
రూ.8 వేల విరాళం ఇవ్వాలని ఫ్లెక్సీలు కట్టిన
పంచాయతీ కార్యదర్శి
మంత్రి సీతక్క ఇలాకాలో చర్చనీయాంశం
ములుగు: ‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు.. మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే మన గ్రామ పంచాయతీకి వెళ్లి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’అనే ఫ్లెక్సీని ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండల పంచాయతీ కార్యదర్శి చందులాల్ స్వయంగా ఫ్లెక్సీ కట్టడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సొంత ఇలాకాలో.. అదీ సొంత శాఖలోనే నిధులు లేవా అన్న చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కట్టడమే కాకుండా మండల కేంద్రంలోని పలు కూడళ్లలో సిబ్బందితో ఫ్లెక్సీలను కట్టించి వాట్సాప్ గ్రూప్‌లో సైతం ఫొటోలు ఆప్‌లోడ్ చేశాడు. దీంతో ప్రతిపక్ష నాయకులతోపాటు గ్రా మస్తులు మేజర్ గ్రామపంచాయతీ అయిన వెంకటాపురంలో తోపుడు బండి కోనేందుకు రూ.8వేలు లేవా అంటూ విమర్శిస్తున్నారు.
ఓ పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిధులు లేవంటూ ఫ్లె క్సీలు కట్టడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయమై డీపీ ఓ దేవరాజ్‌ను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి చందులాల్ ఫ్లెక్సీలు కట్టిన విషయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి చందూలాల్‌ను వివరణ కోరగా పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచేందుకు కొత్త తరహాలో ఆలోచించి ఫ్లెక్సీలు కట్టించినట్లు వెల్లడించారు.