబెర్‌  క్యాబ్‌లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ముందే  ప్రయాణికులు  క్యాబ్‌లను బుక్‌ చేసుకోవచ్చు.  శంషాబాద్‌ విమాశ్రయంలోనూ ఈ తరహా క్యాబ్‌ సదుపాయం ఉంది. అలాగే  మహాత్మాగాంధీ, జూబ్లీ,దిల్‌సుఖ్‌నగర్, బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, తదితర బస్‌స్టేషన్‌లు, కోఠీ. కాచిగూడ, కూకట్‌పల్లి, హయత్‌నగర్‌ వంటి ప్రయాణ ప్రాంగణాల నుంచి  క్యాబ్‌ల సేవలను ఏర్పాటు చేయడం వల్ల సిటీ బస్సులు వెళ్లలేని కాలనీలకు  ప్రయాణికులు చేరుకోవచ్చు.

బస్సు కోసం  పడిగాపులు అవసరం లేకుండా లాస్ట్‌మైల్‌ వరకు ప్రయాణ సదుపాయం లభిస్తుంది. మరోవైపు  ఆర్టీసీపైన  ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ఇందుకనుగుణంగా  క్యాబ్‌ల అనుసంధానంపైన  దృష్టి సారించినట్లు ఆర్టీసీ  అధికారి ఒకరు  తెలిపారు. ‘బస్సు దిగిన వాళ్లు ఆటో, క్యాబ్‌ వంటి వాహనాల్లో తమకు నచ్చినది ఎంపిక చేసుకొని  వెళ్లవచ్చు.కానీ  ఆర్టీసీ అలైటింగ్‌ పాయింట్‌ల వద్ద  క్యాబ్‌లు ఉంటాయనే భరోసా ముఖ్యం. అందుకోసమే ఈ అనుసంధాన ప్రక్రియ..’ అని  వివరించారు.  

అలైటింగ్‌ పాయింట్‌ల గుర్తింపు 
త్వరలోనే నగరంలోని అన్ని  ప్రాంతాల్లో అలైటింగ్‌ పాయింట్‌లను గుర్తించనున్నారు. ఏయే ప్రాంతాల నుంచి ప్రయాణికులు  ఎక్కడికి బయలుదేరుతున్నారనే అంశం ప్రాతిపదికగా  వీటి ఎంపిక ఉంటుంది. సిటీ బస్సులు చేరుకోలేని ప్రాంతాలకు  క్యాబ్‌లు వెళ్లే విధంగా అలైటింగ్‌ కేంద్రాలను  గుర్తిస్తారు. మరోవైపు  ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా క్యాబ్‌ల అనుసంధానం  ఉంటుంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top