దొంగిలించిన కారులో వెళ్తుండగా ప్రమాదం.. చికిత్స పొందుతూ మరో బైక్‌ చోరీ

Road Accident While Thieves Going In a Stolen car At Mulugu - Sakshi

సాక్షి, ములుగు: కారును దొంగిలించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారి ఆశలు అడియాశలయ్యాయి. తప్పించుకునే తొందరలో వేగంగా వెళ్లిన దొంగలకారు విద్యుత్‌ స్థంభానికి ఢీ కొట్టడంతో ఆస్పత్రిపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్‌ అప్సర్‌ కారు తన ఇంటి వద్ద నిలిపి ఉండగా ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించి, కారును వేగంగా నడుపుతూ తీసుకెళ్తుండగా మంగపేట మండలం గంపోనిగూడెం వద్ద విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టారు. దీంతో ఇద్దరు గాయపడడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించారు.

వీరిలో ఒకరు తాడ్వాయి మండలం వీరాపురం గ్రామానికి చెందిన చీరల సందీప్‌ కాగా.. మరొకరు రాజ్‌కుమార్‌గా గు ర్తించారు. మంగపేట పోలీస్‌స్టేషన్‌లో రోడ్డు ప్రమా దం కేసు నమోదు కాగా, ఏటూరునాగారంలో కారు అపహరణ కేసు నమోదైంది. అయితే ఇందులో ట్విస్ట్‌ ఏమిటంటే ఆ ఇద్దరిలో రాజ్‌కుమార్‌ ఏటూరునాగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సామాజిక ఆస్పత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్న గడ్డం దశరథం 108 డ్రైవర్‌ బైక్‌ను తీసుకొని ఆస్పత్రి నుంచి పరారయ్యాడు.

దీంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది, బైక్‌ యజమాని తలలు పట్టుకుంటున్నారు. ఒక కారుతో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి దొంగతనం బయటపడి పోలీసులకు చిక్కగా చికిత్స పొందుతూ మరో బైక్‌ను దొంగలించడం హాట్‌ టాపింగ్‌ మారింది.  అంతేకాకుండా పోలీసులకు చిక్కినట్లే చిక్కి ఒక దొంగ పారిపోవడం గమనార్హం.  ఇద్దరు దొంగలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కానీ, సోమవారం రాత్రి వరకు కూడా బైక్‌పై పారిపోయిన వ్యక్తి వివరాలు తెలియలేదు.
చదవండి: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్‌ జర్నలిస్ట్‌ మృతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top