
మంత్రి సీతక్కకు అంచనా వివరాలు నివేదించిన అధికారులు
వర్షాల పరిస్థితిపై మంత్రి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న 86.55 కి.మీ. మేర గ్రామీణ రహదారులను శాశ్వత ప్రాతిపదికన పునర్‌నిర్మించేందుకు రూ.143 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసినట్టు మంత్రి సీతక్కకు నివేదిక సమరి్పంచింది. వాటికి మరమ్మతు చేసి తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు రూ.6.5 కోట్లు ఖర్చవుతాయని వెల్లడించింది. ఆదివారం మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్సుద్వారా వర్షాలపై పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులు గ్రామీణ రోడ్లకు జరిగిన నష్టంపై వివరాలను మంత్రి దృష్టికి తెచ్చారు. భారీ వర్షాలతో కొన్ని గ్రామాలకు రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోతే, తిరిగి పునరుద్ధరించామని ఈఎన్‌సీ అశోక్ పేర్కొన్నారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని, వరద తగ్గుముఖం పట్టగానే ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలను అంచనా వేసి వెంటనే మరమ్మతు చేసి ప్రజలకు ఇబ్బంది ఎదురుకాకుండా చూడాలని మంత్రి సీతక్క ఆదేశించారు.