TSPSC: వారిని ఎలా పరీక్ష రాయనిస్తారు?.. ర్యాంకులు ఎలా వచ్చాయి?

Revanth Reddy Sensational Allegations On TSPSC Paper Leak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీక్‌ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. సర్కార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రేవంత్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీక్‌ దారుణం. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులు నష్టపోతున్నారు. పేపర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ఈ వ్యవహారంలో ఇద్దరికే సంబంధం ఉందంటూ కేటీఆర్‌ అతి తెలివితేటలు ప్రదర్శించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. వారంతా ఎక్కడున్నారు?. 2015 నుంచి పేపర్‌ లీక్‌లు జరుగుతున్నాయి. 

నిందితులు ఉన్న చంచలగూడ జైలుకు మధ్యవర్తిత్వం చేయడానికి ఎవరు వెళ్లారు?. పేర్లు బయటపెడితే చంపేస్తామన్నారో అన్ని బయటకు రావాలి. చంచల్‌ గూడ సందర్శకుల జాబితాను చూపించాలి. సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేయాలి. పేపర్‌ లీక్‌ వెనుక ఎవరున్నారో తేలతెల్లం చేయాలి. నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకోక ముందే రాజశేఖర్‌, ప్రవీణ్‌ మాత్రమే నిందితులని కేటీఆర్‌ ఎలా నిర్దారించారు?. టీఎస్పీఎస్సీలో పనిచేసే ఉద్యోగులెవరైనా ఆ సంస్థ నిబంధనల మేరకు కమిషన్‌ నిర్వహించే పరీక్షలకు పోటీ పడేందుకు అనర్హులు. 

కానీ, కేసీఆర్, కేటీఆర్ చొరవతో 20 మంది ఉద్యోగులకు ఎన్వోసీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..?. ఒకవేళ పోటీ పరీక్ష రాయాలంటే రాజీనామా చేయాలి, లాంగ్ లీవ్‌లో వెళ్లాలి లేదా ఇతర శాఖలకు బదిలీపై వెళ్లి ఉండాలి. టీఎస్పీఎస్సీలో పనిచేసే మాధురీకి ఫస్ట్ ర్యాంక్ రావడం‌, రజనీకాంత్ రెడ్డికి నాల్గో ర్యాంక్ రావడం వెనుక  కారణాలేంటో తెలియాలి. మల్యాల మండలం నుంచి ఎగ్జామ్ రాసిన వారిలో 25 మందికి 103 అత్యధిక మార్కులు రావడం వెనుక ఏం జరిగిందో తేలాలి. నిందితులందరి పూర్తి వివరాలు వెల్లడించాలి. సిట్ దర్యాప్తుపై ఏమాత్రం నమ్మకం లేదంటూ కీలక వాఖ్యలు చేశారు. ఈ కేసును కూడా సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ రేపు కోర్టును మేం కోరతాం. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు  ఈ కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top