
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ శాసనమండలిలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు చేరి ‘‘రాహుల్‌కు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఆందోళనల నడుమే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు వీలుగా రూపొందించిన తెలంగాణ పంచాయతీరాజ్ 2025 బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు.
అయితే.. ఈ పరిణామంతో బీఆర్‌ఎస్ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. కాళేశ్వరం ప్రతులను చించేసి మండలి చైర్మన్ మీదకు విసిరేశారు. దీంతో.. మంత్రి పొన్నం బీఆర్‌ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్‌ఎస్ ఫ్యూడలిస్ట్ పార్టీ. బీసీల అంశం చర్చకు వస్తె.. ఇలా అడ్డుపడటం సరికాదు. బీసీల పట్ల వాళ్లకున్న గౌరవం, వైఖరి స్పష్టమవుతోంది. సమాజం వాళ్లను గమనిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోకండి. సర్వేలో కూడా పాల్గొనలేదు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఏం పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మీ పార్టీకి బీసీ రిజర్వేషన్లు ఇష్టం లేకపోవచ్చు. కానీ, ఇలా అడ్డుకునే కుట్ర మాత్రం దౌర్భాగ్యం అని మంత్రి పొన్నం అన్నారు.
సభలో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో వాళ్ల బంధం తెగిపోయింది. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టిఆర్ఎస్‌కు తెలంగాణ మాట పలికే అర్హతను కోల్పోయింది అని అన్నారామె.
అయినా బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగడంతో.. చర్చ లేకుండానే పంచాయతీ చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది.